Share News

Health: గర్భధారణ కోసం ప్రత్యేకమైన ఆహార నియమాలు పాటించాలా..?

ABN , Publish Date - Dec 07 , 2025 | 12:00 PM

గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ తీసుకోవాలి. భార్యా భర్తలిద్దరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అధిక బరువు లేదా తక్కువ బరువు లేకుండా సరైన బరువు ఉండేలా చూసుకోవాలి. మీ ఆహారంలో పలు రకాల పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటే మంచిది.

Health:  గర్భధారణ కోసం ప్రత్యేకమైన ఆహార నియమాలు పాటించాలా..?

- గర్భధారణకు డైట్‌ ఉందా?

నాకు 24 ఏళ్లు. పెళ్లి అయ్యింది. పిల్లలు కావాలనుకుంటున్నాం. ఎటువంటి సమస్య లేదు. ట్యూబ్లు కూడా బాగున్నాయి. గర్భధారణ కోసం ఏవైనా ప్రత్యేకమైన ఆహార నియమాలు పాటించాలా? దయచేసి ఏదైనా డైట్‌ సూచించగలరు.

- సాహితి, కాకినాడ

గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ తీసుకోవాలి. భార్యా భర్తలిద్దరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అధిక బరువు లేదా తక్కువ బరువు లేకుండా సరైన బరువు ఉండేలా చూసుకోవాలి. మీ ఆహారంలో పలు రకాల పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటే మంచిది. ప్రొటీన్లు అధికంగా ఉండే మాంసాహారం, గుడ్లు, శాకాహారులైతే పాలు, పెరుగు, పనీర్‌, వివిధ రకాల పప్పుధాన్యాలను రోజూ తప్పనిసరిగా తీసుకోవాలి. ముందుగా పరీక్షలు చేయించుకుని ఏదైనా విటమిన్ల లోపం ఉన్నట్టయితే వెంటనే వైద్యుల సలహా మేరకు మందులను వాడాలి. ఫోలిక్‌ ఆసిడ్‌ అధికంగా ఉండే ఆకుకూరలను తీసుకోవాలి. ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్‌ ఉండే చేప, అవిసె గింజలు, ఆక్రోట్‌ గింజలను కూడా తినాలి. అన్ని రకాల పళ్ళు తీసుకోవచ్చు. రోజుకు కనీసం రెండు లేదా మూడుసార్లు పళ్ళు తీసుకోవాలి. విటమిన్‌ డీ లోపం రాకుండా ఉండడానికి పదిహేను నిమిషాలు ఉదయం లేదా సాయంత్రం నీరెండలో నడవడం అలవాటు చేసు కోవాలి. సమయానికి తినడం, నిద్రపోవడం కూడా తప్ప నిసరి. ఎక్కువ కాలంపాటు ప్రయత్నించినా సత్ఫలితాలు లేనప్పుడు తగిన వైద్యనిపుణులను కలవడం మంచిది.

book8.2.jpg


చలి కారణంగా శీతకాలంలో మత్తుగా అనిపిస్తుంది. ఈ కాలంలో ఏలాంటి ఆహారం తీసుకుంటే చురుకుగా, ఉత్సాహంగా ఉండగలుగుతాం?

- రేణు, కడప

చలికాలంలో చలి ప్రభావం వల్ల జీవక్రియ వేగం (మెటబాలిజం) మందగించి, మనకు తరచుగా మత్తుగా లేదా అలసటగా అనిపించడం సహజం. ఈ సమయంలో శరీరానికి వేడి, శక్తిని ఇచ్చే, రోగ నిరోధకశక్తి పెంచే ఆహారం తీసుకుంటే రోజు మొత్తం చురుకుగా ఉండగలుగుతాం. అల్లం, వెల్లులి, పసుపు కలిపిన టమాటా సూప్‌, క్యారట్‌ సూప్‌ వంటి వేడి సూపులు చలి వల్ల వచ్చే నిరాసక్తతను తగ్గించి ఉత్సాహాన్ని ఇస్తాయి. వీటిలో ఎక్కువగా కూరగాయలు ఉండడం వల్ల క్యాలరీలు తక్కువగా ఉండి, చలికాలంలో బరువు నియంత్రణలో ఉంచేందుకు సహాయపడతాయి. కానీ ఈ సూపుల్లో వెన్న, క్రీమ్‌ వంటివి వాడరాదు. బాదం, ఆక్రోట్‌, పల్లీలు, అవిసెగింజలు, పుచ్చ గింజలు లాంటి గింజలు, విత్తనాలు శరీరానికి అవసరమైన మంచి కొవ్వులు, శక్తిని అందిస్తాయి. రోజూ ఓ పండు తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్‌ సి లభిస్తుంది. పాలు, పెరుగు నిరోధక శక్తిని కాపాడేందుకు సహాయపడతాయి. ముఖ్యంగా చలికాలంలో నీళ్లు తక్కువగా తాగే అలవాటు ఉంటుంది కాబట్టి, రోజుకు కనీసం 2 నుంచి 2.5 లీటర్ల గోరువెచ్చని నీరు తాగడం ఎంతో ముఖ్యం. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటూ రోజూ తప్పనిసరిగా శారీరక శ్రమ లేదా వ్యాయామం కూడా చేస్తే చలికాలంలో కూడా శరీరం చురుకుగా, ఉత్సాహంగా ఉంటుంది.


ఇది పచ్చి పల్లీల సీజన్‌. వేరు శెనగల్లో ఉన్న పోషక విలువలు తెలియజేయండి.

- జ్యోతి, విజయనగరం

వేరుశెనగ గింజల్లో మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు అధికం. వీటిలో క్యాలరీలు కూడా ఎక్కువే. వంద గ్రాముల పల్లీల నుంచి ఆరువందల క్యాలరీలొస్తాయి. తక్కువ పిండి పదార్థాలు ఉండడం, గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా కావడం వల్ల మధు మేహం ఉన్నవారికి ఇది మంచి ఆహారం. పల్లీలను తక్కువ మొత్తంలో తీసుకున్నప్పటికీ వాటిలోని మాంస కృత్తులు, కొవ్వులు, పీచుపదార్థాల వల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. కాబట్టి వేయించిన చిరుతిళ్ల స్థానంలో వేరుశెనగ గింజలను తీసుకున్నప్పుడు బరువు నియంత్రణలో ఉంటుంది. వేరుశెనగలోని కొవ్వులో ఉండే మోనో శాచ్యురేటెడ్‌, పాలీ శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాల వల్ల, మాంసకృత్తుల వల్ల శరీరంలో జీవక్రియ వేగం కొంత పెరుగుతుంది. కాబట్టి తగు మోతాదులో పల్లీలు తీసు కున్నప్పుడు బరువు తగ్గేందుకు కూడా ఉప యోగపడతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ ఉన్నవారు పల్లీలు తినకూడదు అనుకోవడం కూడా అపోహ మాత్రమే. మంచి ఆహారం, శారీరక వ్యాయామంతో కూడిన ఆరోగ్యకర మైన జీవనశైలిలో భాగంగా రోజుకు పిడికెడు పల్లీలు నానబెట్టి లేదా ఉడికించి లేదా నూనె లేకుండా వేయించి, ఇలా వివిధ రకాలుగా అందరూ తీసుకోవచ్చు. అధిక క్యాలరీలు ఉంటాయి. కాబట్టి మోతాదు మించితే బరువు పెరుగుతారు. పీనట్‌ ఎలర్జీ ఉన్నవారు మాత్రం వీటికి దూరంగా ఉండాలి.

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.com కు పంపవచ్చు)


ఈ వార్తలు కూడా చదవండి..

రాజకీయాలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

చుక్కలు చూపిస్తున్న ఇండిగో

Read Latest Telangana News and National News

Updated Date - Dec 07 , 2025 | 12:13 PM