మొక్కజొన్న కంకులు ఉడికించినవా.. కాల్చినవి తినాలా..
ABN , Publish Date - Jul 27 , 2025 | 11:47 AM
వందగ్రాముల ఉడికించిన మొక్కజొన్న గింజల్లో దాదాపు వంద క్యాలరీలు ఉంటాయి. అన్ని రకాల ముడి ధాన్యాల్లానే మొక్కజొన్నలో కూడా పిండి పదార్థాలు అధికం. ఈ పిండిపదార్థాల్లో భాగంగానే కొంత చక్కెర కూడా మొక్కజొన్న గింజల్లో ఉంటుంది.

మొక్కజొన్నల కాలం వచ్చేసింది. వీటిలో పోషకాలు తెలియచేయండి. నిప్పులపై కాల్చినవి తింటే మంచిదా, ఉడికించినవా? ఈ పోషకాల్లో ఏమైనా తేడాలుంటాయా?
- రాధాకృష్ణ, రాజమండ్రి
వందగ్రాముల ఉడికించిన మొక్కజొన్న గింజల్లో దాదాపు వంద క్యాలరీలు ఉంటాయి. అన్ని రకాల ముడి ధాన్యాల్లానే మొక్కజొన్నలో కూడా పిండి పదార్థాలు అధికం. ఈ పిండిపదార్థాల్లో భాగంగానే కొంత చక్కెర కూడా మొక్కజొన్న గింజల్లో ఉంటుంది. అంతేకాదు మొక్కజొన్న గింజల్లో కొంతవరకు పీచుపదార్థం కూడా ఉంటుంది. మొక్క జొన్న పేలాల్లో కూడా పీచుపదార్థం ఉంటుంది. బీ3, బీ5, బీ6, బీ9 మొదలైన విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ లాంటి ఖనిజాలు మొక్కజొన్న గింజలో, పేలాల్లోనూ లభిస్తాయి.
అధిక పిండి పదార్థాలు ఉండడం వలన మధుమేహం ఉన్నవారు వివిధ రకాల ధాన్యాలతో పాటు మొక్కజొన్నను పరిమిత మోతాదులోనే తీసుకోవాలి. మొక్కజొన్నలో ఉండే ల్యూటిన్, జియాగ్జాన్థిన్ అనే యాంటీఆక్సిడెంట్స్ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మొక్కజొన్న కంకులను తక్కువ నీటిలో ఆవిరిపై ఉడికిస్తే వాటిలోని పోషకాలకు ఎక్కువ నష్టం కలగకుండా చూసుకోవచ్చు. ఒకవేళ బొగ్గులపై లేదా మంటలో నేరుగా కాల్చి నట్టయితే ఎక్కువ కాలినా లేదంటే కొద్దిగా మాడినా ఆ గింజలను పక్కకు తీసేసి మిగిలినవి తినడం మంచిది. మాడిన గింజల్లో క్యాన్సర్ కారక పదార్థాలు ఉండే అవకాశం ఎక్కువ.
చిలగడ దుంపలు బాగా దొరుకుతున్నాయి. తియ్యగా ఉంటాయి కదా, షుగర్ ఉన్నవారు కూడా తిన్నా పర్లేదా?
- కాదంబరి, నల్లగొండ
శీతాకాలంలో ఎక్కువగా దొరికే ఈ దుంపల్ని ఉడికించి, కూర, పులుసులు వంటివి చేసుకోవడానికి అనువుగా ఉంటాయి. వండడానికి, తినడానికి తేలికగా ఉంటాయి. ఇంకా రుచి ఎక్కువ. కాబట్టి అన్ని వయసుల వారు ఇష్టపడి తినే దుంప ఇది. చిలగడ దుంపల్లో వివిధ రకాల పోషక పదార్థాలు ఉంటాయి. అన్ని దుంప జాతి కూరగాయల్లానే వీటిల్లో కూడా పిండి పదార్థాలు పుష్కలం. శరీరానికి అవసరమైన శక్తిని ఇవ్వడానికి పిండి పదార్థాలు కావాలి. చిలగడ దుంపల్లో అధిక మోతాదుల్లో ఉండే పీచుపదార్థం జీర్ణక్రియకు, రక్తంలోని గ్లూకోజు పరిమాణాన్ని నియంత్రణలో ఉంచడానికి, పెద్ద పేగుల క్యాన్సర్‌ను నివారించడానికి ఉపయోగపడుతుంది.
ఈ దుంపల్లో రక్తపోటును నియంత్రించే పొటాషియం, కండరాలు, నాడుల పనితీరును సరిగా ఉంచే మెగ్నీషియంతో పాటు, పిరిడాక్సిన్, బీటాకెరోటిన్, విటమిన్ సి వంటి రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్లు కూడా అధికంగా ఉంటాయి. కేవలం భోజనంతో పాటే కాకుండా ఉడికించి, సాయంత్రంపూట అల్పాహారంగా పిల్లలు, పెద్దలు తీసుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. చలికాలంలో చేసుకునే సూప్స్‌లో కూడా కొద్దిగా ఉడికించిన చిలగడ దుంపలను గ్రైండ్ చేసి వేస్తే రుచిగా ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవారు మితంగా తీసుకుంటే ఎటువంటి ఇబ్బందీ ఉండదు. కేవలం దుంప మాత్రమే కాక పై చెక్కుతో పాటు తీసుకొంటే మరింత మంచిది.
గొంతులో గరగర, దగ్గు ఉన్నప్పుడు పాలల్లో పసుపు, మిరియాల పొడి వేసుకొని తాగమం టుంటారు కదా. దీని వల్ల ఉపయోగం ఏమిటి?
- అమూల్య, విజయవాడ
పసుపులో ఉండే కర్కుమిన్ అనే యాంటీఆక్సిడెంట్ కొవ్వులో కరిగే స్వభావం కలిగి ఉంటుంది. దీనిని శరీరం శోషించుకునేందుకు మిరియాలు ఉపయోగపడతాయి. సాధారణంగా పాలలో కొద్దిగా కొవ్వు పదార్థాలు కూడా ఉంటాయి. కాబట్టి అందులో పసుపు, మిరియాల పొడి వేసుకొంటే శరీరం సంగ్రహించేందుకు బాగుంటుంది. పసుపులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడం ద్వారా గొంతు గరగర, దగ్గును నియంత్రించేందుకు ఉపయోగపడతాయి. అలాగే పాలు, పాల పదార్థాల్లోని ట్రిప్టోఫాన్ అనే ఎమినో ఆమ్లం నిద్ర చక్కగా పట్టేందుకు సహాయపడుతుంది. అందుకే చక్కటి విశ్రాంతి లభించి, త్వరగా కోలుకునేందుకు వీలుంటుంది. పాలు, పాల పదార్థాలు సరిపడని వారు గోరువెచ్చటి నీళ్లలో కొద్దిగా తేనె వేసుకొని తాగితే కూడా దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్