Share News

Gym Tips: చెమట చిందించే ముందు...

ABN , Publish Date - Apr 27 , 2025 | 10:33 AM

ఒకవైపు ఎండలు దంచికొడుతున్నాయి. ఈ సమయంలో జిమ్‌కి వెళ్లి చెమట చిందించాలంటే కాస్త కష్టమే. మిగతా కాలాల్లా కాకుండా... వేసవికాలం జిమ్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలి. చిన్న పొరపాటు చేసినా ప్రమాదం పొంచి ఉంటుంది. వేసవిలో జిమ్‌ జాగ్రత్తల గురించి నిపుణులు ఏం చెబుతున్నారంటే...

Gym Tips: చెమట చిందించే ముందు...

ఎండల్లో ఏసీ జిమ్‌లో అయినా సరే ఎక్సర్‌సైజ్‌ల విషయంలో కాసింత తగ్గాలి. ఉష్ణోగ్రత తక్కువగా ఉండే సమయంలో వ్యాయామం చేయడం సముచితం.

జిమ్‌కి వెళ్లే ముందు... హానికర మైన యూవీ కిరణాల నుంచి రక్షణ కోసం చర్మానికి సన్‌స్ర్కీన్‌ లోషన్‌ రాసుకోవాలి. ఇంట్లోనే ఉండి ఫిట్‌గా మారాలనుకుంటే... బట్టలు ఉతకడం, ఫ్లోర్‌ శుభ్రం చేయడం, మెట్లు ఎక్కడం, దిగడం... వంటి రోజువారీ ఇంటి పనులు చేయాలి.

కొంతమంది జిమ్‌లోకి వెళ్లగానే నేరుగా వ్యాయామం ప్రారంభిస్తారు. కానీ ఎప్పుడైనా వ్యాయామానికి ముందు వార్మప్‌ మర్చిపోవద్దు. శరీరం సరిగ్గా వార్మప్‌ కాకపోతే, అలసటకు దారితీస్తుంది. దీనివల్ల కండరాల్లో తిమ్మిరి సమస్య కూడా వస్తుంది.


ఫుడ్‌ విషయంలోనూ జాగ్రత్త వహించాలి. పోషకాలు, నీటి శాతం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. మసాలాలు అధికంగా ఉండే ఆహార పదార్థాల జోలికి వెళ్లొద్దు.

book3.2.jpg

వేడివల్ల అలసట, వడదెబ్బ లాంటి ప్రమాదాలను ముందుగానే అర్థం చేసుకోవాలి. బలహీనత, తలనొప్పి, తలతిరగడం, ఒళ్లు పట్టేయడం, వాంతులు, గుండె మరీ ఎక్కువగా కొట్టుకోవడం, తీవ్రంగా అలసటకు సంబంధించిన సూచనలు కనిపించినట్లయితే వెంటనే వ్యాయామం ఆపేసి సేదతీరడం అవసరం.

వేడికి శరీరంలోని సత్తువ అంతా క్షీణిస్తున్నట్లు అనిపిస్తుంది. రోజూ చేసే వ్యాయామాలైనా ఈ కాలంలో త్వరగా అలసిపోతుంటాం. కాబట్టి, పక్కాగా అనుకున్నవన్నీ చేసేయాలన్న కఠిన నిబంధనలొద్దు. స్పీడ్‌ కార్డియో, భారీగా వెయిట్‌ లిఫ్టింగ్‌ లేదా అధిక సమయం వ్యాయామం చేయడం... ఈ కాలంలో చాలా డేంజర్‌. వీటికి బదులుగా ఈత, యోగా లేదా వాకింగ్‌ వంటి తక్కువ తీవ్రత ఉండే వ్యాయామాలపై దృష్టి పెట్టడమే మంచిది.


దుస్తులు ఎంపిక కూడా ముఖ్యమే. ఎప్పటిలా బిగుతువి కాకుండా... వదులుగా, తక్కువ వేడిని గ్రహించే లేత రంగు దుస్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి.

అవి చెమటను త్వరగా పీల్చుకునేలా ఉండాలి.

విరామం లేకుండా వర్కవుట్స్‌ చేయడం సరికాదు. 40- 50 నిమిషాల వ్యాయామం తర్వాత తప్పకుండా ఐదు, పది నిమిషాలైనా చిన్నపాటి విరామం తీసుకోవాలి.


book3.3.jpg

వేసవికాలం వ్యాయామం చేసేటప్పుడు... వేడివల్ల విపరీతంగా చెమట బయటకు వస్తుంది. డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే శరీరంలో నీటికొరత ఏర్పడకుండా చూసుకోవాలి. హైడ్రేటెడ్‌గా ఉండేందుకు తగినంత నీరు తాగాలి.

ప్రతీ 15 నిమిషాలకు నీరు తీసుకునేలా నియమం పెట్టుకుంటే డీహైడ్రేషన్‌, అలసట వంటివి ఉండవు. అయితే ఒకేసారి ఎక్కువ నీటిని తీసుకోవద్దు. ఎనర్జీ డ్రింక్స్‌కు బదులుగా కొబ్బరినీరు, నిమ్మరసం, ఇతర హైడ్రేటెడ్‌ పానీయాలు తీసుకోవాలి.


ఈ వార్తలు కూడా చదవండి

లిక్కర్‌ దందాల కవితకు రాహుల్‌ పేరెత్తే అర్హత లేదు

పొన్నం చొరవతో స్వస్థలానికి గల్ఫ్‌ బాధితుడు

జాతీయ మహిళా సాధికారత కమిటీ సభ్యురాలిగా డీకే అరుణ

యువతితో షాకింగ్ డాన్స్..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 27 , 2025 | 12:13 PM