IT Stocks Falling: స్టాక్ మార్కెట్‌లో ఐటీ స్టాక్‌లే ఎందుకు పడిపోయాయి.. అసలు మ్యాటరేంటి..
ABN , Publish Date - Jul 14 , 2025 | 05:27 PM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నాలుగో రోజు (జూలై 14, 2025) కూడా పడిపోయాయి. ఐటీ రంగం 1.1 శాతం నష్టంతో మార్కెట్ పతనానికి ప్రధాన కారణంగా నిలిచింది. అయితే రానున్న రోజుల్లో కూడా ఇలాగే కొనసాగుతుందా?. అసలు ఐటీ రంగం ఎందుకు పడిపోయిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

భారత స్టాక్ మార్కెట్ సూచీలు (Stock Market) వరుసగా నాలుగోరోజు (జూలై 14, 2025న) పతనమయ్యాయి. ఈ క్రమంలో నిఫ్టీ 50 సూచీ 0.27 శాతం తగ్గి 25,082.3 పాయింట్లకు చేరుకోగా.. బీఎస్‌ఈ సెన్సెక్స్ 0.3 శాతం పడిపోయి 82,253.46 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే ఈ పతనానికి ప్రధాన కారణం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT Stocks) రంగం. ఇది 1.1 శాతం పతనంతో నష్టాన్ని చవిచూసింది.
గత వారం 4 శాతం పతనం తర్వాత, ఐటీ స్టాక్‌లు ఈరోజు కూడా ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అయితే ఈ స్టాక్స్ ఎందుకు పడిపోయాయి. వీటి కారణంగా మార్కెట్ ఎందుకు దిగజారిందనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
బలహీనమైన త్రైమాసిక ఫలితాలు
ఐటీ రంగంలోని ప్రముఖ కంపెనీల్లో ముఖ్యంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఊహించిన దానికంటే బలహీనమైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్రమంలో టీసీఎస్ ఆదాయం 3.3 శాతం తగ్గి రూ. 63,437 కోట్లకు చేరింది. ఇది విశ్లేషకుల అంచనాలను అందుకోలేదు. ఈ నిరాశాజనక ఫలితాలు ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వంటి ఇతర ఐటీ కంపెనీలపైనా ప్రతికూల ప్రభావం చూపాయి. ఇదే సమయంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ త్రైమాసిక ఆదాయం కూడా తగ్గిపోయి, మార్కెట్ అంచనాలను నిరాశ పరిచింది.
అమెరికా సుంకాలపై అనిశ్చితి
భారత ఐటీ కంపెనీలు తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని అమెరికా క్లయింట్ల నుంచి పొందుతాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై 35 శాతం సుంకాలను విధించారు. భారతదేశంతో సహా ఇతర దేశాలపై 15-20 శాతం సుంకాలు విధించే అవకాశం ఉందని ప్రకటించారు. ఈ సుంకాలు ఐటీ సేవల డిమాండ్‌ను తగ్గించవచ్చనే ఆందోళన మార్కెట్‌లో నెలకొంది. ఈ అనిశ్చితి ఐటీ స్టాక్‌లపై ఒత్తిడిని మరింత పెంచింది.
మార్కెట్ సెంటిమెంట్
దీంతో మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా మారింది. ఈ క్రమంలో నిఫ్టీ 150 కంటే తక్కువకు పడిపోయింది. ఇది 20-రోజుల మూవింగ్ యావరేజ్‌ను దాటింది. ఈ పతనం మార్కెట్‌లో ఒక కన్సాలిడేషన్ దశను సూచిస్తుంది. వచ్చే రోజుల్లో విప్రో, ఎల్‌టీటీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ వంటి కంపెనీల త్రైమాసిక ఫలితాలు మార్కెట్ దిశను నిర్ణయించే అవకాశం ఉంది.
ఇతర రంగాలతో పోలిక
ఐటీ రంగం నష్టాలను చవిచూస్తుండగా.. ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగాలు మాత్రం స్థిరంగా నిలిచాయి. హిందుస్థాన్ యూనిలీవర్ వంటి కంపెనీలు 5 శాతం లాభాలను సాధించాయి. ఇది మార్కెట్‌లోని ఇతర రంగాలు సానుకూలంగా ఉన్నాయని సూచిస్తుంది. అయితే, ఐటీ రంగం బలహీనత మొత్తం సూచీలపై ప్రతికూల ప్రభావం చూపించింది.
ఈ అంశాలు ప్రభావితం
వచ్చే రోజుల్లో ఐటీ కంపెనీల త్రైమాసిక ఫలితాలు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇన్ఫోసిస్ (జూలై 23), టెక్ మహీంద్రా (జూలై 16), ఎల్‌టీఐఎం (జూలై 17) ఫలితాలు ఐటీ రంగం భవిష్యత్తు దిశను నిర్ణయించవచ్చు. ఒకవేళ ఈ కంపెనీలు బలమైన ఫలితాలను ప్రకటిస్తే, ఐటీ స్టాక్‌లు కొంత రికవరీని చూడవచ్చు. అలాగే అమెరికా సుంకాలపై అనిశ్చితి గురించి క్లారిటీ వచ్చినా ఈ రంగం మరింత పుంజుకుంటుంది.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి