Iran: మా అణుకేంద్రాలు బాగా దెబ్బతిన్నాయి... అంగీకరించిన ఇరాన్
ABN , Publish Date - Jun 25 , 2025 | 08:24 PM
ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బషుయీ బుధవారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా దాడుల్లో తమ అణు కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు ధ్రువీకరించారు.

టెహ్రాన్: 'ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్' పేరుతో ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై బీ-2 స్పిరిట్ బాంబర్లలో అమెరికా గత వారంలో దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ అణు కేంద్రాలు ధ్వంసమయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ప్రకటించారు. అయితే, ఏ మేరకు నష్టం జరిగిందనే విషయంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ వచ్చాయి. జరిగిన నష్టం తక్కువేనని, అమెరికా ఆపరేషన్ ఫెయిల్ అనే ప్రచారం కూడా జరిగింది. అయితే, దీనిపై ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బషుయీ (Esmail Baghaei) బుధవారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా దాడుల్లో తమ అణుకేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు ఆయన ధ్రువీకరించారు.
'మా అణుకేంద్రాలు బాగా దెబ్బతిన్నాయని నిశ్చయంగా చెప్పగలను' అని బషుయీ తెలిపారు. అయితే మరిన్ని వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. ఇరాన్ అణుసంస్థతోపాటు ఇతర ఏజెన్సీలు పరిస్థితిని అంచనా వేస్తున్నాయని చెప్పారు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి సంప్రదింపులు జరిపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నెథర్లాండ్స్‌లో జరిగిన 'నాటో' సమ్మిట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్ అణుకేంద్రాలపై కచ్చితమైన దాడులు జరిపామని చెప్పారు. 'వారికి అణుబాంబు ఉండదు, దాన్ని వాళ్లు అభివృద్ధి చేయబోవడం లేదు' అని చెప్పారు.
మరోవైపు ఇరాన్ మాత్రం తమ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ను వదులుకోవడం లేదని చెబుతోంది. తమ అణుకేంద్రాల భద్రతకు హామీ ఇచ్చేంత వరకూ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ)కు సహకారాన్ని నిలిపివేయాలనీ ఇరాన్ పార్లమెంటు తీర్మానించింది. దీనిపై ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రఫేల్ మరియానో గ్రాస్సి వియన్నాలో మాట్లాడుతూ.. న్యూక్లియర్ కేంద్రాల తనిఖీలను తిరిగి ప్రారంభించేందుకు చర్చలు జరపాలని ఇరాన్‌కు తాను ఇప్పటికే లేఖ రాసినట్టు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
రహస్యంగా న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైళ్లను అభివృద్ధి చేస్తున్న పాక్
కమాండర్ అభినందన్‌ను బంధించిన పాకిస్థాన్ మేజర్ హతం
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి