Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు ఏమైంది... జైలులోనే చంపేశారంటూ షాకింగ్ కథనాలు
ABN , Publish Date - Nov 26 , 2025 | 05:44 PM
ఇమ్రాన్ ఖాన్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియోలో రావడంతో పెద్ద ఎత్తున ఆయన మద్దతుదారులు జైలు బయట గుమిగూడినట్టు, ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులను జైలులోకి అనుమతించాలని డిమాండ్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)ను జైలులోనే హతమార్చారంటూ సోషల్ మీడియాల్లో దిగ్భ్రాంతికరమైన కథనాలు వెలువడుతున్నాయి. వీటికి సంబంధించినవిగా చెబుతున్న ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. 2023 నుంచి అడియాలా జైలులో ఉంటున్న ఇమ్రాన్ ఖాన్‌ను జైలులో టార్చర్ పెట్టి చంపేశారని కథనాలు వెలువడుతున్నాయి. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ, అసిమ్ మునీర్ కలిసి ఆయనను హతమార్చినట్టు బలూచిస్థాన్ విదేశాంగ శాక తమ 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే ఈ కథనాలను అధికారింగా ఇంకా ఎవరూ ధ్రువీకరించలేదు.
ఇమ్రాన్ ఖాన్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియోలో రావడంతో పెద్ద ఎత్తున ఆయన మద్దతుదారులు జైలు బయట గుమిగూడినట్టు, ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులను జైలులోకి అనుమతించాలని డిమాండ్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అడియాలా జైలులోనే ఆయనను హత్య చేసినట్టు పాకిస్థాన్ సోషల్ మీడియాలో కాకుండా అఫ్గాన్ మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి.
కొద్ది నెలలుగా బాహ్యప్రపంచానికి దూరంగా..
కాగా, గత కొద్ది నెలలుగా ఇమ్రాన్ ఖాన్ వివరాలు బయటకు రావడం లేదు. ఆయనను కలవడానికి వీళ్లేదంటూ కుటంబసభ్యులు, మిత్రులు, రాజకీయనాయకులపై ఆంక్షలు విధించినట్టు చెబుతున్నారు. ఇమ్రాన్ సోదరీమణులు మంగళవారంనాడు ఆయనను కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ అధికారులు నిరాకరించడంతో ఇమ్రాన్ జైలులోనే మరణించారనే వార్తలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. అనారోగ్యంతో ఇమ్రాన్ మరణించి ఉంటారనే వార్తలు కూడా వినిపిస్తున్నప్పటికీ అధికారికంగా ధ్రువీకరించే ఆధారాలు మాత్రం బయటకు రాలేదు.