Health: యాంటీ బయాటిక్స్ పనిచేయట్లేదు..
ABN , Publish Date - Nov 19 , 2025 | 09:25 AM
మానవాళికి వరంలా అందివచ్చిన యాంటీబయాటిక్స్.. మన విచ్చలవిడి, విచక్షణ రహిత వినియోగం కారణంగా క్రమంగా శక్తిని కోల్పోతున్నాయి. వైద్యులు చేసన సిఫారసుకు విరుద్ధంగా ఇష్టానుసారంగా వాడటం, కోర్సును మధ్యలోనే వదిలేయడం వంటివి చేయడం వల్ల బ్యాక్టీరియాలు.. యాంటీ బయాటిక్స్ నిరోధకతను సంతరించుకుని బలంగా మారుతున్నాయి.
- విచ్చలవిడి వినియోగమే కారణం
- ఏఐజీ ఆస్పత్రి విస్తృత అధ్యయనంలో వెల్లడి
హైదరాబాద్ సిటీ: మానవాళికి వరంలా అందివచ్చిన యాంటీబయాటిక్స్(Antibiotics).. మన విచ్చలవిడి, విచక్షణ రహిత వినియోగం కారణంగా క్రమంగా శక్తిని కోల్పోతున్నాయి. వైద్యులు చేసన సిఫారసుకు విరుద్ధంగా ఇష్టానుసారంగా వాడటం, కోర్సును మధ్యలోనే వదిలేయడం వంటివి చేయడం వల్ల బ్యాక్టీరియాలు.. యాంటీ బయాటిక్స్ నిరోధకతను సంతరించుకుని బలంగా మారుతున్నాయి. దీనిపై ఏసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ భారత్, అమెరికా, ఇటలీ, నెదర్లాండ్స్ దేశాలలో అధ్యయనం చేసింది.
అయితే మనదేశంలోనే ఈ సమస్య ఎక్కువగా ఉందని, ఎండోస్కోపీ చేయించుకోవడానికి ఆస్పత్రికి వస్తున్న 83శాతం మంది శరీరంలో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా (అంటే.. రకరకాల యాంటీబయాటిక్స్ మందులకు లొంగని సూక్ష్మజీవులు) ఉంటున్నట్టు ఈ అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుతం (నవంబరు 18 నుంచి 25 వరకూ) ‘యాంటీబయాటిక్ స్టీవార్డ్‌షిప్ వీక్’ జరుగుతోంది. ఇలాంటి సమయంలో.. భారత్‌లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అధ్యయన వివరాలు వెల్లడి కావడం గమనార్హం.
బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల చికిత్సలో భాగంగా వాడే మొదటి మూడు లైన్ల మందులూ ఈ తరహా బ్యాక్టీరియాపై పనిచేయడంలేదని.. దీంతో నాలుగో లైన్ మందులను వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. అందులోనూ కేవలం రెండు రకాలు మాత్రమే ఉన్నాయని, ఆ మందులు కూడా పనిచేయని పరిస్థితి వస్తే ఇక ఎవరూ ఏమీ చేయలేరని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ అధ్యయన ఫలితాలు లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

కారణాలు ఇవి...
- ఎవరు పడితే వారు సులువుగా మందులు తీసుకోవడం
- కోర్సు ప్రకారం యాంటీ బయాటిక్స్ వినియోగించకపోవడం
- ప్రిస్ర్కిప్షన్ లేకున్నా మెడికల్ దుకాణాల్లో కొనుక్కోవడం ప్రజలు పాటించాల్సిన ఆరు సూత్రాలు యాంటీబయాటిక్స్ వినియోగానికి సంబంధించి ఏఐజీ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సూచించిన ఆరు సూత్రాలు
- వైద్యులు సిఫారసు చేయకుండా యాంటీబయాటిక్స్ తీసుకోవద్దు
- వైరల్ ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ ఇవ్వాలని అడగొద్దు
- యాంటీబయాటిక్ మందులను.. వైద్యుల సూచన ప్రకారం పూర్తి కోర్సు వేసుకోవాలి. మధ్యలోనే ఆపేయవద్దు
- శుభ్రత పాటించాలి
- టీకాలు సమయానికి వేయించుకోవాలి
- పెంపుడు జంతువులు, పశువులకు వైద్యుల సలహా లేకుండా యాంటీబయాటిక్స్ ఇవ్వొద్దు
కఠిన చట్టాలు తేవాలి
ఎండోస్కోపీ పేషెంట్లలోనే 80శాతానికి పైగా మందులకు లొంగని బ్యాక్టీరియా ఉందంటే ఇది సమాజంలో, చుట్టూ ఉండే వాతావరణంలో, నిత్యజీవితంలో భాగమైనట్టే. పరిస్థితి ఇలాగే కొనసాగితే చిన్నచిన్న ఇన్ఫెక్షన్లు సైతం చికిత్సకు లొంగని పరిస్థితి వస్తుంది. యాంటీబయాటిక్ మందుల వినియోగంపై అవగాహనకు దేశంలో ఒక పెద్ద జాతీయ ఉద్యమం అవసరం. డాక్టర్ రాసిన మందులచీటీ ఉన్నవారికి మాత్రమే యాంటీబయాటిక్ ఔషధాలను విక్రయించేలా కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది.
- డాక్టర్ డి. నాగేశ్వర రెడ్డి , చైర్మన్, ఏఐజీ ఆస్పత్రి
ఈ వార్తలు కూడా చదవండి..
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
సినిమాలకు.. ఇక సెలవు! నటనకు వీడ్కోలు.. పలికిన నటి తులసి
Read Latest Telangana News and National News