Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ మోసాలపై ఇక కొరడా
ABN , Publish Date - Jul 11 , 2025 | 04:57 AM
భారత ప్రభుత్వం నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్ఛేంజిని ఆరోగ్య శాఖ పరిధి నుంచి తప్పించి, ఆర్థిక శాఖ పరిధిలోకి మార్చాలని యోచిస్తోంది.

ఆర్థిక శాఖ పరిధిలోకి రానున్న జాతీయ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్ఛేంజీ
ఐఆర్‌డీఏఐతో కలిసి పర్యవేక్షణ.. కేంద్ర ప్రభుత్వ యోచన
ఇప్పటిదాకా ఆరోగ్య శాఖ పరిధిలోనే హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్ఛేంజీ
పర్యవేక్షణ లేక భారీగా క్లెయిమ్‌లు.. యథేచ్ఛగా ఆస్పత్రుల ఫీజులు
ఏటా పెరుగుతున్న ప్రీమియం.. బీమాకు దూరమవుతున్న ప్రజలు
న్యూఢిల్లీ, జూలై 10: భారత ప్రభుత్వం నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్ఛేంజిని ఆరోగ్య శాఖ పరిధి నుంచి తప్పించి, ఆర్థిక శాఖ పరిధిలోకి మార్చాలని యోచిస్తోంది. అప్పుడు ఆర్థిక శాఖ, భారత బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ(ఐఆర్‌డీఏఐ) కలిసి నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్ఛేంజిని పర్యవేక్షిస్తాయి. 2025లో ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య బీమా ప్రీమియంలు సగటున 10 శాతం పెరుగుతాయని అంచనా వేస్తుంటే భారత్‌లో మాత్రం 13 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గతంలో 20 శాతం వరకు పెరిగిన బీమా ప్రీమియంలు 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేవలం 9 శాతం పెరిగాయి. భారతదేశంలో మాత్రం 12 శాతం పెరిగాయి. ఆసుపత్రులు వైద్యానికి ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తున్న నేపథ్యంలో దేశంలో వైద్య బీమా ప్రీమియంలు భారీగా పెరుగుతున్నాయి. దీనివల్ల ప్రజలు ఆరోగ్య బీమాకు మరింత దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్ఛేంజీని ఆర్థిక శాఖ పరిధిలోకి తెచ్చి బలోపేతం చేస్తే ఆసుపత్రులతో బేరమాడే శక్తి బీమా కంపెనీలకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ హెల్త్ ఎక్స్ఛేంజీ బీమా సంస్థలకు, ఆసుపత్రులకు, ఆరోగ్య బీమా చేయించుకొనే వారికి అనుసంధానకర్తగా వ్యవహరిస్తుంది. ఇక నుంచి ఐఆర్‌డీఏఐ బీమా మోసాలను పసిగట్టడంలో, ధరలను పర్యవేక్షించడంలో, క్లెయిమ్‌ల ప్రామాణికతను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రిజర్వు బ్యాంకు తరహాలో నియంత్రణ బాధ్యతలు చేపడుతుంది. క్లెయిముల డేటా మొత్తం ఒకచోట ఉండటం వల్ల బీమా సంస్థలు బిల్లులను పెంచి చూపించే ఆస్పత్రులను ఇట్టే పసిగట్టి పక్కనపడేస్తాయి. విధివిధానాలు పాటించని బీమా సంస్థలకు భారీగా జరిమానాలను విధించేందుకు అవకాశం ఉంటుంది. ఇలా చేయడం ద్వారా క్లెయిముల భారం తగ్గి ప్రీమియం కూడా బాగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. కేంద్రీకృత పోర్టల్ వల్ల పారదర్శకంగా, ప్రమాణాలతో కూడిన క్లెయిముల పరిష్కారం జరుగుతుంది. వృథా, మోసం, నిర్వహణ వైఫల్యాలను అరికట్టవచ్చు. ఒకే చోట డేటా ఉండటం వల్ల తప్పుడు విధానాలను ఎప్పటికప్పుడు పసిగట్టవచ్చు. అనుగుణంగా మార్పులు చేసుకోవచ్చు.