Share News

ఇన్సులిన్‌ ఆకుల ప్రత్యేకత ఏమిటో తెలుసుకోండి ఇలా...

ABN , Publish Date - Jun 08 , 2025 | 12:18 PM

ఇన్సులిన్‌ ఆకు అనేది ‘ఇన్సులిన్‌ ప్లాంట్‌’ అనే ఔషధ మొక్కకు సంబంధించింది. ఈ ఆకును పరగడుపున నమిలి తీసుకొంటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించేందుకు ఉపయోగపడుతున్నట్టు కొన్ని శాస్త్రీయ పరిశోధనల్లో తేలింది.

ఇన్సులిన్‌ ఆకుల ప్రత్యేకత ఏమిటో తెలుసుకోండి ఇలా...

ఇన్సులిన్‌ ఆకు గురించి ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం. దీనివల్ల నిజంగానే రక్తంలో గ్లూకోజు తగ్గుతుందా? దీనిని ఎలా తీసుకోవాలి?

- రాజేశ్‌, సికింద్రాబాద్‌

ఇన్సులిన్‌ ఆకు అనేది ‘ఇన్సులిన్‌ ప్లాంట్‌’ అనే ఔషధ మొక్కకు సంబంధించింది. ఈ ఆకును పరగడుపున నమిలి తీసుకొంటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించేందుకు ఉపయోగపడుతున్నట్టు కొన్ని శాస్త్రీయ పరిశోధనల్లో తేలింది. కానీ ఈ పరిశోధనలో పాల్గొన్న వారి సంఖ్య చాలా తక్కువ. కాబట్టి ఈ ఫలితాలు అందరికీ వర్తిస్తాయని చెప్పలేం. మధుమేహం ఉన్నవారు ఇన్సులిన్‌, ఇతర మందులను వాడుతున్న వారు కూడా వైద్యుల సలహా మేరకు ఈ ఇన్సులిన్‌ ఆకును వినియోగించవచ్చు. ఈ ఆకు వాడకం వల్ల కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నట్టు పరిశోధనా పత్రాల్లో ఉంది. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయి బాగా పడిపోవడం, కళ్ళు తిరగడం, స్పృహ తప్పడం, కడుపులో తిప్పడం, విరేచనాలు మొదలైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీరు తీసుకొనే మందులకు అనుగుణంగా ఎలాంటివి తీసుకోవచ్చో... వైద్యులను సంప్రదించకుండా ఇటువంటి హెర్బల్‌ సప్లిమెంట్లను తీసుకోకుండా ఉండడమే మంచిది.


నాకు 50 ఏళ్ళు. ఈ మధ్య గోళ్లు పల్చబడి త్వరగా విరిగిపోతున్నాయి. కనురెప్పల వెంట్రుకలు కూడా రాలిపోతున్నాయి. ఆహారపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

- కాత్యాయని, నెల్లూరు

గోళ్లు పలచబడడం, జుట్టు రాలడం మొదలైనవి కొన్ని పోషకాల లోపం వలన వచ్చే అవకాశం ఉంది. ఆహారంలో తగినంత ప్రొటీన్‌ లేకపోయినా ఈ విధమైన లక్షణాలు ఉంటాయి. ప్రొటీన్‌ కోసం మాంసం, చికెన్‌, చేప, గుడ్లు మొదలైనవి తినేవారైతే వారంలో ఒకటి రెండుసార్లు అయినా చేర్చుకోండి. శాకాహారులైతే రోజూ తప్పనిసరిగా పప్పు ధాన్యాలు, రాజ్మా, సోయా చిక్కుడు లాంటి గింజలు, మీల్‌ మేకర్‌, సోయా పనీర్‌, పాలు, పెరుగు, లో ఫ్యాట్‌ పనీర్‌ మొదలైనవి తీసుకోవాలి. బయోటిన్‌ అనే బీ విటమిన్‌, ఐరన్‌, జింక్‌, విటమిన్‌ డీ కూడా గోళ్లు, జుట్టు, చర్మ ఆరోగ్యానికి అవసరం. ఆకుకూరలు తరచూ తీసుకోవడం ద్వారా ఐరన్‌ పొంద వచ్చు. పప్పు ధాన్యాలతో పాటు, బాదం, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పిస్తా, పల్లీ మొదలైన గింజల న్నింటిలోనూ వివిధ రకాల బీ విటమిన్స్‌, ఐరన్‌, జింక్‌ లాంటి పోషకాలు ఉంటాయి. ఆహారంలో జాగ్రత్తలతో పాటు వైద్యుల సలహాతో తగిన రక్త పరీక్షలు చేయించుకొని, వారుసూచించిన సప్లిమెంట్లు కూడా వాడాల్సి రావొచ్చు.


బీట్‌రూట్‌లోని పోషకాలేమిటి? మధుమేహం ఉన్నవారు కూడా బీట్‌రూట్‌ తీసుకోవచ్చా?

- మనోహరి, కరీంనగర్‌

book8.2.jpg

ముదురు ఎరుపు రంగులో ఆకర్షణీయంగా కనిపిస్తూ, తియ్యటి రుచితో ఉండే బీట్‌రూట్‌ను పచ్చిగా సలాడ్లు, జ్యూస్‌లు, సూప్స్‌, చట్నీల్లో వాడడం మామూలే. బీట్‌ రూట్‌లో అధిక భాగం నీరే ఉంటుంది. దాంతో వీటిలో క్యాలరీలు తక్కువ. వంద గ్రాముల పచ్చి బీట్‌రూట్‌ లో కేవలం నలభై ఐదు క్యాలరీలే ఉంటాయి. తొమ్మిది గ్రాముల పిండి పదార్థాలు, మళ్లీ అందులో మూడు గ్రాముల పీచు పదార్థాలు ఉంటాయి. తియ్యటి బీట్‌రూట్‌లో ఉండే పిండి పదార్థాలకు రక్తంలో త్వరగా గ్లూకోజుగా మారే లక్షణాలుంటాయి. అయితే రెండు లేదా మూడు వందల గ్రాములకు మించి బీట్‌రూట్‌ ను ఒకేసారి తీసుకుంటే తప్ప రక్తంలో గ్లూకోజు స్థాయిలు అంతగా పెరగవు. కాబట్టి డయాబెటీస్‌ ఉన్నవారు నిశ్చింతగా పరిమిత మోతాదుల్లో బీట్‌ రూట్‌ను తీసుకోవచ్చు. గర్భిణులకు ముఖ్యమైన ఫోలేట్‌ కూడా ఇందులో ఉంది. పొటాషియం, మెగ్నీషియం, ఐరన్‌ బీట్‌ రూట్‌లో ఉంటాయి. పచ్చిగా తింటే విటమిన్‌ సి కూడా లభిస్తుంది. బీట్‌రూట్‌లో ఉండే ఇనార్గానిక్‌ నైట్రేట్స్‌ రక్త ప్రసరణ బాగుండడానికి, అధిక రక్తపోటును నియంత్రించ డానికి ఉపయోగపడతాయి. తద్వారా గుండె జబ్బులను నియంత్రించడానికి కూడా బీట్‌రూట్‌ ఉపయోగపడుతుంది. ఆటలాడేప్పుడు, వ్యాయామం చేసేప్పుడు సామర్ధ్యాన్ని పెంచడానికి బీట్‌రూట్‌ ఉపయోగపడుతుంది. కొంతమందికి బీట్‌రూట్‌లోని ఫ్రూక్టాన్స్‌ అనే పదార్థాల వల్ల కడుపు ఉబ్బరం, విరేచనాలు లాంటి సమస్యలు వస్తాయి. వాళ్లు బీట్‌రూట్‌ తినకపోవడం మంచిది. మూత్రపిండాల్లో రాళ్లు వచ్చిన వాళ్ళు కూడా ఆ సమస్య పరిష్కారమయ్యే దాక బీట్‌రూట్‌ వాడరాదు.


ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. నిలకడగా బంగారం ధరలు..

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి

Read Latest Telangana News and National News

Updated Date - Jun 08 , 2025 | 12:18 PM