Prashant Kishor: ఇతర పార్టీలతో పొత్తులు ఉండవు: ప్రశాంత్ కిశోర్
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:05 AM
బిహార్ ఎన్నికల తరువాత కూడా తమకు ఇతర పార్టీలతో పొత్తులు ఉండవని జన సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ అన్నారు. అయితే, ప్రస్తుత పార్టీలకు మెరుగైన ప్రత్యామ్నాయంగా ప్రజలు తమను చూస్తున్నారని కామెంట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: బిహార్‌లో తాము ఇప్పటివరకూ ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోలేదని వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ చెప్పారు. ఎన్నికల తరువాత కూడా ఎలాంటి పొత్తులూ ఉండవని తేల్చి చెప్పారు. ఓ జాతీయ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన సదస్సులో నేడు ప్రశాంత్ కిశోర్ ఈ కామెంట్స్ చేశారు (Prashant Kishor).
ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందనే విషయంలో కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రజలు తమను గుర్తిస్తున్నారని అన్నారు. అయితే, రాజకీయ పార్టీల తీరుతెన్నుల కారణంగా నిరాశలో ఉన్న ప్రజలు తమపై విశ్వాసంతో ముందడుగు వేయాల్సి ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో తాము 150 సీట్లకు పైగా గెలవొచ్చని లేకపోతే 10 సీట్ల లోపునకు పరిమితం కావొచ్చని అంచనా వేశారు (Jan Suraaj Party).
ఎన్నికల తరువాత కింగ్ మేకర్‌గా అవతరిస్తారా? అన్న ప్రశ్నకు ప్రశాంత్ కిశోర్ స్పందించారు. ‘ఇలాంటి రాజకీయాలు మేము చేయము. ప్రజలు మాకు స్పష్టమైన మెజారిటీ ఇవ్వకపోతే మేము ఎప్పటిలాగే ప్రజా సేవ చేస్తూ కొనసాగుతాము. కావాలంటే ఇదే విషయాన్ని లిఖిత పూర్వకంగా చెబుతా.. ఎన్నికల ముందు, ఎన్నికల తరువాత మాకు ఎవరితోనూ పొత్తులు ఉండవు. స్పష్టమైన మెజారిటీ లేని సమయంలో పార్టీ నుంచి నేతలు మారే అవకాశం ఉంది. దీన్ని నేను అడ్డుకోలేను. డబ్బుపై ఆశ, సీబీఐ అంటే భయంతో ఇలాంటి పరిణామాలు జరుగుతాయి’ అని అన్నారు (Bihar Elections).
‘ఉదాహరణకు ఈసారి ఎన్నికల్లో 30 మంది జన సురాజ్ అభ్యర్థులు గెలుస్తారనుకుందాం. వీళ్లు ప్రభుత్వ ఏర్పాటుకు కీలకంగా మారితే నా మాట వింటారా. నేతలు మా పార్టీని వీడతారా అని మిమ్మల్ని మీరు అడుగుతున్నారు. ఎన్డీయేకు మెజారిటీ తగ్గితే మా ఎమ్మెల్యేపై ఎలాంటి ఒత్తిళ్లూ తీసుకురాబోమని అమిత్ షాతో లిఖిత పూర్వకంగా రాయించుకుని రండి’ అంటూ ప్రశాంత్ కిశోర్ పరోక్షంగా బీజేపీని టార్గెట్ చేశారు. 2013లో అర్వింద్ కేజ్రీవాల్ విజయానికి తన పంథాను పోల్చకూడదని కూడా అన్నారు. తామిద్దరం భిన్నమైన వ్యక్తులమని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
మళ్లీ పాక్ ఏదైనా మూర్ఖపు చర్యకు దిగితే.. భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్
చంపుతామంటూ బీజేపీ ఎంపీకి ఫోనులో బెదిరింపులు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి