Chit Fund Scam: నమ్మించి రూ.40 కోట్లు మోసం చేసిన జంట.. రాత్రికి రాత్రే జంప్..
ABN , Publish Date - Jul 10 , 2025 | 09:27 PM
ఓ జంట ఏకంగా రూ.40 కోట్ల మేర స్కాం చేసింది. వీరిద్దరూ ఓ చోట చిట్ ఫండ్ కంపెనీ (Chit Fund Scam) పెట్టి స్థానికులకు నమ్మించి, పెద్ద ఎత్తున పెట్టుబడులను సేకరించారు. ఆ తర్వాత రాత్రికి రాత్రే మొత్తం సొత్తుతో పారిపోయారు.

ఇటీవల మరో చిట్ ఫండ్ మోసం వెలుగులోకి వచ్చింది. 15 నుంచి 20 శాతం లాభాలు వస్తాయని హామీ ఇచ్చి అనేక మందిని ఓ జంట లూటీ చేసింది. ఆ క్రమంలో కేరళకు చెందిన ఈ జంట, దాదాపు 400 మంది పెట్టుబడిదారులను మోసం చేసి, దాదాపు రూ. 40 కోట్లతో పరారైనట్లు వెలుగులోకి వచ్చింది. ఈ జంట టోమీ ఎ.వర్గీస్ (57), షినీ టోమీ (52)గా తేలింది. ఆలప్పుజా నుంచి బెంగళూరు వచ్చి A&A చిట్స్ అండ్ ఫైనాన్స్ అనే సంస్థను (Chit Fund Scam) నిర్వహించారు.
స్కాం వివరాలు
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆరా తీయగా, ఈ జంట జులై 3న టూరిస్ట్ వీసాలతో ముంబై మీదుగా కెన్యాకు పారిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారి ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు వివరాలను దర్యాప్తు చేస్తున్నారు. టోమీ, షినీ గత 25 సంవత్సరాలుగా తూర్పు బెంగళూరులో A&A చిట్స్ అండ్ ఫైనాన్స్ సంస్థను నిర్వహించారు. ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేసిన వారికి 15-20% లాభాలు వస్తాయని హామీ ఇచ్చి, పెట్టుబడిదారులను ఆకర్షించారు.
ఆగిపోయిన లాభాల చెల్లింపు
ప్రతి నెలా ఒక సభ్యుడు వేలం లేదా లక్కీ డ్రా ద్వారా ఒక మొత్తాన్ని పొందుతాడు. మొదట్లో, ఈ జంట సకాలంలో లాభాలను చెల్లించడం ద్వారా పెట్టుబడిదారుల నమ్మకాన్ని పొందారు. ఆ తర్వాత అనేక మంది పెద్ద మొత్తాలను పెట్టుబడి పెట్టారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయోత్సవాల సమయంలో ఈ జంట లాభాల చెల్లింపును ఆపేసి, ఆచూకీ లేకుండా అదృశ్యమైంది.
బాధితుల ఆవేదన
ఈ స్కాం నేపథ్యంలో బాధితులైన పెట్టుబడిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కుటుంబాన్ని దాదాపు 25 సంవత్సరాలుగా తెలిసిన ఓ వ్యక్తి తాను రూ. 30 లక్షలు పెట్టుబడి పెట్టానని చెప్పాడు. ఈ మోసం నేపథ్యంలో వారికి పట్టుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పోలీసులు ఈ జంట బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. వారు కెన్యాకు పారిపోయినప్పటికీ, ఈ కేసులో న్యాయం జరిగే వరకు దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ఈ కుంభకోణం బెంగళూరులోని పెట్టుబడిదారులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. చిట్ ఫండ్ పథకాలపై నమ్మకం కోల్పోయేలా చేసింది.
ఇవి కూడా చదవండి
ఇన్కం ట్యాక్స్ 2025 కొత్త రూల్స్.. ఈ అప్‌డేట్ ప్రక్రియ తప్పనిసరి
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి