AP News: ఆ మండలంలో.. వెయ్యి మంది ఉపాధ్యాయులే..
ABN , Publish Date - Oct 26 , 2025 | 11:59 AM
ఒక్క కుటుంబంలోనో, గ్రామంలోనో... ఐఏఎస్, ఐపీస్‌లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు... ఐదారుగురు ఉన్నారని అప్పుడప్పుడు వార్తల్లో చదివి ఆశ్చర్య పోతాం. ‘వారెంత అదృష్టవంతులో కదా’ అనుకుంటాం. అయితే.. చిత్తూరు జిల్లాలోని ‘కార్వేటినగరం’ మండలానికి వెళితే ఏకంగా వెయ్యి మంది ఉపాధ్యాయులను చూడొచ్చు.
- గురువుల ‘నగరం’
ఒక్క కుటుంబంలోనో, గ్రామంలోనో... ఐఏఎస్, ఐపీస్‌లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు... ఐదారుగురు ఉన్నారని అప్పుడప్పుడు వార్తల్లో చదివి ఆశ్చర్య పోతాం. ‘వారెంత అదృష్టవంతులో కదా’ అనుకుంటాం. అయితే.. చిత్తూరు జిల్లాలోని ‘కార్వేటినగరం’ మండలానికి వెళితే ఏకంగా వెయ్యి మంది ఉపాధ్యాయులను చూడొచ్చు. ఇంటికొకరు అని కూడా అనొచ్చేమో... ఒకే ఒక్క మండలంలో ఇంతమంది ఉండటం ఒక రికార్డే...
చిత్తూరు జిల్లా ‘కార్వేటినగరం’ మండలం నుంచి ఏకంగా వెయ్యి మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు తయారయ్యారు. వారిలో సొంత మండలంలో 200 మంది పని చేస్తుండగా, మిగిలిన వారంతా చిత్తూరు ఉమ్మడి జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్నారు. కార్వేటినగరం మండల కేంద్రంలో అయితే ప్రతి రెండు ఇళ్లకు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉన్నారు. తాజా డీఎస్సీలోనూ ఈ మండలవాసులు 30 మందికిపైగా టీచర్ ఉద్యోగాన్ని తెచ్చుకుని రికార్డు సృష్టించారు.

ఈ మండలంలో 1950ల్లో ‘బేసిక్ టీచర్స్ ట్రైనింగ్’ అనే కేంద్రం ఉండేది. పదో తరగతి చదివినవారికి ఇక్కడ టీచర్ శిక్షణ ఇచ్చేవారు. 1975లో దాన్ని ‘ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ’ (జీటీటీఐ)గా మార్చారు. ఇంటర్మీడియెట్ చదివినవారికి ఏడాది పాటు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఆ తర్వాత 1996లో ‘డైట్’ (డిస్ర్టిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్) కాలేజీగా మార్చారు. సుమారు 14 ఎకరాల్లో ఈ డైట్ కాలేజీ ఉంది. 1999 నుంచి ఇక్కడ రెండేళ్ల శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. తెలుగు, ఇంగ్లీషు, తమిళం మీడియాల్లో 50 మందికి చొప్పున ఏడాదికి 150 మందికి అవకాశం కల్పించేవారు. ప్రస్తుతం తమిళ మీడియం లేకపోవడంతో తెలుగు, ఇంగ్లీషు మీడియాలలో ఏడాదికి వంద మందికి అవకాశం కల్పిస్తున్నారు.
ప్రతీ బ్యాచ్‌లోనూ 90 శాతం రిజల్ట్...
ఇక్కడ చదువుకున్న ప్రతీ బ్యాచ్‌లోనూ 90 శాతం మంది ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికవుతున్నారు. ఉదాహరణకు 1996-97 బ్యాచ్‌లో 150 మంది చదువుకుంటే వివిధ నోటిఫికేషన్లలో 140 మంది ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు, మిగిలిన 10 మంది వేరే శాఖల్లో ఉద్యోగాలు సాధించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో ఈ మండలవాసులు 30 మంది ఎంపికయ్యారంటే సాధారణ విషయం కాదు.

ఒకే ఇంట్లో నలుగురైదుగురు...
కార్వేటినగరం మండలవాసులతో పాటు రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల విద్యార్థులూ ఇక్కడ చదువుకున్నారు. ఈ మండలంలో నలుగురైదుగురు ఉపాధ్యాయులున్న ఇళ్లు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ మండలంలోని 70 ప్రాథమిక పాఠశాలల్లో 170 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా, వారిలో 150 మంది ఇదే మండలవాసులు. అలాగే 10 ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న వంద మందిలో 50 మంది ఇక్కడివారే. డైట్ కాలేజీలో చదువుకుని అక్కడే చదువు చెప్తున్నవారూ ఉన్నారు.
నోటిఫికేషన్లు లేక తగ్గిన ఆదరణ
చంద్రబాబు సీఎంగా ఉన్న 1995-2004 మధ్యకాలంలో దాదాపు ప్రతిఏటా టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసేవారు. చంద్రబాబు సీఎం అయ్యాక 2014, 2018లో రెండుసార్లు నోటిఫికేషన్ ఇచ్చారు. తాజాగా 2025లో మళ్లీ చంద్రబాబే మెగా డీఎస్సీ నిర్వహించారు. 2018 నుంచి 2025 మధ్యలో ఒక్క నోటిఫికేషన్ కూడా లేకపోవడంతో ఇటువైపు ఆలోచించేవాళ్ల సంఖ్య తగ్గిపోయింది. ప్రస్తుతం ఇక్కడ 74 మంది మొదటి, 42 మంది రెండో సంవత్సర విద్యార్థులున్నారు.
- కరీముల్లా షేక్, చిత్తూరు
ఫొటోలు: శివకుమార్
ఇంట్లో నలుగురికీ ఉద్యోగాలు..
మా ఇంట్లో మేం ముగ్గురం ఆడపిల్లలం. మాకొక అన్నయ్య ఉన్నారు. అందరం కూడా ఇక్కడి డైట్‌లో చదువుకున్నాం. నలుగురికీ పలు డీఎస్సీలో టీచర్ ఉద్యోగాలు వచ్చాయి. నాకు 2000 నోటిఫికేషన్‌లో ఉద్యోగం వచ్చింది. అన్నింట్లో గొప్ప వృత్తి టీచర్ అయితే, మహిళలకు ఇది మంది సెక్యూర్డ్ జాబ్.
- రీటమ్మ, కార్వేటినగరం జడ్పీ హైస్కూల్ టీచర్
చదివిన చోటే బోధన..
నేను టీటీసీ చదువుకున్న ‘డైట్’ కాలేజీలోనే ప్రస్తుతం ఈవీఎస్ అంశాన్ని బోధిస్తుండడం వరంగా భావిస్తున్నాను. చదువుకున్న తర్వాత కాస్త ఆలస్యంగా, అంటే 1998లో నాకు ఉద్యోగం వచ్చింది. మేం ఐదుగురం అమ్మాయిలం. అందరం ఇక్కడే చదివి, ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాం.
- లావణ్య, డైట్ కాలేజీ అధ్యాపకురాలు