JNTU: విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం.. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల ఇష్టారాజ్యం
ABN , Publish Date - Jul 17 , 2025 | 08:29 AM
పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుగా తయారైంది ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థుల పరిస్థితి. జేఎన్‌టీయూ పరిధిలోని కొన్ని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గాలికి వదిలేస్తున్నాయి. జేఎన్‌టీయూ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.

ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల ఇష్టారాజ్యం
పరీక్షల నిర్వహణపై కొరవడిన అధికారుల పర్యవేక్షణ
సప్లిమెంటరీ పరీక్షలకు అనుమతించని కాలేజీలపై బాధితుల ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ: పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుగా తయారైంది ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్థుల పరిస్థితి. జేఎన్‌టీయూ(JNTU) పరిధిలోని కొన్ని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గాలికి వదిలేస్తున్నాయి. జేఎన్‌టీయూ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రిన్సిపాళ్లు, వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేసేందుకు వస్తున్న తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘గోకరాజు’ కాలేజీపై ఫిర్యాదులు
జేఎన్‌టీయూ అఫిలియేటెడ్ కాలేజీల్లో ఒకటైన గోకరాజు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం విద్యార్థుల సమస్యల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని వర్సిటీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బీటెక్ ఫైనలియర్‌లో బ్యాక్‌లాగ్ సబ్జెక్టులను పూర్తి చేసుకునేందుకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ రాసుకునే అవకాశం ఉన్నప్పటికీ వారిని అనుమతించడం లేదని బాధిత విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. జేఎన్‌టీయూ నిబంధనల మేరకు బీటెక్‌లో ఎలక్టివ్ సబ్జెక్టులుగా ఎన్‌పీటీఈఎల్ (నేషనల్ ప్రోగ్రామింగ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్ లెర్నింగ్) కోర్సులు నేర్చుకునే అవకాశం కల్పించిన కాలేజీ అధికారులు, సదరు కోర్సులను సకాలంలో పూర్తి చేయలేకపోతే ఆ విద్యార్థులకు సమాన స్థాయి సబ్జెక్టులను కేటాయించి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే వెసులుబాటు ఉంది. ఈ నిబంధనల మేరకు గతేడాది ఎన్‌పీటీఈఎల్ బ్యాక్‌లాగ్స్ ఉన్న విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన గోకరాజు యాజమాన్యం, ఈ ఏడాది అవకాశం కల్పించలేదు. బాధితుల తల్లిదండ్రులు కళాశాల ప్రిన్సిపాల్‌ను వేడుకునేందుకు వెళ్లగా ఆయనను కలిసేందుకు అనుమతించలేదు.
రెక్టార్ వద్దకు చేరిన పంచాయితీ
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ నిర్వహించాలని వేడుకునేందుకు కళాశాల ప్రిన్సిపాల్ అనుమతించకపోవడంతో సదరు విద్యార్థులు, తల్లిదండ్రులు జేఎన్‌టీయూ పరీక్షల విభాగం ఉన్నతాధికారిని కలిసేందుకు వెళ్లారు. ఆయన కూడా వారి మొర ఆలకించకపోవడంతో వర్సిటీ అకడమిక్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న రెక్టార్ విజయకుమార్ రెడ్డిని కలిసి బాధిత విద్యార్థులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాధితుల ఫిర్యాదు నేపథ్యంలో గోకరాజు ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్‌ను, పరీక్షల విభాగం అధికారులను యూనివర్సిటీకి పిలిపించిన రెక్టార్ విజయకుమార్ రెడ్డి..
విద్యార్థులు తమ సమస్యలను చెప్పుకునేందుకు వస్తే ప్రిన్సిపాల్ అనుమతించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇతర అఫిలియేటెడ్ కాలేజీల్లోనూ విద్యార్థులకు ఈ తరహా సమస్యలు ఎదురుకాకుండా సంబంధిత విభాగాల ద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటామని రెక్టార్ విజయకుమార్ రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఈ విషయమై గోకరాజు కాలేజీ ప్రిన్సిపాల్ ప్రవీణ్ వివరణ కోసం సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.
ఈ వార్తలు కూడా చదవండి.
తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
తాటి చెట్టే లేదు.. లక్షల లీటర్ల కల్లా..
Read Latest Telangana News and National News