Balochistan Woman Viral Video: ఇష్టం లేని పెళ్లి చేసుకుందని..
ABN , Publish Date - Jul 22 , 2025 | 04:51 PM
కుటుంబానికి ఇష్టం లేకుండా ఆ యువతి పెళ్లి చేసుకుంది. దీంతో ఆమె సోదరుడు తమ తెగకు చెందిన నాయకుడికి ఫిర్యాదు చేశాడు. ఈ విషయంలో తెగ నాయకుడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయాన్ని ఆ యువతి సోదరుడితోపాటు కుటుంబ సభ్యులు అమలు చేశారు.

ఇస్లామాబాద్, జులై 22: పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా ఒక జంట వివాహం చేసుకుని ఒక్కటైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆ జంటను హత్య చేయడం ద్వారా పరువు హత్యకు పాల్పడ్డారు. ఇష్టం లేకుండా వివాహం చేసుకున్న యువతిని ఆమె కుటుంబ సభ్యులతోపాటు సోదరుడు కాల్చి చంపారు. అందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బెలూచిస్థాన్ రాజధాని క్వెట్టా శివారులోని ఏడారి ప్రాంతంలోకి ఆ యువతిని ఆమె కుటుంబ సభ్యులు వాహనంలో తీసుకు వచ్చారు. అనంతరం ఆమెను నిర్మానుష్య ప్రాంతంలో వదిలారు. ఆ తర్వాత ఆమె తన తలపై శాలువా కప్పుకుంది. ఆమెకు ఖురాన్ అందించారు. ఆ యువతి ఖురాన్ చదువుతుండగా.. ఆమె సోదరుడితోపాటు ఇతర కుటుంబ సభ్యులు తుపాకులతో కాల్చి చంపారు. అయితే ఆమెపై కాల్పులు జరిపే సమయంలో.. నువ్వు నన్ను కేవలం కాల్చగలవంటూ బిగ్గరగా ఆరిచింది. ఆ సమయంలో ఆమె శరీరంపై వరుసగా కాల్పులు జరిపారు. దీంతో ఆమె రక్తం మడుగులో కుప్పకూలి పడిపోయింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
ఈ వీడియోపై పోలీసులు దృష్టి కేంద్రీకరించి.. దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా ఈ పరువు హత్య ఘటన ఈ ఏడాది మేలో జరిగిందని వారు గుర్తించారు. ఇది ఈద్ అల్ అద్హకు మూడు రోజుల ముందు జరిగిందని కనుగున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా ఈ కాల్పుల్లో మరణించిన జంట బానో బిబి, అసన్ ఉల్లాహ్‌గా పోలీసులు గుర్తించారు. అలాగే ఈ కేసుతో సంబంధముందని భావిస్తున్న 13 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
తన సోదరి తమ కుటుంబ సభ్యులకు ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకుందంటూ తెగ నాయకుడికి ఆమె సోదరుడు ఫిర్యాదు చేశాడు. దీంతో తెగ నాయకుడి ఆదేశాల మేరకు ఆ యువతతోపాటు ఆమె వివాహం చేసుకున్న వ్యక్తిని వారు కాల్చి చంపారు. ఈ మేరకు పోలీస్ ఉన్నతాధికారి నవీద్ అఖ్తర్ వెల్లడించారు. అయితే గతేడాది అంటే.. 2024లో ఈ తరహా పరువు హత్యలు దేశవ్యాప్తంగా 405 వరకు జరిగాయని పాకిస్థాన్ మానవ హక్కుల సంఘం ఈ సందర్భంగా ప్రకటించింది. ఇది కేవలం అధికారికంగా మాత్రమేనని.. కానీ అనధికారంగా ఈ తరహా పరువు హత్యలు అధికంగా జరిగాయని సామాజిక కార్యకర్తలు వివరించారు. ఇక యువతి వివాహం చేసుకున్న వ్యక్తిని కాల్చి చంపిన ఘటన మాత్రం ఈ వీడియోలో స్పష్టం చేయలేదు.
(బెలూచిస్థాన్‌లోని పలువురి వ్యక్తుల నిరంకుశ ధోరణి కారణంగా యువతి మరణించిన వీడియో దారుణంగా ఉంది. అందువల్ల ఈ వీడియోను తొలగించి.. ప్రింట్ స్క్రీన్‌ను ఇక్కడ పొందు పరుస్తున్నాం)
ఇవీ చదవండి:
నదిలో లైవ్ రిపోర్టింగ్.. కాళ్ల కిందకి మృతదేహం..
సింగపూర్ ఎయిర్‌పోర్టులో భారతీయుల రచ్చ.. పరువు తీసేశారంటూ జనాల ఆగ్రహం