Most Wanted: అమెరికా FBIకి చిక్కిన ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్
ABN , Publish Date - Jul 13 , 2025 | 06:05 PM
అమెరికా FBI తాజాగా అరెస్టు చేసిన 8 మంది ఖలిస్తానీ ఉగ్రవాదులలో భారతదేశపు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఉన్నాడు. భారతదేశ జాతీయ దర్యాప్తు సంస్థ NIA అతడి కోసం..

వాషింగ్టన్: భారతదేశ జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న క్రిమినల్ అమెరికాలో పట్టుబడ్డాడు. పంజాబ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ పవిత్తర్ సింగ్ బటాలా, మరో ఏడుగురు ఖలిస్తానీ ఉగ్రవాదులను అమెరికాలోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI)అరెస్ట్ చేసింది. ఒక ముఠా సంబంధిత కిడ్నాప్ కేసులో ఈ అరెస్టులు జరిగాయి.
కాగా, నిందితుడు బటాలా నిషేధిత ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI)తో సంబంధాలు కలిగి ఉండటం, ఇంకా అనేక ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్నందుకు భారతదేశం అతడ్ని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. అమెరికాలోని స్థానిక షెరీఫ్ కార్యాలయం అందిస్తున్న సమాచారం ప్రకారం.. అమెరికాలోని శాన్ జోక్విన్ కౌంటీలో జరిగిన కిడ్నాప్, హింసకు సంబంధించిన కేసులో శుక్రవారం అమెరికాలోని వివిధ ప్రాంతాలలో వీరిని అరెస్టు చేశామని తెలిపింది.
బటాలాతోపాటు, ఇతర అనుమానితులను దిల్‌ప్రీత్ సింగ్, అమృత్‌పాల్ సింగ్, అర్ష్‌ప్రీత్ సింగ్, మన్‌ప్రీత్ రంధావా, సరబ్‌జిత్ సింగ్, గుర్తాజ్ సింగ్, ఇంకా విశాల్ గా గుర్తించారు. నిందితులందరిపై కిడ్నాప్, హింస, నిర్బంధం, సాక్షిని బెదిరించడం, సెమీ ఆటోమేటిక్ తుపాకీతో దాడి చేయడం, క్రిమినల్ బెదిరింపులు వంటి వివిధ అభియోగాలపై కేసు నమోదు చేసి శాన్ జోక్విన్ కౌంటీ జైలుకు పంపారు.
సోదాల సమయంలో అధికారులు వీరి నుంచి ఆరు తుపాకులను, పూర్తిగా ఆటోమేటిక్ గ్లాక్‌తో సహా వందలాది రౌండ్ల బుల్లెట్లు, మ్యాగజైన్‌లు, $15,000 కంటే ఎక్కువ నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
కాగా, ఇటీవలి కాలంలో గోల్డీ బ్రార్, అన్మోల్ బిష్ణోయ్, ఇంకా రోహిత్ గొదారాతో సహా భారతదేశం నుంచి అనేక మంది ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు చట్టం నుంచి తప్పించుకునేందుకు US, కెనడాను తమ కొత్త రహస్య స్థావరంగా మార్చుకున్నారు. వీరంతా ఉత్తర అమెరికా దేశాలలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించి, అక్కడి నుంచి భారత్ సహా వివిధ దేశాలలో తమ నేర కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి