Hyderabad: పెళ్లి చేసుకుని.. వ్యాపారికి ‘కోటి’ పంగనామాలు
ABN , Publish Date - Apr 29 , 2025 | 07:05 AM
ఓ మహిళ చేసిన పని మహిళా లోకానికే మచ్చను తెచ్చిపెట్టేలా ఉంది. నగరానికి చెందిన ఓ వ్యాపారిని ‘పెళ్లి’తో బురిడీ కొట్టించి రూ. 2 కోట్లను తన ఖాతాలోకి తరలించుకుంది. అనంతరం తన బాయ్‌ఫ్రెండ్ సాయంతో భర్తను ఇంటినుంచి వెళ్లగొట్టింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

- రూ.2 కోట్లు తన ఖాతాలోకి బదిలీ
- షాపింగ్ పేరిట రూ.కోటి ఖర్చు
- టూర్ పేరిట మరో రూ.కోటి
- ఆ తర్వాత ఇంట్లోంచి గెంటేసిన మహిళ
- బాయ్‌ఫ్రెండ్‌తో అతడి ఇంట్లోనే కాపురం
- కోర్టు ఆదేశాలతో కిలేడీపై కేసు నమోదు
హైదరాబాద్: దుబాయ్‌లో తనకు కోట్ల విలువ చేసే వ్యాపారాలున్నాయని, సినీ ప్రముఖులు తన బంధువులని మాయమాటలు చెప్పి ఓ మహిళ నగరానికి చెందిన వ్యాపారిని పెళ్లిచేసుకుంది. సుమారు రూ.2కోట్ల వరకు డబ్బును తన ఖాతాలోకి తరలించుకుంది. వివిధ పేర్లతో మరో రెండు కోట్లు కాజేసింది. ఆ తర్వాత బాయ్‌ఫ్రెండ్ సాయంతో భర్తను ఇంటినుంచి వెళ్లగొట్టింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని నాంపల్లి 17వ మెట్రోపాలిటన్ కోర్టు మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలతో సోమవారం ఫిలింనగర్ పోలీసులు(Filmnagar Police) కేసు నమోదు చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Gold Rates Today: వావ్..భారీగా తగ్గిన బంగారం, ఇక వెండి విషయానికొస్తే..
పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. టోలీచౌకి సబ్జా కాలనీకి చెందిన వ్యాపారి నాలుగు కంపెనీలను నిర్వహిస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఓ డేటింగ్ యాప్ ద్వారా అతడికి జమీల రవికుమార్ అనే యువతి పరిచయమైంది. దుబాయ్‌లో కంపెనీ నిర్వహిస్తున్నట్టు చెప్పింది. కొద్దిరోజులకు జమీల నగరానికి వచ్చి హసన్‌అలీని కలిసింది. దుబాయ్‌లో తన బాయ్‌ఫ్రెండ్ వేధింపులు తట్టుకోలేక వచ్చినట్టు వాపోయింది. తనకు ఇక్కడ సినీ ప్రముఖులు బంధువులు ఉన్నారని తెలిపింది. తనను వివాహం చేసుకోవాలని జమీల కోరగా అందుకు హసన్ అలీ అంగీకరించాడు. పెళ్లి తర్వాత మైహోం విహంగలో ఫ్లాట్ కొనుగోలు చేశారు.
అనంతరం జమీల తల్లి ఉండేందుకు మరో ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. కొద్ది రోజులకు అతని క్రెడిట్ కార్డుల ద్వారా తల్లీ కుమార్తెలిద్దరూ రూ.కోటి షాపింగ్ చేశారు. ఇదేమని హసన్‌అలీ ప్రశ్నించగా తన డబ్బు దుబాయ్ బ్యాంకులో ఇరుక్కుపోయిదని, రాగానే ఇచ్చేస్తామని సమాధానమిస్తూ వచ్చారు. అక్కడితో ఆగక జమీల టూర్ పేరిట కోటి రూపాయలు, అతని ఖాతాలోని మరో రెండు కోట్ల నగదును తన ఖాతాకు మళ్లించుకుంది. ఈ విషయంలో జమీలను పలుమార్లు ప్రశ్నించినా రెండు, మూడు కోట్లు తనకు పెద్ద లెక్క కాదని, డబ్బు రాగానే ఇచ్చేస్తానంటూ దాటవేసేది.
అనుమానం వచ్చిన హసన్‌అలీ వారి గురించి ఆరా తీయగా జమీల తల్లి రత్నరవికుమార్ దుబాయ్‌లో 11 నెలల జైలుశిక్ష అనుభవించి వచ్చినట్టు తేలింది. అంతే కాకుండా ఆమె మళ్లీ దుబాయ్‌కు వెళ్లకుండా నిషేధం ఉన్నట్లు తెలుసుకున్నాడు. దీంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో జమీల ఇంటికి తాళం వేసి హసన్‌అలీని లోపలికి రాకుండా చేసింది.
అంతే కాకుండా తన బాయ్‌ఫ్రెండ్ ఇమ్రాన్‌ఖాన్‌ను పిలిపించుకొని కాపురం మొదలు పెట్టింది. ఆమెకు పిల్లలు కూడా ఉన్నట్టు తెలుసుకున్నాడు. ఈ వ్యవహారంపై గతేడాది ఆగస్టులో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో నాంపల్లి 17వ మెట్రపాలిటన్ కోర్టును వ్యాపారి ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు జమీల రవికుమార్, రత్న రవికుమార్‌పై ఫిలింనగర్ పోలీసులు సోమవారం కేసు నమోదుచేశారు. విచారణ జరుపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
హైదరాబాద్-విజయవాడ హైవే 6 లేన్లుగా విస్తరణకు 5 వేల కోట్లు
డిజిటల్ లైంగిక నేరాలపై చట్టమేదీ?
చిన్నారి ప్రాణం తీసిన పల్లీ గింజ
Read Latest Telangana News and National News