Bihar Elections: సంకీర్ణ ప్రభుత్వంలో చేరే ప్రసక్తే లేదు.. ప్రశాంత్ కిషోర్
ABN , Publish Date - Nov 09 , 2025 | 07:56 PM
జన్‌సురాజ్ నిర్మాణానికి తాము ఎంతో కష్టపడ్డామని, మార్పు ఇప్పటికే కనిపిస్తోందని, ఫలితాల కోసం వేచిచూద్దామని ప్రశాంత్ కిషోర్ అన్నారు. బిహార్ ప్రజలు ఇప్పటికీ మార్పును కోరుకోకుంటే వారితోనే ఉంటూ మరో ఐదేళ్లు పని చేస్తూ వెళ్తానని చెప్పుకొచ్చారు. అంతేకానీ, ప్రభుత్వంలో చేరే ప్రసక్తే లేదన్నారు.
సుపౌల్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) తమ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాని పక్షంలో సంకీర్ణ ప్రభుత్వంలో చేరే అవకాశాలను జన్‌సురాజ్ (Jan Suraaj) పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) తోసిపుచ్చారు. పార్టీ సిద్ధాంతాలతో రాజీ పడేది లేదని, ప్రజలతో కలిసి పనిచేసేందుకే తాము ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఎన్నికల అనంతర పొత్తులు ఉండవని స్పష్టం చేశారు.
'బిహార్ ప్రజలు ఇప్పటికీ మార్పును కోరుకోకుంటే వారితోనే ఉంటూ మరో ఐదేళ్లు పనిచేస్తూ వెళ్తాం. ప్రభుత్వంలో చేరే ప్రసక్తి కూడా లేదు. జనసురాజ్ సొంత బలంపైనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. బలం లేకుంటే ప్రతిపక్షంలో కూర్చుంటుంది. అవసరమైతే మరోసారి ఎన్నికకు వెళ్తాం. మేము బీజేపీకి వ్యతిరేకం. సైద్ధాంతికంగా వారితో మేము విభేదిస్తున్నాం' అని ఆదివారం నాడు ఒక ఇంటర్వూలో ప్రశాంత్ కిషోర్ తెలిపారు.
జన్‌సురాజ్ కోసం ఎంతో శ్రమించాం..
జన్‌సురాజ్ నిర్మాణానికి తాము ఎంతో కష్టపడ్డామని, మార్పు ఇప్పటికే కనిపిస్తోందని, ఫలితాల కోసం వేచిచూద్దామని ప్రశాంత్ కిషోర్ అన్నారు. 'జన్ సురాజ్‌కు ఈసారి ఎక్కువ సీట్లు రాకపోవచ్చు. అప్పుడు మరో ఐదేళ్లు పనిచేస్తాం. తొందరేముంది? నాకు 48 ఏళ్లు. లక్ష్య సాధనకు మరో ఐదేళ్లు వెచ్చిస్తాను' అని చెప్పారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్ 121 నియోజకవర్గాల్లో నవంబర్ 6న జరిగింది. భారీగా 65.08 శాతం పోలింగ్ నమోదైంది. రెండో విడత పోలింగ్ 122 నియోజకవర్గాల్లో నవంబర్ 11న జరుగనుంది. దీంతో పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
ఒక్క కారణంతో ఆయన సేవలు తగ్గించడం సరికాదు.. ఆడ్వాణీపై శశిథరూర్ ప్రశంసలు
హిందూ ధర్మం కూడా ఎక్కడా నమోదు చేసుకోలేదు.. ఆర్ఎస్ఎస్ చట్టబద్ధతపై మోహన్ భాగవత్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి