Share News

Health: పాలకోవా ఆరోగ్యానికి మంచిదేనా?

ABN , Publish Date - Nov 30 , 2025 | 11:45 AM

పాలను ఎక్కువసేపు మరిగించి దానిలోని నీటి శాతాన్ని తగ్గించి గట్టి పదార్థంగా మార్చి పాలకోవా తయారు చేస్తారు. కాబట్టి, ఇందులో సహజంగానే కొవ్వు, క్యాలరీలు అధికంగా ఉంటాయి. తీపి కోసం చక్కెర లేదా బెల్లం కూడా అధిక మొత్తంలో కలుపుతారు.

Health: పాలకోవా ఆరోగ్యానికి మంచిదేనా?

పిల్లలకీ, పెద్దలకీ సాధారణంగా పాలకోవా అంటే చాలా ఇష్టం. అయితే పాలతో తయారయ్యే ఈ తీపి పదార్థాన్ని తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

- కాంచన, వరంగల్‌

పాలను ఎక్కువసేపు మరిగించి దానిలోని నీటి శాతాన్ని తగ్గించి గట్టి పదార్థంగా మార్చి పాలకోవా తయారు చేస్తారు. కాబట్టి, ఇందులో సహజంగానే కొవ్వు, క్యాలరీలు అధికంగా ఉంటాయి. తీపి కోసం చక్కెర లేదా బెల్లం కూడా అధిక మొత్తంలో కలుపుతారు. అందుకే అన్ని స్వీట్స్‌లాగానే పాలకోవా కూడా మితంగానే తీసుకోవాలి. పాలతో తయారైనది కాబట్టి కోవాలో క్యాల్షియం, ప్రొటీన్‌ లాంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నప్పటికీ, దానితో పాటు అధిక క్యాలరీలు కూడా ఉంటాయి. తరచూ తింటే బరువు పెరుగుతారు. రక్తంలో చక్కెర స్థాయి, కొవ్వు నిల్వలు పెరగడం లాంటి సమస్యలు రావచ్చు. అయితే పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. పరిమిత మోతాదులో, అప్పుడప్పుడు తినడం సురక్షితం. వారానికి ఓసారి లేదా ప్రత్యేక సందర్భాల్లో కొద్దిగా తినడం మంచిది. కేవలం మైదా, చక్కెర, నూనెలు లేదా డాల్డాలతో తయారు చేసే స్వీట్లతో పోలిస్తే పాలకోవా మెరుగైన ఎంపికే.


మా అన్నయ్యకు నలభై ఏళ్లు. ఆయనకు గత 6 నెలలుగా నరాల సమస్య ఉంది. ఆస్పత్రిలో చూపిస్తున్నాం, షుగర్‌, నొప్పి టాబ్లెట్లు వాడుతున్నారు. కానీ ఎలాంటి మార్పు కనిపించడం లేదు. కాలినొప్పి, నడకలో నొప్పి అలాగే కొనసాగుతున్నాయి. నొప్పి తగ్గకపోవడంతో మానసికంగా బాధపడుతున్నారు. నరాల నొప్పిని తగ్గించడానికి ఏం చేయాలి? ఏమైనా మంచి సలహా ఉందా?

- శ్రీను, గుంటూరు

నరాల సమస్య వివిధ కారణాల వల్ల రావొచ్చు. దీర్ఘకాలికంగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేనప్పుడు డయాబెటిక్‌ న్యూరోపతీ అనే నరాల సమస్య వచ్చే అవకాశం ఎక్కువ. దీర్ఘకాలంగా ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, కండరాల బలహీనత, స్పర్శ తగ్గడం, దృష్టి మార్పులు, జ్ఞాపకశక్తి తగ్గడం, సమన్వయం కోల్పోవడం వంటి సమస్యలు నరాల బలహీనత లక్షణాలు. నరాలను బలపరచడానికి ఆహారంలో ప్రత్యేక పోషకాలు తప్పనిసరి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉన్న చేపలు, అవిసె గింజలు, ఆక్రోట్లు తరచుగా తీసుకోవడం మంచిది. యాంటీఆక్సిడెంట్లు ఉన్న ఆకుకూరలు, ముదురు రంగు కూరగాయలు, పండ్లు రోజూ సరిపడా తీసుకోవాలి. పసుపులోని కర్క్యుమిన్‌, గ్రీన్‌ టీ లోని ఫ్లేవనాయిడ్స్‌ నరాల ఆరోగ్యానికి సహాయపడతాయి. ప్రాసెస్‌ చేసిన ఆహారం, వేపుళ్లు, తీపి పదార్థాలు, ఫాస్ట్‌ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. ఆహారంతో పాటు నిత్యం తేలికపాటి వ్యాయామం చేస్తే నరాల బలహీనత తగ్గుతుంది. ఒత్తిడి తగ్గించుకోవడం, మంచి నిద్ర పోవడం కూడా నరాల ఆరోగ్యానికి చాలా అవసరం. వీటన్నింటితోపాటు డయాబెటీస్‌ అదుపులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.


ఈమధ్య కాలంలో జొన్న రొట్టెలు తినేవారి సంఖ్య పెరిగింది. జొన్నలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించండి?

- అఖిల్‌, మహబూబ్‌నగర్‌

book8.2.jpg

బియ్యం, గోధుమలకు ప్రత్యామ్నాయంగా జొన్న అన్నంగానూ, జొన్న రొట్టెల్లానూ వాడడం ఎప్పటి నుంచో ఉంది. ఇదే ఈమధ్య కాలంలో మళ్లీ మొదలైంది. ముఖ్యంగా తెలంగాణలోని ప్రతి వీధిలో జొన్న రొట్టె బండ్లను ఎక్కువగా చూస్తున్నాం. పోషకాల గనిగా జొన్నలను పేర్కొనవచ్చు. వందగ్రాముల జొన్నల్లో దాదాపు 330 క్యాలరీలు, 11 గ్రాముల ప్రొటీన్లు, 70 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. జొన్నల్లో పీచుపదార్థం కూడా ఎక్కువే. జొన్నల్లోనూ, జొన్న పిండిలోనూ విటమిన్‌ బి1, బి6, కాపర్‌, ఐరన్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, పొటాషియం, జింక్‌ మొదలైన పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలన్నీ శరీరంలోని జీవవ్యవస్థలు సరిగా పని చేయడానికి, నరాలు బలంగా ఉండేందుకు, చర్మం, జుట్టు ఆరోగ్యానికి, ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించేందుకు ఇలా వివిధ రకాలుగా ఉపయోగపడతాయి. జొన్నల్లో గ్లూటెన్‌ అనే పదార్థం లేకపోవడం వల్ల గోధుమలు పడని వారికి, గ్లూటెన్‌ ఎలర్జీ ఉన్నవారికీ కూడా జొన్న రొట్టెలు మంచి ప్రత్యామ్నాయం. జొన్నలు అందరికీ మంచిదే. అన్ని వయసులవారూ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.com కు పంపవచ్చు)


ఈ వార్తలు కూడా చదవండి..

రాజకీయంగా ఎదుర్కోలేకే ఆరోపణలు

నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 30 , 2025 | 11:45 AM