Arab Nations Urge Hamas: ఆయుధాలు అప్పగించి వైదొలగండి
ABN , Publish Date - Jul 31 , 2025 | 03:41 AM
హమాస్ తమ వద్ద ఉన్న ఆయుధాలను పాలస్తీనా అథారిటీకి అప్పగించి గాజా పాలన నుంచి తప్పుకోవాలని అరబ్ దేశాలు తొలిసారిగా సూచించాయి.

గాజా పాలన పాలస్తీనా అథారిటీకి..
హమా్‌సకు తేల్చి చెప్పిన అరబ్ దేశాలు
ఐరాస సదస్సులో 2 దేశాల సూత్రంపై చర్చ
అరబ్ లీగ్, ఈయూ, 17 దేశాల మద్దతు
న్యూయార్క్, జూలై 30: హమాస్ తమ వద్ద ఉన్న ఆయుధాలను పాలస్తీనా అథారిటీకి అప్పగించి గాజా పాలన నుంచి తప్పుకోవాలని అరబ్ దేశాలు తొలిసారిగా సూచించాయి. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించేందుకు ఇదే సరైన మార్గమని తేల్చి చెప్పాయి. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితిలో జరిగిన సదస్సులో అరబ్ దేశాలు, ఈయూతో పాటు 17 దేశాలు పాల్గొని ఇజ్రాయెల్-పాలస్తీనాలను రెండు దేశాలుగా గుర్తించే సూత్రంపై చర్చించాయి. దీనిపై ఫ్రాన్స్, బ్రిటన్, కెనడాతో పాటు ఈయూ, అరబ్ లీగ్ దేశాలు సమావేశమై ఓ తీర్మానం ఆమోదించాయి. 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని కూడా తీర్మానంలో ఖండించారు. హమాస్ చర్యను అరబ్ దేశాలు ఖండించడం కూడా ఇదే తొలిసారి. నాటి హమాస్ దాడిలో 1200 మంది ఇజ్రాయెలీలు చనిపోయారు. ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో 60 వేల మందికి పైగా మృతిచెందారు.
సమావేశానికి హాజరుకాని అమెరికా, ఇజ్రాయెల్
ఐక్యరాజ్యసమితిలో జరిగిన ఈ సమావేశానికి అమెరికా, ఇజ్రాయెల్ హాజరుకాలేదు. కాల్పుల విరమణకు అంగీకరించకుంటే పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తామని బ్రిటన్ ప్రధాని స్టార్మర్ హెచ్చరించడాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తప్పుబట్టారు. ఉగ్రవాదులపై మెతకవైఖరి తగదన్నారు. ఐక్యరాజ్యసమితిలో రెండు దేశాల సూత్రంపై సెప్టెంబరులో జరిగే చర్చలో పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ ప్రకటించడాన్ని కూడా ఇజ్రాయెల్, అమెరికా ఇప్పటికే ఖండించాయి. రెండు దేశాల సూత్రంపై ఫ్రాన్స్, స్పెయిన్ సహా 15 పశ్చిమ దేశాలు ఇప్పటికే మద్దతు తెలిపాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్
ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..
For More International News And Telugu News