ప్రొటీన్ బార్... నమిలేస్తున్నారు...
ABN , Publish Date - Jun 15 , 2025 | 08:43 AM
గజి‘బిజీ’ ప్రపంచంలో ఎవరికీ సమయం ఉండట్లేదు. ఉదయం నిద్ర లేచిన దగ్గరి నుంచి రాత్రి నిద్రపోయేదాకా తినడానికి కూడా టైమ్ లేదని చెప్పేవారు ఎంతోమంది.

గజి‘బిజీ’ ప్రపంచంలో ఎవరికీ సమయం ఉండట్లేదు. ఉదయం నిద్ర లేచిన దగ్గరి నుంచి రాత్రి నిద్రపోయేదాకా తినడానికి కూడా టైమ్ లేదని చెప్పేవారు ఎంతోమంది. స్కూల్‌కు, కాలేజీకి, ఆఫీసుకు అర్జెంట్‌గా తయారై, అమ్మ చేసిన అల్పాహారం కూడా తీసుకోకుండా... బస్సులోనో, క్యాబ్‌లోనో, ఆటోరిక్షాలోనో, బైక్ మీదనో ‘ప్రొటీన్ బార్’ బైట్ నమిలేస్తున్న నవతరం ఆహారపు అలవాట్లకు అనుగుణంగా మార్కెట్ మాయ చేస్తోంది. నగరాల్లో సూపర్‌మార్కెట్ సెల్ఫులన్నీ రకరకాల ప్రొటీన్ బార్‌లతో ఆకర్షణీయంగా నిండిపోతున్నాయి. ఈ నయా ట్రెండ్ దారెటు?
‘ఉదయమే ఊరెళ్లాలి...’
‘ఆఫీసులో ప్రెజంటేషన్ ఉంది... బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేద్దాం’.
‘ఈరోజు బిగ్ టోర్నమెంట్ డే. ఆట మధ్యలో తక్షణ శక్తి కావాలి...’
‘కాస్త బరువు తగ్గి ఫిట్‌నెస్ పెంచుకోవాలి. మూడు పూటలా అన్నానికి బదులు వేరే ఏదైనా ట్రై చేయాలి...’
ఇలా రకరకాల కారణాలకు తక్షణ పరిష్కారంగా ‘ప్రొటీన్ బార్’ల వైపు చూస్తున్నారు నగరవాసులు. దీనికి తోడు టీవీల్లో వీటిని స్టయిల్‌గా నమిలేస్తూ సెలబ్రిటీలు హోరెత్తిస్తున్న ప్రచారంతో యువతరం ఇట్టే వాటి మాయలో పడిపోతోంది. నగరాల్లో అమ్మాయిలు బ్యాగులో ఒక ప్రొటీన్ బార్ ఉంటే చాలనుకుంటున్నారు. ఆకలేస్తే అబ్బాయిలు ప్రొటీన్‌బార్ బైట్ లాగిస్తున్నారు.
బ్యాగులో ఉంటే... ఎప్పుడంటే అప్పుడే...
క్రీడాకారులు, జిమ్‌లకు వెళ్లే వాళ్లు, బాడీబిల్డర్లకు మాత్రమే మాంసకృతుల అవసరం అని నిన్నటిదాకా అనుకునేవాళ్లం. కానీ కండరాల శక్తిసామర్థ్యాలకు, రోజువారీ దినచర్యకు, హార్మోన్ల పనితీరుకు, మంచి జీవనప్రమాణానికి ప్రొటీన్ల అవసరం ఎంతో ఉందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఈ అంశాన్ని వ్యాపార అంశంగా మార్చుకుని... ప్రొటీన్ల శాతం ఎక్కువగా ఉన్న కుల్ఫీలు, ప్రొటీన్ బ్రెడ్, కాఫీ, రోటీ, ప్రొటీన్ ఇడ్లీ మిక్స్‌లు, కుకీలు, చిప్స్, ఆఖరికి నీళ్లు కూడా వచ్చేశాయి. దాంతో ప్రపంచం ప్రొటీన్‌మయంగా మారిపోయింది. నగరాల్లో ఈతరం కుర్రకారు, ఉద్యోగుల బ్యాగుల్లో కీలక స్నాక్‌గా మారింది ప్రొటీన్ బార్.
డేట్స్, ఎండిన పళ్లు, గింజలు, విత్తనాలు, ఓట్స్, క్వినోవా తదితరాలతో తయారుచేసే ఇన్‌స్టంట్ ఆహారంగా ప్రొటీన్ బార్‌ను చెప్పుకోవచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది కాంపాక్ట్ మాంసకృతుల చాక్లెట్‌లాంటిది. శరీర నిర్మాణంలో ఇటుకలాంటిది ప్రొటీన్. కణకణానికి ప్రొటీన్లు కావాలి. ఇదే కాన్సెప్ట్‌తో రూపొందించినవి ప్రొటీన్ బార్‌లు. ఒకప్పుడు తక్షణ శక్తి కోసం క్రీడాకారులు ఎక్కువగా ఈ బార్‌లను ఉపయోగించేవారు. అయితే మారిన జీవన విధానం వల్ల ప్రొటీన్ బార్‌లు అంతటా విస్తరించాయి. ముఖ్యంగా వీటిని సులభంగా క్యారీ చేయవచ్చు. అంతే సులభంగా ఎక్కడైనా, ఎప్పుడైనా క్షణాల్లో తినేయవచ్చు. ప్లేట్లు, చేతులు కడుక్కోవడం లాంటివి అవసరమే లేదు. తిన్న వెంటనే కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. శరీరానికి తక్షణ శక్తి చేకూరుతుంది. అందుకే అల్పాహారానికి, భోజనాల మధ్య విరామాల్లో స్నాక్స్‌గా ప్రొటీన్ బార్‌లు మారాయి. ఇదో కొత్త ఫుడ్ ట్రెండ్‌గా రూపాంతరం చెంది ప్రపంచమంతా పాపులర్ అయ్యింది.
అనేక రకాల ఫ్లేవర్లు...
ప్రొటీన్‌బార్‌లలో గ్లుటెన్ ఫ్రీ, వేగాన్, లో షుగర్, హెల్తీ, మీల్ రీప్లేస్‌మెంట్ వంటివి ఉన్నాయి. ఎవరి ఇష్టాలకు తగ్గట్లుగా వారు వివిధ ఫ్లేవర్లు, కాంబినేషన్లలో వీటిని ఎంచుకోవచ్చు. ప్రస్తుతం 5.44 బిలియన్ డాలర్లు ఉన్న ప్రొటీన్ బార్ మార్కెట్, 2033 నాటికి 8.77 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. అత్యధిక డిమాండు కారణంగానే వీటి ధరలూ రోజురోజుకు పెరుగుతున్నాయి. వీటిలో ఉన్న ప్రొటీన్ కారణంగా మీడియం, హై, లో ప్రొటీన్లు అనే విభజన ఉంది. క్రాన్‌బెర్రీ, ఫ్రూట్ అండ్ నట్, చాకో ఆల్మండ్, చాక్లెట్ ఫ్లేవర్లలో లభిస్తున్నాయి. వేగన్ ప్రేమికులకు ప్రత్యేకంగా ప్లాంట్ ప్రొటీన్లతో తయారుచేసిన బార్‌లు అందుబాటులోకి వచ్చాయి.
బ్రేక్‌ఫాస్ట్‌కు ప్రత్యామ్నాయం కాదు...
ప్రొటీన్ బార్‌లను చిరుతిళ్లలో ‘రెడీ టూ ఈట్’ రకానికి చెందినవిగా న్యూట్రిషనిస్టులు పేర్కొంటున్నారు. వీటికి సంబంధించి వాళ్లు చేస్తున్న విలువైన సూచనలు విస్మరించలేనివి. వీటిని ఏ సమయంలోనైనా సరే ఆకలి వేసినప్పుడు తగిన భోజన పదార్థాలు అందుబాటులో లేనప్పుడు తీసుకోవచ్చు. వీటి బరువు తక్కువే కానీ పోషకాలలో ఘనమైనవి. ఇందులో ప్రొటీన్లు, కార్బోహైడేట్లు ఎక్కువ కాబట్టి వ్యాయామానికి ముందు లేదా తరవాత శక్తి కోసం తీసుకోవచ్చు. కండరాల ఆరోగ్యానికీ కీలకం. ప్రొటీన్ బార్లను తీసుకోవడం వల్ల రోజు వారీ అవసరమైన మైక్రోన్యూట్రియెంట్స్‌ను పొందవచ్చు. పీచుపదార్థాలకి చక్కని చిరునామా ప్రొటీన్ బార్లు. బరువును తగ్గించుకోవాలని అనుకునేవాళ్లు విరామ సమయంలో ప్రొటీన్ బార్లను తీసుకుని ఆకలిపై పట్టును సాధించవచ్చని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అలాగే బరువు పెరగాలని అనుకుంటున్న వాళ్లు కూడా వీటిని ఆశ్రయించవచ్చు. చిన్న బైట్‌లోనే అధిక క్యాలరీలు ఉంటాయి. కాబట్టి ఎక్కువ క్యాలరీల కోసం పెద్ద మొత్తంలో ఆహారాన్ని తీసుకోవాల్సిన పని లేదు. ఏకంగా 350 క్యాలరీలను అందించే ప్రొటీన్ బార్‌లూ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
అయితే ప్రొటీన్ బార్‌ల విషయంలో కొన్ని కఠినమైన నిజాలను కూడా గమనించాలి. చాలామంది కుర్రకారు ప్రొటీన్‌బార్‌లను బ్రేక్‌ఫాస్ట్‌కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. కానీ ఇది వంద శాతం నిజం కాదు. ఉదయం ఆల్పాహారాన్ని తీసుకోకుండా ఒక ప్రొటీన్‌బార్ బ్యాగ్‌లో వేసుకుని, ఖాళీ సమయం దొరికినప్పుడు నమిలేద్దాం అనుకుంటే ఆరోగ్య సమస్యలు ‘కొని’ తెచ్చుకున్నట్టే అంటున్నారు న్యూట్రీషియన్లు. ఎప్పుడైనా సరే సమతుల ఆహారానికి చిరునామాగా అల్పాహారం ఉండాలి. సాంప్రదాయ అల్పాహారంలో మాత్రమే సమతుల్యత ఉంటుంది. మాంసకృత్తులు అధిక మొత్తంలో ఉండే ప్రొటీన్ బార్‌లు ఈ విషయంలో విఫలం అవుతున్నాయి. ఇంకా కొన్నింట్లో అధిక తియ్యదనం కోసం ఫ్రక్టోజ్ కార్న్ సిరప్‌లను వాడుతున్నారు. వీటిల్లో కొవ్వుల కోసం అధిక స్థాయిలో ప్రాసెస్ చేసిన మొక్కల నూనెలు ఉపయోగిస్తున్నారు. అలాగే శరీర బరువును బట్టి కిలోకి 0.8 గ్రాముల ప్రొటీన్‌ను మాత్రమే రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. ఈ మొత్తం ఎక్కువైతే క్యాన్సర్లు, గుండె, కాలేయ రోగాలు, ఎముకలు, కిడ్నీలకు సంబంధించిన రుగ్మతలు వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. అందుకే ప్రొటీన్ బార్లను కొనేప్పుడు వాటిలో ఉన్న పదార్థాలు ఏమిటి? ఏస్థాయిలో ఉపయోగించారు అన్నది తప్పకుండా చదవడం మంచిది. ప్రతీరోజూ కాకుండా అప్పుడప్పుడు కాస్త ఆటవిడుపుగా మాత్రమే ప్రొటీన్‌బార్‌లను ఆస్వాదించడం అన్నివిధాలా శ్రేయస్కరం.
పోషక విలువలు
ఓ మోస్తరు సైజులో ఉన్న ప్రొటీన్ బార్‌లో ఉండే పోషక పదార్థాలు.
- క్యాలరీలు- 211
- కొవ్వులు - 5 నుంచి 10 గ్రాములు
- కార్బోహైడ్రేట్స్ - 25 నుంచి 35 గ్రాములు
- ఫైబర్ - 5 నుంచి 10 గ్రాములు
- ప్రొటీన్లు - 20 గ్రాములు
వీటితో పాటు క్యాల్షియం. విటమిన్ బి, పొటాషియం, ఐరన్ లాంటి మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఉంటాయి.
స్టార్ల మెరుపులు
బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ ‘ప్రొటీన్ పోలిస్’ అని జపిస్తున్నారు. మరో హీరో రణ్‌వీర్ సింగ్ ‘సూపర్‌యూ’ అంటూ కొత్త ప్రొటీన్ చిప్స్ వేఫర్ల కంపెనీ మొదలు పెట్టారు. ఇక సోనూసూద్ ‘ఆటమ్’ అనే ప్రొటీన్ వే అంబాసిడర్‌గా మారారు. అమెరికా మీడియా స్టార్ క్లాయి కర్దాషియన్ వీళ్లందరి కంటే ఓ అడుగు ముందుకేసి ‘ప్రొటీన్ పాప్‌కార్న్’ ను ప్రమోట్ చేస్తోంది. మొదట్లో క్రీడాకారుల ప్రియనేస్తంగా ఉన్న ‘ప్రొటీన్ బార్’ నేడు అందర్నీ ఆకట్టుకుంటున్నాయనడానికి ఈ వాణిజ్య ప్రకటనలే సాక్ష్యం.