AI: కృత్రిమ మేధతో ఉద్యోగాల ఊచకోత
ABN , Publish Date - Apr 22 , 2025 | 05:20 AM
కృత్రిమ మేధ (ఏఐ) వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ఉద్యోగాలు పోవనున్నాయి. బిల్‌గేట్స్, ఒబామా ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, ఏఐ భవిష్యత్తులో అనేక సమస్యలను పరిష్కరిస్తుందని వారు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ఉద్యోగాలు పోతాయి
ఏఐపై బిల్‌గేట్స్, బరాక్ ఒబామా ఆందోళన
న్యూయార్క్, ఏప్రిల్ 21: స్మార్ట్‌ఫోన్ల ద్వారా సామాన్యుల చేతుల్లోకి సైతం వచ్చేసిన కృత్రిమ మేధ (ఏఐ) దెబ్బకు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ఉద్యోగాలు పోతాయని మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సంక్షోభం ఏ స్థాయిలో ఉంటుందంటే.. గత వందేళ్లలో ఎప్పుడూ చూడనంత భారీగా ఉంటుందని వారు వేర్వేరు వేదికలపై నుంచి హెచ్చరించారు. సమీప భవిష్యత్తులో వైద్యసేవలు, బోధన వంటివి కూడా ఏఐ ద్వారా సామాన్యులకు ఉచితంగా అందుబాటులోకి వస్తాయని బిల్‌గేట్స్ జోస్యం చెప్పారు. రానున్న కాలంలో అనేక సమస్యలను కృత్రిమ మేధ పరిష్కరిస్తుందని, నవకల్పనలకు ఊతమిస్తుందని పేర్కొన్న ఆయన.. ఏఐ కారణంగా భవిష్యత్తులో ఏం జరగొచ్చో కచ్చితంగా చెప్పలేని అనిశ్చితి ఉందని, అదే చాలా భయం కలిగిస్తోందని ఆందోళన వెలిబుచ్చారు. ఇక.. గతంలో ఏ సాంకేతిక పరిజ్ఞానం వల్ల వచ్చిన మార్పులూ చూపనంత ప్రభావాన్ని ఏఐ చూపూతుందని ఒబామా అన్నారు. ఏఐ ఆధారిత ఆటోమేషన్ వేగం పుంజుకుని, అన్ని రంగాల్లోనూ ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని.. దీంతో ప్రజలు తమ జీవనోపాధి గురించి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆందోళన వెలిబుచ్చారు.
ఉదాహరణకు.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ మోడళ్లు 60-70ు మంది సాఫ్ట్‌వేర్ డెవలపర్ల కన్నా మిన్నగా కోడింగ్ చేయగలుగుతున్నాయని, త్వరలో వారి పని చాలావరకూ కృత్రిమమేధ పరమవుతుందని ఆయన హెచ్చరించారు. తమ పనితీరును మెరుగుపరచుకోవడానికి ఏఐను వాడే అత్యున్నతస్థాయి నైపుణ్యం కలిగిన వారి ఉద్యోగాలు తప్ప.. మిగతావారి ఉద్యోగాలు పోతాయని పేర్కొన్నారు. మరోవైపు, భారతదేశంలో మధ్యతరగతి వర్గానికి ఇన్నాళ్లుగా వెన్నెముకగా నిలిచిన వైట్ కాలర్ ఉద్యోగాల సంఖ్య భారీగా తగ్గిపోతోందని ప్రముఖ ఇన్వె్‌స్టమెంట్ స్ట్రాటజిస్ట్ సౌరభ్ ముఖర్జియా హెచ్చరించారు. పెరుగుతున్న ఆటోమేషన్, కృత్రిమ మేధ వంటివాటి కారణంగా సంప్రదాయ ఉద్యోగావకాశాలకు క్రమేపీ కోత పడుతోందని ‘బియాండ్ పేచెక్: ఇండియాస్ ఆంత్రప్రెనరల్ రీబర్త్’ పేరిట నిర్వహించిన పాడ్‌కా్‌స్టలో ఆయన వ్యాఖ్యానించారు. వైట్ కాలర్ ఉద్యోగాలు ఎక్కువగా ఉండే ఐటీ, మీడియా, ఫైనాన్స్ రంగాల గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. తమ కోడింగ్ అవసరాల్లో 33% మేర కృత్రిమ మేధ తీరుస్తోందన్న గూగుల్ ప్రకటనను ఉటంకించారు. భారతీయ టెక్ కంపెనీల్లోనూ త్వరలో అదే ట్రెండ్ మొదలవుతుందని సౌరభ్ అంచనా వేశారు.