Nalgonda: నాలుగు రోజుల్లో వివాహం.. అంతలోనే విషాదం
ABN , Publish Date - Jul 29 , 2025 | 01:33 PM
ఆ ఇంట్లో నాలుగు రోజుల్లో పెళ్లి భాజా మోగాల్సి ఉంది. బంధువులందరికీ శుభలేఖలు చేరాయి. ఇరు కుటుంబాల సభ్యులు పెళ్లి వేడుకల్లో నిమగ్నమయ్యారు. పెళ్లి భాజాలతో పాటు ఫంక్షన్‌హాల్ మాట్లాడారు. ఆహ్వానాలన్నీ పూర్తయ్యాయి. ఇంతలోనే విషాదం నెలకొంది.

- యువకుడి బలవన్మరణం
- పెళ్లి భాజా మోగాల్సిన ఇంట్లో.. చావు డప్పు
- హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న నల్లగొండ జిల్లా వాసి
చింతపల్లి(నల్గొండ): ఆ ఇంట్లో నాలుగు రోజుల్లో పెళ్లి భాజా మోగాల్సి ఉంది. బంధువులందరికీ శుభలేఖలు చేరాయి. ఇరు కుటుంబాల సభ్యులు పెళ్లి వేడుకల్లో నిమగ్నమయ్యారు. పెళ్లి భాజాలతో పాటు ఫంక్షన్‌హాల్ మాట్లాడారు. ఆహ్వానాలన్నీ పూర్తయ్యాయి. ఇంతలోనే విషాదం నెలకొంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో స్వగ్రామం నల్లగొండ(Nalgonda) జిల్లా చింతపల్లి మండలంలోని పీకే. మల్లేపల్లి గ్రామంలో విషాదం నెలకొంది.
కుటుంబసభ్యుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. పీ.కే.మల్లిపల్లి గ్రామానికి చెందిన ముచ్చర్ల నరసింహ, జంగమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు కాగా హైదరాబాద్(Hyderabad)లో నివసిస్తున్నారు. మొదటి కుమారుడికి వివాహంకాగా, రెండో కుమారుడు ముచ్చర్ల అరుణ్(32) కొంత కాలంగా రంగారెడ్డి జిల్లా బీఎన్.రెడ్డినగర్(హైదరాబాద్)లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పొల్కంపల్లిలో స్థిరాస్తి వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
అరుణ్‌కు రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నందివనపర్తి గ్రామానికి చెందిన యువతితో ఈ నెల 30వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. హైదరాబాద్‌లో తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో ఈ నెల 26వ తేదీ రాత్రి ఎవరూ లేని సమయంలో అరుణ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ఆదివారం హైదరాబాద్‌లోనే కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. కొద్దిరోజుల్లో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన అరుణ్ విగతజీవిగా మారాడని తెలుసుకున్న గ్రామస్థులు సైతం కన్నీరుమున్నీరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు
ప్రధాని మోదీని బీసీ కాదనడం సిగ్గుచేటు
Read Latest Telangana News and National News