Share News

Tirupati: గోవిందుని సేవలో గజరాజులు

ABN , Publish Date - Aug 03 , 2025 | 10:18 AM

భక్తుల విశ్వాసానికి మాత్రమే ఆలయం కాకుండా... భగవత్‌ సేవలో ప్రతి ప్రాణికీ చోటు కల్పించే దైవీయ స్థలం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం. టీటీడీ ఆధ్వర్యంలో ఏడు గజరాజులు గోవిందుని సేవలో తరిస్తున్నాయి.

Tirupati: గోవిందుని సేవలో గజరాజులు

భక్తుల విశ్వాసానికి మాత్రమే ఆలయం కాకుండా... భగవత్‌ సేవలో ప్రతి ప్రాణికీ చోటు కల్పించే దైవీయ స్థలం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం. టీటీడీ ఆధ్వర్యంలో ఏడు గజరాజులు గోవిందుని సేవలో తరిస్తున్నాయి. పిల్లలుగా ఉన్నప్పుడే ఇతర రాష్ర్టాల నుంచి తిరుమలేశుని సన్నిధికి చేరిన ఈ ఏనుగులు... కొండల మడిలోనే పెరుగుతూ నిత్యం జరిగే శ్రీనివాసుని, అమ్మవారి ఉత్సవాలు, రథోత్సవాలు, ముఖ్యంగా వాహనసేవల్లో భాగస్వాములవుతూ భక్తిని చాటుతున్నాయి.

అడవి జంతువుల్లో మూర్ఖంగా ఉండే వాటిల్లో ఏనుగు కూడా ఒకటిగా చాలామంది భావిస్తారు. కానీ గోవిందుని సన్నిధిలో ఉన్న ఈ ఏనుగులు మాత్రం ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామిసేవలో పాల్గొంటూ... వినయశీలతకు సంబంధించి గొప్ప పాఠాన్ని నేర్పుతున్నాయి. ఎంతమంది గుంపుకూడిన, ఎంతస్థాయిలో శబ్ధాలు వచ్చినా గోవిందుడిని మాత్రమే స్మరిస్తున్నట్టుగా మెల్లటి నడక, తలవంచి నడిచే విధానం చూస్తే ఇవి కూడా భక్తులే అనే భావన రాక తప్పదు.


book5.jpg

ప్రతీ ఏనుగుకీ ఓ పేరు

ఈ క్రమంలో టీటీడీ వీటిని జంతువులుగా కాకుండా సేవకుల్లా భావించి ప్రతి ఏనుగుకీ ఓ పేరు పెట్టి పిలుస్తోంది. టీటీడీ పరిధిలో ప్రస్తుతం ఏడు ఏనుగులున్నాయి. వాటికి మహాలక్ష్మీ, పద్మజ, వైష్ణవి, లక్ష్మీ, పద్మావతి, అవనిజ, శ్రీనిధి అని నామకరణం చేశారు.

వీటిలో మహాలక్ష్మీ ప్రస్తుత వయస్సు 34 ఏళ్లు. దీన్ని కర్ణాటక రాష్ట్రం నుంచి నాలుగేళ్ల వయస్సులో తిరుమలకు తీసుకువచ్చారు. అప్పటి నుంచి స్వామిసేవలోనే తరిస్తోంది. పద్మజని కూడా కర్ణాటకలోని షిమోగా అనే ప్రాంతం నుంచి రెండున్నరేళ్ల వయసులో తీసుకువచ్చారు. ప్రస్తుతం దీని వయస్సు 32 ఏళ్లు. ఈ రెండూ ప్రస్తుతం తిరుమలలో శ్రీవారిసేవలో ఉన్నాయి.


book5.7.jpg

ఇక, 22 ఏళ్ల వయసున్న వైష్ణవిని అస్సోం నుంచి మూడున్నర ఏళ్ల వయస్సులో తీసుకువచ్చారు. అన్నిటికంటే వయస్సు ఎక్కువ కలిగిన 40 ఏళ్ల లక్ష్మీని కూడా కర్ణాటక నుంచే తీసుకువచ్చారు. ఇది కూడా ఏడేళ్ల వయసులో స్వామి కొలువుకు వచ్చింది. మూడున్నరేళ్ల వయసులో పద్మావతినీ కర్ణాటక నుంచి తెచ్చారు. ప్రస్తుతం దీని వయస్సు 36 ఏళ్లు. అల్లరి ఏనుగుగా పేర్కొనే ఇరవైమూడేళ్ల ఐదు నెలలు కలిగిన అవనిజ అనే ఏనుగును ఆరేళ్ల వయసులో అస్సోం నుంచి తీసుకువచ్చారు. ఈ నాలుగు ఏనుగులు ప్రస్తుతం తిరుపతిలోని గోశాలలో ఉన్నాయి. అన్నిటికంటే చిన్న వయసు కలిగిన శ్రీనిధి అనే 17 ఏళ్ల ఏనుగు కూడా అస్సోం నుంచే వచ్చింది. దీన్ని కూడా నాలుగేళ్ల ఐదు నెలల వయస్సులో తిరుపతికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఇది తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి సేవలో తరిస్తోంది. ఉత్సవాలకు అనుగుణంగా వీటిని తిరుమల నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి తిరుమలకు లారీల ద్వారా తరలిస్తుంటారు.


book5.2.jpg

స్వామి సేవలో తొలి అడుగు

సాధారణంగా రాజులను పట్టాభిషేకాది సమయాల్లో గజాలపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహణం చేసే ప్రక్రియ పూర్వకాలం నుంచి నే టికీ కొనసాగుతోంది. ఇందులో భాగంగా నాటి రాజుల కాలం నుంచి ఏనుగులు స్వామిసేవలో తరిస్తూ వస్తున్నాయి. నిత్య కల్యాణం పచ్చతోరణంగా ప్రసిద్ధిగాంచిన వేంకటాచలంలోని ఏడు కొండల స్వామికి ఏడాది పొడవునా 450కి పైగా ఉత్సవాలు జరుగుతాయి. నిత్యోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలతో తిరుమలలో నిత్యం పండుగ వాతావరణం ఉంటుంది.


ఈ క్రమంలో ప్రతిరోజు సాయంత్రం సహస్రదీపాలంకరణ సేవ అనంతరం జరిగే నిత్య ఊరేగింపుతో పాటు అన్ని ప్రత్యేక ఉత్సవాలు, స్వామివారి ఊరేగింపులు, వాహనసేవల్లో ఈ గజరాజులదే తొలి అడుగు. స్వామివారు వివిధ వాహనాలపై కొలువుదీరి మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తుంటే ... సర్వాంగసుందరంగా నుదుట నామాన్ని ధరించి ఈ ఏనుగులు ఠీవిగా ముందుకు కదులుతూ స్వామివారు వస్తున్నారనే సంకేతాన్నిస్తాయి. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి వాహనసేవ ముందు జీయంగార్ల బృందం, కళాబృందాలు, అశ్వాలు, వృషభాలకంటే ముందుగానే నిలబడి సేవను ముందుకు నడింపించేది కూడా ఈ ఏనుగులే. స్వామి ఆలయం నుంచి బయటకు వస్తే ఎవరున్నా, లేకున్నా గజరాజులు మాత్రం సేవకు సిద్ధమవుతాయి. ఇక, తిరుపతిలోని టీటీడీ ఆలయాల్లో కూడా ఈ ఏనుగులు విశిష్టసేవలు అందిస్తున్నాయి. గోవిందరాజస్వామి ఆలయం, రాములవారి ఆలయంతో పాటు కపిలేశ్వర స్వామి ఆలయం, పద్మావతి అమ్మవారి ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, వాహనసేవల్లో పాలుపంచుకుంటున్నాయి.


book5.4.jpg

గజవాహనంపై దర్శనమిచ్చే దేవదేవుడు

ఐశ్వర్యానికి చిహ్నం గజం. శ్రీమహావిష్ణువు దేవేరి శ్రీలక్ష్మీదేవి అమ్మవారి ఇష్టవాహనం కూడా ఏనుగే. అందుకే దైవారాధనలో ఏనుగు కూడా కీలకంగా నిలుస్తోంది. ఓవైపు గజరాజులు స్వామికి ప్రత్యక్షంగా సేవచేస్తుంటే మరోవైపు స్వామివారు ఏడాదిలో వివిధ సందర్భాల్లో గజవాహనాన్ని అధిరోహించి దర్శనమిస్తుంటారు. ప్రతి ఏడాది ఎంతో వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాల్లోనూ ఆరో రోజు స్వామివారు గజవాహనంపై కొలువుదీరి దర్శనమిస్తారు. తిరుమల పార్వేట మండపం వద్ద నిర్వహించే కార్తీక వనభోజనాలకు, నారాయణగిరి పార్కులో నిర్వహించే పద్మావతి పరిణయోత్సవాలకు స్వామి వెళ్లేది గజవాహనంపైనే.


ఇక, తిరుచానూరు అమ్మవారికి బ్రహ్మోత్సవాలకు తిరుమల నుంచి సమర్పించే సారెను కూడా ఏనుగుపైనే తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ‘శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్టు భక్తులు కూడా నిరంతరం శ్రీనివాసుని హృదయంలో పెట్టుకుని శరణాగతి చెందాలని ఈ వాహనసేవ ద్వారా చెప్తారు. అలాగే గజేంద్రమోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే, శరుణు కోరే వారిని కాపాడతానని చాటి చెప్పడానికి శ్రీవారు గజవాహనంపై ఊరేగుతారని పురాణాల్లో ఉంది. గజ వాహనదారుడైన స్వామిని దర్శిస్తే ఏనుగంత సమస్య కూడా చీమలా తొలగిపోతుందని భక్తుల విశ్వాసం.’ అందుకే గజవాహనానికి ప్రత్యేక స్థానముంది.


book5.5.jpg

కుటుంబ సభ్యుల్లా చూస్తున్న టీటీడీ

అధికారులు, ఉద్యోగులతో పాటు నిత్యం స్వామి, అమ్మవార్ల సేవల్లో పాల్గొనే ఈ ఏనుగులను జంతువులుగా కాకుండా కుటుంబ సభ్యుల్లా టీటీడీ కంటికి రెప్పలా చూసుకుంటోంది. హార్మోన్లు విడుదల సమయంలో మగ ఏనుగులను అదుపు చేయడం కష్టతరం. అందుకే టీటీడీ కేవలం ఆడ ఏనుగులనే స్వామిసేవలకు ఉంచుతోంది. ప్రస్తుతం టీటీడీ పరిధిలోని తిరుమల, తిరుపతి, తిరుచానూరులోని గజశాలల్లో ఉన్న ఈ ఏడు ఏనుగుల పరిరక్షణకు మావటులు ప్రత్యేకంగా ఉంటారు. ఒక్కో ఏనుగుకి ఇద్దరు చొప్పున టీటీడీ నియమించింది. వీరు ప్రతిరోజు ఏనుగులకు స్నానం చేయించి నూనెతో శరీర మర్దన చేస్తారు. నడక వ్యాయామం చేయించడంతో పాటు ప్రతి అరగంటకోసారి ఆహారం అందిస్తారు.


నేపియర్‌ గ్రాసంతో పాటు చెరుకుగడలు, రావి, మర్రి ఆకులు, అరటి చెట్లతో పాటుగా శారీరకంగా దృఢంగా ఉండేందుకు రాగి సంకటి పెడతారు. తిరుమల, తిరుపతితో కలిపి దాదాపు మూడున్నర టన్నుల గ్రాసంతో పాటు దాదాపు 15 కేజీల రాగి సంకటిని ఆహారంగా అందిస్తున్నారు. ఇవి కాకుండా భక్తులు అందించే వివిధ రకాల పండ్లు కూడా ఆహారంగా అందుతుంటాయి. అలాగే రెండురోజులకోసారి నుదుట తిరునామం దిద్దుతారు. వీటి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు నలుగురు పశువైద్యులు అందుబాటులో ఉంటారు. నిత్యం వాటి ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ ఏదైనా సమస్య ఉంటే తక్షణమే వైద్యం అందిస్తారు. ఏడాదిలో పలుమార్లు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక పశువైద్యులు తిరుమల, తిరుపతి గజశాలలను సందర్శించి వాటి ఆరోగ్య పరిస్థితిని టీటీడీకి తెలియజేస్తుంటారు. వాటి పరిరక్షణకు సంబంధించిన సూచనలూ చేస్తారు.


book5.6.jpg

ఉత్సవాల్లో బెదరకుండా...

ఉత్సవాల సమయంలో భారీ శబ్ధాలు, జనసమూహంలో బెదరకుండా గజరాజులకు తగిన శిక్షణ ఇస్తారు. కేరళ, హైదరాబాద్‌ నుంచి వచ్చే నిపుణుల ద్వారా ప్రత్యేకంగా శిక్షణ కల్పిస్తారు. మావటిలు తాళ్లు, అంకుశం (ముల్లు కర్ర), గొలుసులతో నిరంతరం అప్రమత్తంగా ఉంటారు. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వీటిని నియంత్రించేలా మావటీలు కూడా ప్రత్యేక శిక్షణ పొందుతారు.


ప్రత్యేకంగా ముస్తాబై...

వాహనసేవల్లో ఈ ఏనుగులు ప్రత్యేక అలంకరణలతో ముస్తాబై భక్తులకు కనువిందు చేస్తుంటాయి. కళాకారులతో సమానంగా అలంకరించుకుని స్వామిసేవలో భాగస్వాములవుతాయి. ముఖపట్టాలతో పాటు రంగురంగుల బొంతలను శరీరంపై కప్పి వీటిని శోభాయమానంగా అలంకరిస్తారు. శరీరం మెరిసేలా వేపనూనెను పూస్తారు. నామం కూడా చెదిరిపోకుండా చక్కగా దిద్దుతారు. మరోవైపు మావటీలు బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక ఉత్సవాల్లో గొడుగులు, విసనకర్రలతో గజాల పక్కనే సేవ చేస్తారు. ఇలా ఈ ఏనుగులు స్వామి సేవలో కేవలం నడవడమే కాదు, వినయం, విధేయత, ధైర్యం, సేవాభావం... ఇలా మనిషి ఎదగడానికి అవసరమైన విలువల్ని నేర్పుతున్నాయి.

- జగదీష్‌ జంగం, తిరుమల

ఫొటోలు: సాయికుమార్‌


గజ సంరక్షణపై ప్రత్యేకదృష్టి

టీటీడీ గోశాలల్లోని గోవులతో పాటు... గజాల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాం. టీటీడీలో ఉన్న ఈ ఏడు ఏనుగులు నిరంతరం స్వామిసేవలో తరిస్తుంటాయి. వీటి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండటంతో పాటు అవసరమైనా ఆహారాన్ని అందిస్తున్నాం. ఈ గజరాజులు మాకు దైవంతో సమానం.

- జె శ్యామలరావు, ఈవో, టీటీడీ


కంటికి రెప్పలా చూసుకుంటున్నాం

గోవిందుని సేవలో ఉండే ఏనుగులు ప్రస్తుతం మంచి ఆరోగ్యంతో ఉన్నాయి. అయినప్పటికీ ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వీటిని కంటికిరెప్పలా చూసుకుంటున్నాం. నిత్యం వాటి ఆరోగ్యాన్ని చూసుకోవడంతో పాటూ కావాల్సిన పోషకాహారాన్ని అందిస్తున్నాం. ఆరు నెలలకోసారి నిపుణులను పిలిపించి వాటి ఆరోగ్యాన్ని పరీక్షిస్తాం.

- డాక్టర్‌ పి. చైతన్య, వెటర్నరీ వైద్యులు


మాలో ఒకరిగా...

ఈ ఏనుగులు ఎన్నో ఏళ్లుగా స్వామికి సేవ చేస్తున్నాయి. అందుకే మేము వాటిని జంతువుల్లా కాకుండా మాలో ఒకరిగా భావించి సేవ చేస్తున్నాం. ఉదయం లేచినప్పటి నుంచి వాటికి కావాల్సినవన్నీ సమకూర్చుతాం. స్వామి సేవకు తీసుకువెళ్లి తిరిగి తీసుకువస్తాం. బందీలుగా ఉన్నామనే భావన వాటిలో లేకుండా నిరంతరం చెట్ల మధ్యలో వాకింగ్‌, నీటి తొట్టిల వద్ద స్నానాలు వంటివి చేయిస్తాం. ఇవి మనుషుల్లా చెప్పిన మాట వింటాయి. ఇప్పటివరకు వీటి ద్వారా ఎవరికి ఏ హానీ కలగలేదు. అయినా మేము నిరంతరం జాగ్రత్తగా ఉంటాం.

- సుబ్రహ్మణ్యం, మావటి

Updated Date - Aug 03 , 2025 | 10:18 AM