Share News

Spider Web Operaion: 'స్పైడర్ వెబ్' ఆపరేషన్.. ఉక్రెయిన్ డ్రోన్ దాడి ఎలా చేసిందో తెలిస్తే అవాక్కవుతాం

ABN , Publish Date - Jun 02 , 2025 | 05:25 PM

రష్యా 2022లో దండెత్తినప్పటి నుంచి ఆ దేశంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు సాగిస్తోంది. అయితే ఈసారి అనుసరించిన కార్యాచరణ పద్ధతి మాత్రం వీటికి పూర్తి భిన్నంగా జరిగింది. ఏడాదిన్నర పాటు జరిపిన పక్కా ప్లానింగ్‌తో 'స్పైడర్ వెబ్' ఆపరేషన్‌కు ఉక్రెయిన్ దిగింది.

Spider Web Operaion: 'స్పైడర్ వెబ్' ఆపరేషన్.. ఉక్రెయిన్ డ్రోన్ దాడి ఎలా చేసిందో తెలిస్తే అవాక్కవుతాం

మాస్కో: రష్యా భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్ తమ సాయుధ దళాలు అద్భుతమైన ఆపరేషన్ నిర్వహించినట్టు ప్రకటించింది. రష్యాకు చెందిన 40 విమానాలను ధ్వంసం చేసినట్టు తెలిపింది. ఈ ఆపరేషన్‌కు 'స్పైడర్ వెబ్' (Spider Web) అనే పేరు పెట్టినట్టు పేర్కొంది. ఫ్రంట్ లైన్‌కు వేల కిలోమీటర్ల దూరంలోని ఐదు కీలకమైన రష్యా మిలటరీ ఎయిర్‌బేస్‌లను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ ఈ డ్రోన్ దాడులు జరిపింది. ఉక్రెయిన్ సిటీలపై విరుచుకుపడేందుకు 41 ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ (SBU) రంగంలోకి దింపింది. వీటిలో టీయూ-95, టీయూ-22 స్ట్రాటజిక్ బాంబర్స్, ఏ-50 రాడార్ డిటెక్షన్ అండ్ కమాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ కూడా ఉన్నాయి.


ఫస్ట్ పెర్సన్ వ్యూ (ఎఫ్‌పీవీ) డ్రోన్లతో రష్యాలోని ముర్మన్స్క్, ఇర్కుత్స్క్, ఇవానోవో, ర్యాజన్, అముర్ రీజియన్లలో ఐదు ఎయిర్‌ఫీల్డ్స్‌ను లక్ష్యం చేసుకుని ఉక్రెయిన్ దాడులు జరిగినట్టు మాస్కో ధ్రువీకరించింది. కీవ్ పాలకులు ఎఫ్‌పీవీ డ్రోన్లను ఉపయోగించి ఎయిర్‌ఫీల్డ్స్‌పై ఉగ్రదాడి జరిపిందని, ఇవానోవో, ర్యాజన్, అముర్‌లోని మిలటరీ స్థావరాలపై దాడులను తిప్పికొట్టామని, ఈ దాడుల్లో పౌరులు కానీ, బలగాలు కానీ చనిపోయినట్టు ఎలాంటి సమాచారం లేదని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే ఈ దాడిలో తమ విమానాలు మంటల్లో చిక్కుకున్నట్టు మాస్కో అంగీకరించింది. మంటలను అదుపు చేసినట్టు తెలిపింది.


'స్పెడర్ వెబ్' ఆపరేషన్ ఇలా..

రష్యా 2022లో దండెత్తినప్పటి నుంచి ఆ దేశంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు సాగిస్తోంది. అయితే ఈసారి అనుసరించిన కార్యాచరణ పద్ధతి (Modus Operandi) మాత్రం వీటికి పూర్తి భిన్నంగా జరిగింది. ఏడాదిన్నర పాటు జరిపిన పక్కా ప్లానింగ్‌తో 'స్పైడర్ వెబ్' ఆపరేషన్‌కు ఉక్రెయిన్ దిగింది. గత మూడేళ్లలో తాము చేపట్టిన ఈ 'మోస్ట్ లాంగ్-రేంజ్ ఆపరేషన్' అద్భుతమైన ఫలితాలనిచ్చిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. 117 డ్రోన్లతో పెద్దఎత్తున జరిపిన ఈ దాడుల్లో 34 శాతం స్ట్రాటజిక్ క్రూయిస్ మిసైల్ కారియార్స్‌.. లక్షిత ఎయిర్‌ఫీల్డ్‌లపై దాడి చేశాయని చెప్పారు.


ట్రక్కుల్లో దాచిన డ్రోన్లు

ఉక్రెయిన్ ఎస్‌బీయూ వర్గాల సమాచారం ప్రకారం, ఉక్రెయిన్ తమ డ్రోన్లను ముందుగానే రష్యాలోకి స్మగ్లింగ్ చేసింది. అక్కడి ట్రక్కులపై ఏర్పాటు చేసిన చెక్క క్యాబిన్ల పైకప్పు కింద వాటిని దాచిపెట్టారు. దాడుల సమయంలో వాటిని దూరంగా తీసుకెళ్లి పైకప్పులు తెరవడంతో డ్రోన్లు తమ స్వల్పదూర లక్ష్యాల వైపు దూసుకెళ్లాయి. కార్గో ట్రక్ నుంచి ప్రయోగించిన డ్రోన్లు రష్యాకు చెందిన నాలుగు ఎయిర్‌బేస్‌లపై దాడి చేసి ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ స్పైడర్ నెట్ కొన్ని వీడియోలను విడుదల చేసింది. చరిత్రను ఈరోజు తిరగరాసామని పేర్కొంది.


కాగా, తమ ఎయిర్‌బేస్‌లపైకి వచ్చిన డ్రోన్లు ఉక్రెయిన్ భూభాగం నుంచి ప్రయోగించినవి కావని, ఎయిర్‌బేస్ చుట్టుపక్కల నుంచే వాటిని ప్రయోగించారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. ఈ దాడులను సమర్ధవంతగా తిప్పికొట్టామని తెలిపింది. రష్యా భూభాగంలో 4,000 కిలోమీటర్ల లోపలకు చొచ్చుకుపోయి మరీ ఈ దాడులు జరిగాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య తుర్కియేలోని ఇస్తాంబుల్‌లో శాంతి చర్చలు జరుగుతున్న వేళ ఈ దాడులు చోటుచేసుకున్నాయి.


ఇవి కూడా చదవండి..

దాడులకు ఉక్రెయిన్‌ 18 నెలల కార్యాచరణ

రష్యా గడ్డ మీది నుంచే రష్యాపై భీకర దాడులు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 02 , 2025 | 05:28 PM