Share News

Winter season: చలికాలమే కదా అని నిర్లక్ష్యం చేస్తే.. అంతే సంగతి మరి..

ABN , Publish Date - Nov 16 , 2025 | 08:34 AM

మొన్నటి వరకు వర్షాలు ముంచెత్తాయి. వద్దన్నా ఊరూవాడ తల్లడిల్లేలా చేశాయి. ఇక ఇప్పుడు శీతాకాలం దండయాత్ర చేయడానికి సిద్ధమవుతోంది. చలికాలమే కదా అని నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతి. కాస్త ప్రణాళిక, ఇంకాస్త ముందుజాగ్రత్త ఉంటే చాలు.. వచ్చే ఆరోగ్య సమస్యల నుంచీ బయటపడొచ్చంటున్నారు నిపుణులు. అప్పుడే శీతాకాలాన్ని ఉల్లాసంగా, ఉత్సాహంగా ఎంజాయ్‌ చేయవచ్చు...

Winter season: చలికాలమే కదా అని నిర్లక్ష్యం చేస్తే.. అంతే సంగతి మరి..

- చలిగిలికి బెదరకుండా..

చలికాలం వస్తే చాలు. బయటికి వెళ్లాలంటే వణుకు పుడుతుంది. దుప్పటి కప్పుకుని ఎక్కువ సేపు పడుకోవాలనే అనిపిస్తుంది. ఆకలి వేయదు. కాస్త వేడి వేడిగా ఏదో ఒకటి తాగితే చాలనిపిస్తుంది. బయట వెళుతురు తక్కువగా ఉండే ఈ సమయంలో ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ తీసుకోవాల్సిందే! లేకపోతే అనారోగ్యం దరిచేరుతుంది. ముఖ్యంగా ఏడు రకాల జాగ్రత్తలు శీతాకాలానికి అవసరం.

కొత్త హాబీ

శీతాకాలం ఎక్కువగా ఎండపడని, వెళుతురు తక్కువగా ఉండే కాలం. పగటి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడమే దీనికి కారణం. దీనివల్ల మనకు తెలియకుండానే ఓలాంటి నిర్లిప్లత్త, నిరాశ కమ్మేస్తాయి. అందుకే ఈ సమయంలో కొత్త హాబీ అలవర్చుకోవడం మంచిది. అల్లికలు, వంటలు, పుస్తక పఠనం, సంగీతం లాంటివన్నీ మనసును హుషారుగా ఉంచుతాయి. ట్రెక్కింగ్‌, హైకింగ్‌ లాంటి అడ్వెంచర్స్‌ కూడా జీవితానికి కావలసిన థ్రిల్‌ను అందిస్తాయి.


నీళ్లే ఆధారం

book3.45.jpg

చలికాలం... అతి శీతలం వల్ల అందరూ మరచిపోయేది మంచి నీళ్లని. ఈ కాలంలో కూడా ‘డీహైడ్రేషన్‌’ అవుతుందని తెలుసా? అందుకే అన్ని వేళలలాగానే చలికాలంలో కూడా ఎనిమిది గ్లాసుల నీళ్లని తాగాలన్న నియమం మరచిపోకూడదు. జీవక్రియలకు తగినంత నీరు అవసరం. వట్టి నీళ్లు కష్టం అనిపిస్తే, రకరకాల సూప్‌లు, వేడి రసం, సాంబార్‌ తీసుకోవచ్చు. అల్లం, తులసి, వాముతో టీలనూ తయారుచేసుకోవచ్చు. వీటన్నిటి వల్ల శరీరానికి తగినన్ని నీళ్లు అందుతాయి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇలా ఇళ్లలో తయారుచేసిన సూప్‌లు, హెర్బల్‌ టీలు శీతాకాలంలో శరీరానికి తగినంత పోషణను అందిస్తాయి. వ్యాయామాలు చేసే వాళ్లు మరింత శ్రద్ధ తీసుకోవాలి.


సూర్యరశ్మి కీలకం

book3.2.jpg

‘అబ్బో చలి’ అంటూ చాలా మంది బయటికి వెళ్లడం తగ్గిస్తారు. వెళ్లినా మంకీ క్యాప్‌, స్వెటర్లు, జాకెట్లతో పూర్తిగా కప్పేసుకుంటారు. ఎండ తగలకపోవడం వల్ల విటమిన్‌ డి లభించదు. ఎముకల ఆరోగ్యానికి, రోగ నిరోధకతకు విటమిన్‌ డి కీలకం అన్న విషయం తెలిసిందే. అందుకే ఉదయం వేళల్లో కనీసం ఓ పావు గంట ఆరుబయట సూర్యరశ్మిలో గడపడం అవసరం. దీంతో సహజసిద్ధంగా విటమిన్‌ డి ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. పుట్టగొడుగులు, పాలు, చేపలు ఆహారంలో భాగం చేసుకోవాలి.


ఆహారం ఇలా...

కాస్త చలి మొదలవగానే స్వెటర్లని తీసి, ఓసారి ఉతికి శుభ్రపరచుకోవడం సహజం. అలాగే తాజా అల్లం, మిరియాలు, పసుపు పోగేసి పెట్టుకోవడం పరిపాటే. ఈ జాగ్రత్తలు మంచివే. ఎందుకంటే చలికాలంలో పిలవకుండానే వస్తుంటాయి దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరాలు. కాబట్టి చలిసోకకుండా స్వెటర్లు, మఫ్లర్లు ధరించడం మంచిది. అలాగే రోగనిరోధకతను పెంచుకోవడానికి సంప్రదాయక సూపర్‌ఫుడ్స్‌ను తీసుకోవడం ఆరోగ్యకరం. ఈ సమయంలో విటమిన్‌ సి కోసం ఉసిరికాయను మించింది లేదు. అనాదిగా ఉసిరిని ‘వింటర్‌ పవర్‌హౌజ్‌’గా పిలుస్తున్నారు. అలాగే రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు పసుపు వేసి ఉడికించిన పాలను తాగడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. చలి కదా అని పెరుగు, మజ్జిగను దూరం పెట్టకుండా, రోజూ తీసుకోవాలి. ఈ కాలంలో ఇడ్లీ, దోశ కూడా మేలు చేస్తాయి. ఇంకా అలసందలు లాంటి పప్పు దినుసులు, వివిధ రకాల గింజలు ఆరోగ్యకరం.. వీటన్నిటిలో జింక్‌ ఎక్కువగా ఉండడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది.


విహారయాత్రలకు..

చాలా మంది కుటుంబ సమేత విహారయాత్రలకు శీతాకాలాన్నే ఎంచుకుంటారు. ఈ సమయంలో సముద్రాలు, హిమాలయాలు, మైదాన ప్రాంతాలు అన్నీ ఆహ్వానం పలికేవే. కాబట్టి ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడి వాతావరణ పరిస్థితులను ముందుగానే తెలుసుకోవాలి. దానికి తగినట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలి. హ్యాట్స్‌, గ్లౌజ్‌లు, వాటర్‌ ప్రూఫ్‌ బూట్లు కూడా తీసుకెళ్లాలి. జాకెట్లు, స్వెటర్లు, స్కార్ఫులు మామూలే. ఇలా అనేక లేయర్స్‌లా దుస్తులు ధరించడం వల్ల శరీరానికి తగినంత వెచ్చదనం లభిస్తుంది.


పిల్లలూ, పెద్దలూ జాగ్రత్త...

book3.4.jpg

ఈ కాలంలో ఎక్కువగా అనారోగ్యానికి గురి అయ్యేది పిల్లలు, వృద్ధులు. అస్తమానం ఎండలో గడుపుతూ పిల్లలు, ఇంట్లోనే ఉంటూ పెద్దలు రోగాల బారిన పడుతుంటారు. వెచ్చని దుస్తులు ధరించి పరిమిత సమయాల్లోనే పిల్లలు ఆడుకునేలా చూడాలి. పిల్లలు సమయానికి నీళ్లు, ఆహారం తీసుకునేలా చూసుకోవాలి. శీతాకాలంలో కూడా పెద్దలు ఉన్ని దుస్తులు ధరించి బయటికి వెళ్లి తేలికపాటి వ్యాయామాలు చేసేలా ప్రోత్సహించాలి. రొటీన్‌ హెల్త్‌ చెక్‌ప్‌లు తప్పనిసరిగా చేయిస్తూ ఆరోగ్యాన్ని సరిచూసుకోవాలి. పోషకాహార లోపం రాకుండా చూసుకోవాలి.


చర్మానికి రక్ష

book3.3.jpg

చలికాలంలో అందరినీ చిరాకు పెట్టే అంశం చర్మం పొడిబారడం. చలి గాలులలో తేమ తక్కువగా ఉంటుంది. ఈ గాలులు తేమని లాగేయడం వల్ల చర్మం పొడిబారినట్టు అవుతుంది. వేడి నీళ్ల స్నానాలు ఈ కాలంలో హాయిగా అనిపిస్తాయి. కానీ పొడి చర్మాన్ని మరింత ప్రేరేపిస్తాయి. దీంతో కొందరిలో దురద, దద్దుర్లు మొదలవుతాయి. చర్మంలోని పైపొర పొడిబారడం వల్ల కొన్ని రకాల అనారోగ్యాలూ దరిచేరే అవకాశం ఉంది. అందుకే చలి కాలంలో చర్మ సంరక్షణ ఎంతో కీలకం. బయటికి వెళ్లిన ప్రతిసారీ సన్‌స్ర్కీన్‌ రాసుకోవాలి. గ్లిజరిన్‌ ఉన్న సబ్బులు, క్రీములతో చర్మానికి రక్షణ కలిగించాలి. లిప్‌బామ్‌లు లేదా నెయ్యి పెదవులకు రాసుకుంటే మంచిది. వెచ్చని కొబ్బరి నూనెను చర్మానికి పట్టించి స్నానం చేయాలి. ఇక అంతర్గత ఆరోగ్యం కోసం ఒమేగా 3 కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. ముఖ్యంగా ఫ్లాక్స్‌సీడ్స్‌, వాల్‌నట్స్‌, ఆవ నూనె చర్మ పోషణకు సహాయపడతాయి. కురులకు సంబంధించి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ సార్లు తలస్నానాలు చేయడం మానుకోవాలి. క్రమంగా తలకి నూనె పట్టించాలి. సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. వారానికి ఓరోజు హెయిర్‌ మాస్క్‌లు వేసుకోవాలి.

Updated Date - Nov 16 , 2025 | 08:34 AM