Share News

Bihar Elections: విభజన రాజకీయాలు, నకిలీ జాతీయవాదం.. ఎన్డీయేపై ప్రియాంక విమర్శలు

ABN , Publish Date - Nov 01 , 2025 | 06:01 PM

దేశాభివృద్ధిలో బిహార్ పాత్ర ఎంతో ఉందని, కానీ బిహార్‌లో మాత్రం ఆశించిన అభివృద్ధి జరగలేదని ప్రియాంక గాంధీ అన్నారు. బిహార్ పాలకుల బూటకపు వాగ్దానాలు నమ్మి మోసపోవద్దని సూచించారు.

Bihar Elections: విభజన రాజకీయాలు, నకిలీ జాతీయవాదం.. ఎన్డీయేపై ప్రియాంక విమర్శలు
Priyanka Gandhi

పాట్నా: బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi) విమర్శలు గుప్పించారు. నిరుద్యోగం, వలసలు వంటి వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు విభజన రాజకీయాలు, నకిలీ జాతీయవాదాన్ని ఎన్డీయే ప్రచారం చేస్తోందని అన్నారు. బెగుసరాయ్‌లో తన తొలి ప్రచార ర్యాలీలో శనివారంనాడు ఆమె మాట్లాడుతూ, బిహార్‌లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఎక్కడుందని ప్రశ్నించారు.


'బిహార్‌లో డబుల్ ఇంజన్ (ప్రభుత్వం) లేదు. ఒకే ఇంజన్ ఉంది. ప్రతీదీ ఢిల్లీ నుంచి నియంత్రిస్తున్నారు. మిమ్మల్ని కానీ, మీ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ను కానీ గౌరవించినట్టు మీరు ఎప్పుడైనా విన్నారా?' అని సభికులను ఉద్దేశించి ప్రియాంక ప్రశ్నించారు. మొదట విభజన రాజకీయాలు చేశారని, సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించలేకపోవడంతో ఇప్పుడు ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని తప్పుపట్టారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై బీజేపీని విమర్శిస్తూ, ఎస్ఐఆర్‌తో బిహార్‌లో 65 లక్షల ఓటర్లను తొలగించారని అన్నారు. ఎస్ఐఆర్ నిర్వహించడం ద్వారా ప్రజల హక్కులను ఎన్డీయే ప్రభుత్వం బలహీనపరిచిందని, ఓటర్ల పేర్లను తొలగించడమంటే ప్రజల హక్కులను కాలరాయడమేనని అన్నారు.


ఎన్డీయే అగ్రనాయకులు తమ ప్రచారపర్వంలో నెహ్రూ, ఇందిరాగాంధీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారే కానీ, నిరుద్యోగం, వలసలపై ఒక్కముక్క కూడా మాట్లాడటం లేదని అన్నారు. గతం గురించి కూడా మాట్లాడాలని, ఫ్యాక్టరీలు ఎవరు ఏర్పాటు చేశారు? ఐఐటీలు, ఐఐఎంలు తీసుకువచ్చిందెవరో చెప్పాలనన్నారు. దీనికి కాంగ్రెస్, నెహ్రూ అన్నదే సమాధానమని వివరించారు. దేశాభివృద్ధిలో బిహార్ పాత్ర ఎంతో ఉందని, కానీ బిహార్‌లో మాత్రం ఆశించిన అభివృద్ధి జరగలేదన్నారు. బిహార్ పాలకుల బూటకపు వాగ్దానాలు నమ్మి మోసపోవద్దని సూచించారు. మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలను తప్పుపడుతూ, తన కార్పొరేట్ మిత్రులకు భారీ పీఎస్‌యూలు అప్పగించారని, ప్రైవేటీకరణ పెద్దఎత్తున జరుగుతోందని ఆరోపించారు.


ఇవి కూడా చదవండి..

సత్యసాయి సంజీవనీ హాస్పిటల్‌‌ను సందర్శించిన ప్రధాని మోదీ.. చిన్నారులతో ముచ్చట్లు

మాతృభాషను బలహీన పరుస్తున్న హిందీ, ఇంగ్లీష్... సీఎం కీలక వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 01 , 2025 | 06:28 PM