Health: సన్నబడిన శ్వాసనాళానికి చికిత్స..
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:13 AM
సన్నబడిన శ్వాసనాళానికి వైద్యులు చికిత్స చేసి ఓ యువకుడి నిండు ప్రాణాన్ని కాపాడారు. నగరానికి చెందిన యువకుడు రెండేళ్ల క్రితం ఫినాయిల్ తాగడంతో శ్వాసనాళం పూర్తిగా దెబ్బతిన్నది. అయితే.. వైద్యులు అతడికి చికిత్స అందించి ప్రాణాపాయం లేకుండా చేశారు. వివరాలిలా ఉన్నాయి.
రాయదుర్గం(హైదరాబాద్): అనుకోకుండా జరిగిన ప్రమాదంతో శ్వాసనాళం సన్నబడి ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్న ఓ యువకుడికి గచ్చిబౌలి కిమ్స్ ఆస్పత్రి వైద్యులు శ్వాసనాళాన్ని పునరుద్ధ్దరించి కొత్త జీవితం ప్రసాదించారు. ఈ చికిత్సకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ మినిమల్ ఇన్వేసివ్, రోబోటిక్ సర్జన్, ఆంకో-ధొరాసిక్ సర్జన్ డాక్టర్ రోహన్‌రెడ్డి(Dr Rohan Reddy) తెలిపారు. నగరానికి చెందిన యువకుడు రెండేళ్ల క్రితం ఫినాయిల్ తాగడంతో శ్వాసనాళం పూర్తిగా దెబ్బతిన్నది. అతడి ఉదరభాగం నుంచి ఆ పదార్థాలు తొలగించేందుకు పలుమార్లు వరుసగా చికిత్సలు చేశారు.
ఈ క్రమంలో అతడి శ్వాసనాళం సన్నబడిపోయింది. రెండు సెంటీమీటర్లు ఉండాల్సి ఉండగా, 8 మిల్లీమీటర్ల స్థాయికి తగ్గిపోయింది. దీంతో ఊపిరి ఆడక, కొంచెం కళ్లి వచ్చినా అది మధ్యలో ఇరుక్కుపోయి అతడు ఉక్కిరిబిక్కిరి అయిపోయేవాడు. బాగా దగ్గి అది పోతే తప్పా మళ్లీ ఊపిరి అందేదికాదు. దీంతో తను కిమ్స్ ఆస్పత్రికి రాగా వైద్యులు అన్ని రకాల పరీక్షలు చేసి అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేసి శ్వాసనాళాన్ని పునరుద్ధ్దరించాల్సి ఉంటుందని నిర్ణయించారు.

దాదాపు మూడున్నర సెంటీమీటర్ల మేర శ్వాసనాళం సన్నబడిపోయి పనికిరాదని గుర్తించి దానిని కత్తిరించి తీసివేసి, మిగిలిన దానిని అత్యాధునిక విధానాలతో కొంత సాగతీసి బాగున్న రెండు భాగాలు కలిపి అతికించారు. దీంతో అతడి శ్వాసనాళం పూర్వస్థితికి చేరింది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా మామూలుగా గాలి పీల్చుకుంటున్నాడు. ఇలాంటి శస్త్ర చికిత్సలు చేయాలంటే అత్యంత నైపుణ్యం ఉన్న వైద్యులతో పాటు అం దుకు అవసరమైన అత్యాధునిక పరికరాలు కూడా అవసరమన్నారు. కార్యక్రమంలో వైద్యులు విజయ్, రామఫణీంద్ర పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి, వెండి.. మళ్లీ పెరిగాయిగా.. నేటి ధరలు ఇవీ
Read Latest Telangana News and National News