Share News

Ponnam Prabhakar Reaction: బీఆర్‌ఎస్ నేతల ఇళ్లల్లో సోదాలపై మంత్రి రియాక్షన్

ABN , Publish Date - Nov 07 , 2025 | 11:49 AM

అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పోల్ మేనేజ్మెంట్ చేసి గెలుపొందారని మంత్రి పొన్నం అన్నారు. సెంటిమెంట్ మేనేజ్మెంట్ చేయడంలో బీఆర్ఎస్ నేతలకు అనుభవముందంటూ వ్యాఖ్యలు చేశారు.

Ponnam Prabhakar Reaction: బీఆర్‌ఎస్ నేతల ఇళ్లల్లో సోదాలపై మంత్రి రియాక్షన్
Ponnam Prabhakar Reaction

హైదరాబాద్, నవంబర్ 7: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల వేళ బీఆర్‌ఎస్ నేతల నివాసాల్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు ఇళ్లల్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతల నివాసాల్లో జరుగుతున్న సోదాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) స్పందించారు. శుక్రవారం ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. సోదాలు చేస్తున్న విషయమే తమకు తెలియదని చెప్పుకొచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పోల్ మేనేజ్మెంట్ చేసి గెలుపొందారన్నారు. సెంటిమెంట్ మేనేజ్మెంట్ చేయడంలో బీఆర్ఎస్ నేతలకు అనుభవం ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్సే అని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ప్రజలు మద్దతు తెలుపుతారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.


కాగా.. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఎలాంటి పత్రాలు చూపించకుండా అనధికారికంగా సోదాలు నిర్వహిస్తున్నారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. సీఐఎస్‌ఎఫ్, స్థానిక పోలీసుల పహారా మధ్య తనిఖీలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తమను టార్గెట్ చేసుకుని సోదాలను నిర్వహిస్తోందని బీఆర్‌ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు.


మర్రి జనార్దన్ ఫైర్...

అనధికారికంగా ఎలాంటి పత్రాలు చూపించకుండా తన ఇంట్లో సోదాలు చేస్తున్నారని మర్రి జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి ఇంట్లోకి వెళ్లనివ్వడం లేదని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ నేతలను ఎన్నికల అధికారులు టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులందరినీ తమ ఇంటికి తీసుకువచ్చి జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ ఫైర్ అయ్యారు. బీఆర్‌ఎస్ నేతలను ఇబ్బందులకు గురి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో కూడా ఎన్నికల అధికారులు సోదాలు నిర్వహించాలని మర్రి జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. వివరాలు ఇవే

గిగ్ వర్కర్లకు గుడ్‌న్యూస్.. సమస్యలపై రేవంత్ సర్కార్ ఫోకస్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 07 , 2025 | 12:06 PM