AP News: కుమార్తె పెళ్లి ఆగిపోయిందని తండ్రి ఆత్మహత్య..
ABN , Publish Date - Nov 27 , 2025 | 08:16 AM
ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన విశాఖ నగరంలో చోటుచేపుకుంది. హైదరాబాద్‌కు చెందిన ర్యాలీ శ్రీనివాసరావు (57) అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. అయితే.. కుమార్తె పెళ్లి ఆగిపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
- ఈ నెల 25న జరగాల్సిన వివాహం అకస్మాత్తుగా రద్దు
- మగ పెళ్లివారిని వేడుకున్నా ససేమిరా అనడంతో మనస్తాపం
- మృతుడు హైదరాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి
విశాఖపట్నం: కుమార్తె పెళ్లి ఆగిపోవడంతో మనస్తాపానికి గురైన రియల్ ఎస్టేట్ వ్యాపారి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మృతుడి తల్లి పోలీసులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్(Hyderabad)కు చెందిన ర్యాలీ శ్రీనివాసరావు (57) అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. భార్య, కుమార్తె, కుమారుడు హైదరాబాద్‌లో ఉంటుండగా, శ్రీనివాసరావు మాత్రం తన తల్లి సత్యవతితో కలిసి విశాఖపట్నం పీఎం పాలెం(Visakhapatnam PM Palace)లోని ఐబీఆర్ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్నారు.
శ్రీనివాసరావు అప్పుడప్పుడు హైదరాబాద్‌లోని భార్యాపిల్లలు వద్దకు వెళ్లి వస్తుంటారు. ఆయన కుమార్తె హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తోంది. ఆమెకు పెందుర్తి సమీపంలోని చినముషిడివాడకు చెందిన బోని శ్రీనివాసరావు కుమారుడి (బ్యాంకు ఉద్యోగి)తో ఈ ఏడాది మార్చిలో పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 25న వివాహం జరిపేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నారు. కుమార్తె పెళ్లికి సంబంధించి బంధువులు, స్నేహితులకు కార్డులు పంపిణీ చేయడంతోపాటు ఏర్పాట్లన్నీ శ్రీనివాసరావు పూర్తిచేశారు.
ఇంతలో ఏమైందోగానీ పెళ్లి రద్దు చేసుకుంటున్నట్టు పెళ్లి కుమారుడి తరపువాళ్లు ఆయనకు చెప్పారు. దీంతో ఆయన పెళ్లి కుమారుడి ఇంటికి వెళ్లి పెళ్లి రద్దు చేసుకోవద్దని కాళ్లావేళ్లాపడి వేడుకున్నారు. కానీ వారి నిర్ణయం మారకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. విజయనగరంలో పెళ్లికి వెళుతున్నానని తల్లికి చెప్పి మంగళవారం (ఈ నెల 25) రాత్రి ఏడు గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్రీనివాసరావు తిరిగి వెళ్లలేదు. బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో పోలీస్ కానిస్టేబుల్ ఒకరు సత్యవతికి ఫోన్ చేసి ‘మీ కుమారుడి కారు పీఎం పాలెం క్రికెట్ స్టేడియం వద్ద సర్వీసు రోడ్డులో ఉంది.
ఆయన చనిపోయి ఉన్నారు. పక్కన పురుగుల మందు డబ్బా ఉందని’ సమాచారం ఇచ్చారు. ఆమె గాజువాకలో ఉంటున్న తన అల్లుడు, కుమారుడి బావమరిదికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు వె ళ్లారు. కాగా శ్రీనివాసరావు తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని హైదరాబాద్‌లో ఉంటున్న తన కుమారుడితోపాటు గాజువాకలో ఉంటున్న సోదరి భర్త, తన బావమరిదికి, స్నేహితుడికి సూసైట్ నోట్‌ను వాట్సాప్‌లో పంపించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పీఎం పాలెం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రాణాలకు తెగించి నాగుపాముకు వైద్యం.. 2 గంటల పాటు..
మీకు తెలుసా.. రైలులో చేసే ఈ తప్పు వల్ల జైలు పాలవ్వడం ఖాయం..
Read Latest Telangana News and National News