Harvard vs Trump: అమెరికా విద్యావ్యవస్థలో అనవసర రాజకీయ జోక్యం
ABN , Publish Date - Apr 23 , 2025 | 03:11 AM
గ్రాంట్ల నిలిపివేతకు కారణంగా విద్యాసంస్థల స్వతంత్రతను హరించే ప్రయత్నం జరుగుతోందని హార్వర్డ్ వర్సిటీ అభిప్రాయపడింది. కోర్టుకు వెళ్లడం ద్వారా విద్యా స్వేచ్ఛను కాపాడే సంకల్పాన్ని స్పష్టంగా చాటింది.

ట్రంప్ సర్కారు చర్యలను ఖండించిన 100కుపైగా యూనివర్సిటీలు
రూ.17 వేల కోట్ల గ్రాంట్ల
నిలిపివేతపై హార్వర్డ్ వర్సిటీ దావా
వాషింగ్టన్/బోస్టన్, ఏప్రిల్ 22: విద్యావ్యవస్థలో ట్రంప్ సర్కారు అనవసర రాజకీయ జోక్యాన్ని ఖండిస్తూ అమెరికా వ్యాప్తంగా 100కుపైగా యూనివర్సిటీలు, కాలేజీలు ఒక సంయుక్త లేఖను విడుదల చేశాయి. గతంలో ఎప్పుడూ ఇలా జరుగలేదని మంగళవారం రాసిన ఆ లేఖలో పేర్కొన్నాయి. హార్వర్డ్, ప్రిన్స్‌టన్, బ్రౌన్ తదితర ప్రఖ్యాత యూనిర్సిటీల నుంచి చిన్న కాలేజీల వరకు వివిధ విద్యాసంస్థల ప్రతినిధులు ఆ లేఖపై సంతకాలు చేశారు. క్యాంప్‌సలపై ప్రభుత్వ అనవసర నియంత్రణలను తిరస్కరిస్తున్నామని ఆ లేఖలో తేల్చిచెప్పారు. ఈ పరిణామాలు అమెరికా ఉన్నత విద్యావ్యవస్థకు ప్రమాదకరంగా పరిణమించాయని పేర్కొన్నారు.
మరోవైపు హార్వర్డ్ యూనివర్సిటీకి రూ.17,039 కోట్ల(2 బిలియన్ డాలర్లు) గ్రాంట్లను నిలిపివే సిన ట్రంప్ సర్కారుపై ఆ వర్సిటీ బోస్టన్‌లోని ఫెడరల్ కోర్టులో దావా వేసింది. వర్సిటీ క్యాంప్‌సలో కార్యకలాపాలపై పరిమితులు విధించేందుకు, అడ్మిషన్ విధానాల్లో మార్పులు, నాయకత్వ సంస్కరణల కోసం ట్రంప్ యంత్రాంగం చేసిన ఆదేశాలను ధిక్కరించడమే గ్రాంట్ల నిలిపివేతకు కారణం. క్యాంపస్ కార్యకలాపాలపై ఆడిట్ నిర్వహించాలని, కొన్ని విద్యార్థి క్లబ్‌ల గుర్తింపును నిలిపివేయాలని సూచిస్తూ ఈనెల 11న ట్రంప్ యంత్రాంగం హార్వర్డ్ వర్సిటీకి లేఖ రాసింది. అయితే, అలాంటి డిమాండ్లకు తాము తలొగ్గేది లేదని వర్సిటీ అధ్యక్షుడు అలాన్ గర్బర్ తేల్చిచెప్పారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే వర్సిటీకి బిలియన్ డాలర్ల ఫెడరల్ ఫండింగ్‌ను ప్రభుత్వం నిలిపివేసింది.