Bihar Elections 2025: లాంతరు గుడ్డి వెలుతురులో నేరాలకు చెక్.. తొలి దశ భారీ పోలింగ్‌పై యోగి
ABN , Publish Date - Nov 08 , 2025 | 04:12 PM
ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలవడం, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఎల్ఈడీ వెలుగుల్లో మెరిసిపోవడం ఖాయమని యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు.
మోతిహారి: బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో రికార్డు స్థాయిలో పోలింగ్ జరగడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లాంతరు (ఆర్జేడీ గుర్తు) గుడ్డి వెలుతురులో నేరగాళ్లు ఇంకెంతమాత్రం నేరాలు చేయడం కుదరని ఓటర్లు చాలా స్పష్టంగా చెప్పారని చురకలు వేశారు. రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్‌లోని మోతిహారి(Motihari)లో ఆయన శనివారంనాడు ప్రచారం చేశారు.
తొలి దశ పోలింగ్ నవంబర్ 6న ముగియడంతో ట్రెండ్స్ వెలువడుతున్నాయని, లాంతరు గుడ్డి వెలుగుల్లో ఇంకెంతమాత్రం నేరాలకు తావులేదని ప్రజలు చాలా స్పష్టంగా చెప్పారని యోగి అన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలవడం, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఎల్ఈడీ వెలుగుల్లో మెరిసిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అక్షరాస్యత, అభివృద్ధి కుంటుపడటానికి ఆర్జేడీ, కాంగ్రెస్‌లది సమ బాధ్యత అని ఆదిత్యనాథ్ తప్పుపట్టారు. బిహార్‌కు ఎంతో సమున్నతమైన చరిత్ర ఉందని, ప్రపంచానికి నలందా యూనివర్శిటీని ఇచ్చిందని, ఇక్కడే గౌతమబుద్ధునికి జ్ఞానోదయమైందని చెప్పారు. అలాంటి బిహార్ గడ్డ అక్షరాస్యతలో వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ఆర్జేడీ, కాంగ్రెస్ బాధ్యులని తప్పుపట్టారు. సుపరిపాలన అనే బలమైన పునాదులపై అభివృద్ధి బిహార్ నిర్మాణానికి ఎన్డీయే ప్రభుత్వం తప్పనిసరని అన్నారు. మోతిహారి ప్రజల ఆదరణ చూస్తుంటే మరోసారి బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోందని పేర్కొన్నారు. కాగా, బిహార్ రెండవ దశ పోలింగ్ నవంబర్ 11న జరుగనుంది. నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
ప్రజాస్వామ్యాన్ని చంపే యత్నమే ‘సర్’...
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి