Share News

India Electronics Trade: భారత్‌పై చైనా కుయుక్తులు!

ABN , Publish Date - Jul 22 , 2025 | 04:13 AM

ఎలక్ర్టానిక్స్‌ రంగంలో భారతదేశ ఎదుగుదలను చూసి ఓర్వలేని చైనా...

India Electronics Trade: భారత్‌పై చైనా కుయుక్తులు!
India Electronics Trade

  • ఎలక్ర్టానిక్స్‌ రంగంలో అనధికార వాణిజ్య ఆంక్షలు

  • ముఖ్య పరికరాలు, మినరల్స్‌పై నియంత్రణలు

  • తమ ఇంజనీర్లు వెనక్కి రావాలంటూ ఆదేశాలు

  • ‘ప్రపంచ తయారీ హబ్‌’గా భారత్‌ ఆవిర్భావాన్ని దెబ్బతీయడమే లక్ష్యం

  • ప్రమాదంలో రూ.2.75 లక్షల కోట్ల ఫోన్ల ఎగుమతి

  • ఐసీఈఏ ఆందోళన.. కేంద్రానికి లేఖ

న్యూఢిల్లీ, జూలై 21: ఎలక్ర్టానిక్స్‌ రంగంలో భారతదేశ ఎదుగుదలను చూసి ఓర్వలేని చైనా.. కుయుక్తులకు పాల్పడుతోంది. ఇందులో భాగంగా ముఖ్యమైన పరికరాలు, మినరల్స్‌పై నియంత్రణలు, ‘భారత్‌ను వీడి వచ్చేయండి’ అంటూ తమ దేశ నిపుణులకు ఆదేశాలిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇండియా సెల్యులర్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. చైనా ‘అనధికార వాణిజ్య ఆంక్షలకు‘ పాల్పడుతోందని పేర్కొంది. చైనా రహస్య చర్యలు భారతదేశ ప్రపంచ పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతిష్టాత్మకమైన 32 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2.75 లక్షల కోట్ల) విలువైన స్మార్ట్‌ఫోన్ల ఎగుమతి లక్ష్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించింది. ‘ప్రపంచ తయారీ హబ్‌’గా భారత్‌ ఆవిర్భావాన్ని, భారత సరఫరా చైన్లను దెబ్బతీయడమే లక్ష్యంగా చైనా ఉద్దేశపూర్వకంగా ఈ చర్యలకు పాల్పడుతోందని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. చైనా నియంత్రణలపై తక్షణం జోక్యం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. మరీ ముఖ్యంగా ఎలాంటి అధికారిక సమాచారం లేకుండా, కేవలం మౌఖిక సూచనల ద్వారానే చైనా ఒక ప్రణాళిక ప్రకారం, క్రమ పద్ధతిలో ఆంక్షలకు పాల్పడుతోందని ఐసీఈఏ పేర్కొంది. ఇండియా సెల్యూలర్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ అసోసియేషన్‌లో ప్రముఖ సంస్థలైన యాపిల్‌, గూగుల్‌, మోటోరోలా, ఫాక్స్‌కాన్‌, వివో, ఒప్పో, లావా, డిక్సాన్‌, ఫ్లెక్స్‌, టాటా ఎలకా్ట్రనిక్స్‌ ఉన్నాయి. కాగా, భారత్‌లోని ఫాక్స్‌కాన్‌ ప్లాంట్లలో పనిచేస్తున్న తమ దేశ ఇంజనీర్లు, టెక్నీషియన్లు వెంటనే అక్కడి నుంచి వచ్చేయాలని చైనా కోరినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. యాపిల్‌కు వాణిజ్య భాగస్వామి, అతిపెద్ద ఐఫోన్ల తయారీదారు ఫాక్స్‌కాన్‌ తన భారత్‌లోని ఉత్పత్తి కేంద్రాల్లో 300 మందికి పైగా చైనా ఇంజనీర్లు, టెక్నీషియన్లను రీకాల్‌ చేసిందని బ్లూమ్‌బర్గ్‌ ఇటీవలి కథనాలు వెల్లడించాయి. భారత్‌లో ఐఫోన్‌-17 తయారీకి యాపిల్‌ సంస్థ సిద్ధమవుతున్న వేళ.. ఇది ఇబ్బందిగా మారనుంది. ఈ పరిస్థితిపై కేంద్రం స్పందించింది. దీన్ని తట్టుకొనేందుకు యాపిల్‌ సంస్థ వద్ద ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని విశ్వసిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నట్లు వార్తాసంస్థ పీటీఐ పేర్కొంది. ఇది ప్రధానంగా యాపిల్‌, ఫాక్స్‌కాన్‌లకు చెందిన విషయమని అధికార వర్గాలు అందులో పేర్కొన్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 22 , 2025 | 07:37 AM