Gaza Famine Crisis: ఆకలి చావుల అంచున గాజా
ABN , Publish Date - Jul 26 , 2025 | 03:37 AM
గాజాలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. యుద్ధం కారణంగా మహిళలు..

పిట్టల్లా రాలిపోతున్న చిన్నారులు
నిత్యావసరాల సరఫరాపై ఇజ్రాయెల్ ఆంక్షలే కారణం
ఇజ్రాయెల్-హమాస్ శాంతి చర్చలు నిలిపివేసిన అమెరికా!
పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించనున్న ఫ్రాన్స్
గాజా, పారిస్, వాషింగ్టన్, జూలై 25: గాజాలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. యుద్ధం కారణంగా మహిళలు, చిన్నారుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ముఖ్యంగా పోషకాహార లోపం, ఆకలితో చిన్నారులు అల్లాడి పోతున్నారు. శరీరం బక్కచిక్కి, పొత్తి కడుపులు ముడుచుకుపోయి, ఎముకలు తేలిన చిన్నారుల పరిస్ధితి హృదయ విదారకంగా తయారైంది. చిన్నారులు కనీసం నడవలేకపోతున్నారు. ఏడిచే ఓపిక కూడా లేని స్థితి. ఆకలి బాధలు తట్టుకోలేక చిన్న పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు. మొత్తం 113 మంది ప్రాణాలు కోల్పోగా ఇందులో 81మంది చిన్నారులున్నారు. సుమారు లక్షమంది మహిళలు, చిన్నారులు పోషకాహారలోపంతో బాధపడుతున్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. మరోవైపు ఆసుపత్రుల్లో అవసరమైన ఔషదాలు లేక డాక్టర్లు కూడా చేతులెత్తేస్తున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తాయని, తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని 100కు పైగా సహాయ సంస్థలు హెచ్చరించాయి.
ఆరు వేల వాహనాలు సిద్ధం
నిజానికి గాజాలో మానవతా సాయం అందించాలంటే రోజుకు 600 ట్రక్కులు అవసరమవుతాయి. అయితే ప్రస్తుత పరిస్ధితుల్లో ఇజ్రాయెల్ ఆంక్షల కారణంగా రోజుకు 69 ట్రక్కులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ తరుణంలో గాజాలో ప్రజలకు ఆహారం, తాగునీరు, ఔషధాలు అందించేందుకు 6 వేల వాహనాలు సిద్ధంగా ఉన్నాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఇజ్రాయెల్ అనుమతిస్తే ఈ వాహనాలన్నీ ఈజిప్ట్, జోర్డాన్ నుంచి గాజాలోకి వస్తాయని వెల్లడించింది. మానవతా సాయం అందించేందుకు ఇజ్రాయెల్ తక్షణమే అంగీకరించాలని సూచించింది.
శాంతి చర్చల నిలిపివేత!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఈజిప్ట్, ఖతర్ మధ్యవర్తిత్వంలో జరుగుతున్న శాంతి చర్చలు నిలిపివేయాలని అమెరికా నిర్ణయించుకున్నట్లు సమాచారం. హమాస్ తీరుపై అసంతృప్తిగా ఉన్న అగ్రరాజ్యం తమ శాంతి చర్చల బృందాన్ని పశ్చిమాసియా నుంచి వెనక్కి రావాలని పురామాయించినట్లు తెలిసింది. ఇజ్రాయెల్ కూడా తమ శాంతి చర్చల బృందాన్ని తిరిగి వచ్చేయాలని సూచించింది. మరోవైపు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మ్యాక్రాన్ ప్రకటించారు. సెప్టెంబరులో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో దీనిపై నిర్ణయాన్ని ప్రకటిస్తామంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. గాజాలో తక్షణమే మానవతా సాయం అందాలని ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి
వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
For More Andhrapradesh News And Telugu News