J and K Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
ABN , Publish Date - Nov 08 , 2025 | 10:01 AM
కుప్వారా జిల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు హతమయ్యారు. అక్రమంగా భారత్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నించిన వారిని భారత దళాలు మట్టుపెట్టాయి.
ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి. కుప్వారా జిల్లాలో శనివారం ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. జిల్లాలోని కీరన్ సెక్టర్‌లో ఉగ్రమూకలు చొరబాట్లకు ప్రయత్నిస్తున్నాయన్న నిఘా సమాచారంతో భద్రతా దళాలు శుక్రవారం రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో శనివారం భద్రతాదళాలు తమ కంటపడగానే ఉగ్రమూకలు కాల్పులకు తెగబడ్డాయి. ప్రతిగా భద్రతాదళాలు కూడా కాల్పులు జరిపి ఉగ్రవాదులను మట్టుపెట్టాయి. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించాయి. ప్రస్తుతం పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నాయి (Kupwara Encounter Terrorists Killed).
కాగా, నెల రోజుల క్రితం కూడా కుప్వారాలో ఉగ్రవాదులు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. భద్రతా దళాలు దీటుగా స్పందించి ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి. అనుమానాస్పద కదలికలు కనిపించడంతో భద్రతా దళాలు అప్రమత్తమై వారిని అంతమొందించాయని అధికారులు తెలిపారు. భారత్, పాక్ మధ్య జమ్మూకశ్మీర్‌లో 740 కిలోమీటర్ల మేర నియంత్రణ రేఖ ఉన్న విషయం తెలిసిందే. బారాముల్లా, కుప్వారా, బందిపొరా జిల్లాలతో పాటు జమ్మూ జిల్లాలోని కొంత భాగంలో నియంత్రణ రేఖ ఉంది.
ఇవి కూడా చదవండి:
వారణాసిలో మోదీ పర్యటన.. నాలుగు వందేభారత్ రైళ్లు ప్రారంభం
జనసమ్మర్థ ప్రాంతాల్లో వీధి కుక్కలు కనపడొద్దు.. సుప్రీం ఆదేశాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి