గుండెకు మేలు చేసే నూనె...
ABN , Publish Date - Oct 26 , 2025 | 09:56 AM
వంటింట్లో ఘుమఘుమల వెనక వంట నూనె పాత్ర ప్రధానమైనది. అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు అన్ని వంటకాలకు అది అవసరం. భారతదేశంలో ప్రతీ వ్యక్తి సగటుగా ఏటా 16 కిలోల వంటనూనె వాడుతున్నాడు. ఈ డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో మనదేశం ప్రజల అవసరాల కోసం 60 శాతం నూనెను దిగుమతి చేసుకుంటోంది.
వంటింట్లో ఘుమఘుమల వెనక వంట నూనె పాత్ర ప్రధానమైనది. అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు అన్ని వంటకాలకు అది అవసరం. భారతదేశంలో ప్రతీ వ్యక్తి సగటుగా ఏటా 16 కిలోల వంటనూనె వాడుతున్నాడు. ఈ డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో మనదేశం ప్రజల అవసరాల కోసం 60 శాతం నూనెను దిగుమతి చేసుకుంటోంది.
ప్రస్తుతం మార్కెట్‌లో లభించే నూనెలన్నీ ఆరోగ్యానికి మేలు చేయవు. పాల్మిటిక్ ఆమ్లం అధికంగా ఉన్న నూనెలు గుండెకు ముప్పు తెస్తాయి. ఈ పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా కొత్త మార్గం చూపింది ‘ఇక్రిశాట్’ (ICRISAT ). ఈ సంస్థ అభివృద్ధి చేసిన ‘హై ఓలిక్’ వేరుశెనగ రకాలు మన ఆహారపు పద్ధతుల్లో సరికొత్త జవసత్వాలు అందించనున్నాయి.
ఏమిటీ ‘హై ఓలిక్’?
‘ప్రస్తుతం భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలు ఆరోగ్యకరమైన నూనెల వైపు మళ్లడం అత్యవసరం. పాల్మిటిక్ ఆమ్లం అధికంగా ఉన్న నూనెలు గుండె సంబంధిత వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయి. దీని నుంచి ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇవ్వడానికి, ఓలిక్ ఆమ్లం (High Oleic Acid) అధికంగా ఉండే కొత్త వేరుశెనగ వంగడాన్ని ‘ఇక్రిశాట్’ అభివృద్ధి చేసింది. ఓలిక్ ఆమ్లం ఉన్న నూనెను ఆహారంలో తీసుకోవడం వల్ల ‘హెచ్‌డీఎల్’ (మంచి కొవ్వు) స్థాయి పెరుగుతుంది ‘ఎల్‌డీఎల్’ (చెడు కొవ్వు) స్థాయి తగ్గుతుంది. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గిపోతుంది’ అంటారు ఇక్రిశాట్ ప్రధాన సైంటిస్ట్ డా. జనిలా.

మనదేశంలో పెరుగుతున్న గుండె వ్యాధులను తగ్గించడానికి అధిక ఓలిక్ ఆమ్లం కలిగిన వేరుశెనగ నూనె ఒక ఆరోగ్యకరమైన, స్థిరమైన ప్రత్యామ్నాయం. ‘ఇక్రిశాట్’ భారతదేశంలోని జాతీయ వ్యవసాయ సంస్థలతో కలిసి... అధిక ఓలిక్ ఆమ్లం కలిగిన వేరుశెనగ రకాలను అభివృద్ధి చేసింది. అవి గిర్నార్ 4, గిర్నార్ 5 పేర్లతో గుజరాత్ సహా కొన్ని రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందాయి.
రైతులకు అధిక ఆదాయం
90-95 రోజుల్లో పండే తక్కువ కాలం వేరుశెనగ రకాలు అధిక దిగుబడిని ఇస్తాయి. తద్వారా రైతులకు ఎక్కువ ఆదాయం వస్తుంది. ఇవి వసంత - గ్రీష్మకాల సాగు పద్ధతులకు అనుకూలంగా ఉంటాయి. అదే విధంగా, వీటి నూనెలో అధిక ఓలిక్ ఆమ్లం ఉండడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నూనె నిల్వ కాలం కూడా ఎక్కువగా ఉండి, ఎగుమతిదారులకు ప్రయోజనం కల్పిస్తుంది.
అరుదైన పోషక విలువలు
ఈ వేరుశెనగ రకాలలో 80 శాతం వరకు ఓలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది ఆలివ్ ఆయిల్ స్థాయిలో ఉంటుంది. సాధారణ వేరుశెనగల్లో ఇది కేవలం 50 శాతం మాత్రమే ఉంటుంది. ఓలిక్ ఆమ్లం ఆక్సీకరణకు తక్కువగా లోనవుతుంది, అందువల్ల నూనెల్లో దుర్వాసన లేదా రుచి చెడిపోవడం జరగదు. జాతీయ నూనె గింజల మిషన్ లక్ష్యం 2030 నాటికి ప్రధాన నూనె గింజల ఉత్పత్తిని 69.7 మిలియన్ టన్నులకు పెంచడం. ఈ లక్ష్య సాధనలో కొత్త వంగడం ప్రధాన పాత్ర పోషిస్తుంది.
విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి?
‘మేం ప్రస్తుతం అభివృద్ధి స్థితిని అంచనా వేసే అధ్యయనం చేశాం. ఫలితాలు చాలా సానుకూలంగా వచ్చాయి. మెషీన్ లెర్నింగ్, జనోమిక్స్ వంటి ఆధునిక పద్ధతుల ద్వారా మరింత మెరుగైన రకాలు అభివృద్ధి చేసే అవకాశముంది. ఈ కొత్త వేరుశెనగ రకాలు పాత జాతీయ రకాల కన్నా 10-25 శాతం ఎక్కువ పంట దిగుబడిని ఇస్తాయి. ఐఈగ 15083 (గిర్నార్ 4), ఐఈగ 15090 (గిర్నార్ 5) విత్తనాలు తెలంగాణ రాష్ట్ర విత్తన సంస్థ వద్ద అందుబాటులో ఉన్నాయి‘ అని డా. జనిలా చెప్పారు.
ఇవి సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడానికి కూడా అనుకూలం. తెలంగాణలో కొంతమంది రైతులు సహజ వ్యవసాయ పద్ధతిలో ఈ వేరుశెనగ రకాన్ని సాగు చేసి మంచి ఫలితాలు పొందారు. సేంద్రియ సాగు వల్ల గింజలు బాగా పెరుగుతాయి. దానివల్ల అధిక దిగుబడి వస్తుంది. ఈ పంట పచ్చిరొట్ట పశువులకు మేతగా ఉపయోగపడుతుంది. వీటిలో 13 శాతం ప్రొటీన్ ఉండడం వల్ల పాల దిగుబడి పెరుగుతుంది.
ఈ వేరుశెనగ గింజల్లో సుమారు 25 శాతం ప్రొటీన్ ఉంటుంది. దీనివల్ల పీనట్ బటర్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతుంది. హై ఓలిక్ వేరుశెనగ సాధారణ పంట కాదు... ఇది రైతుకి ఆదాయం, వినియోగదారుడికి ఆరోగ్యం, పర్యావరణానికి భరోసా.
- శ్యాంమోహన్, 94405 95858