Sensex Rises: ఒడుదుడుకుల్లోనూ లాభాలొచ్చాయ్..
ABN , Publish Date - Jul 05 , 2025 | 03:03 AM
స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వారాంతం ట్రేడింగ్‌లో ఆద్యంతం తీవ్ర ఊగిసలాటలకు లోనైనప్పటికీ, చివర్లో బ్యాంకింగ్ సహా ఇతర బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లతో లాభాల్లో ముగిశాయి.

193 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై: స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వారాంతం ట్రేడింగ్‌లో ఆద్యంతం తీవ్ర ఊగిసలాటలకు లోనైనప్పటికీ, చివర్లో బ్యాంకింగ్ సహా ఇతర బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లతో లాభాల్లో ముగిశాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 193.42 పాయింట్ల వృద్ధితో 83,432.89 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 83,477.86 వద్ద గరిష్ఠాన్ని, 83,015.83 వద్ద కనిష్ఠ స్థాయిని నమోదు చేసిన సూచీ.. రోజంతా 462 పాయింట్ల శ్రేణిలో ఊగిసలాడింది. నిఫ్టీ విషయానికొస్తే, 55.70 పాయింట్ల లాభం తో 25,461 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 20 రాణించగా.. బజాజ్ ఫైనాన్స్ 1.60 శాతం పెరిగి సూచీ టాప్ గెయినర్‌గా నిలిచింది.
బ్రోకరేజీ షేర్లు డౌన్
జేన్ స్ట్రీట్ వివాదం నేపథ్యంలో స్టాక్ బ్రోకింగ్, ఎక్స్ఛేంజ్‌లు, డిపాజిటరీ సంస్థల షేర్లు నష్టాల్లో ముగిశాయి. బ్రోకరేజీ సేవల కంపెనీల్లో నువామా వెల్త్ మేనేజ్‌మెంట్ స్టాక్ 11.26 శాతం క్షీణించగా.. ఏంజిల్ వన్ 5.94 శాతం నష్టపోయింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ బీఎస్‌ఈ షేరు సైతం 6.42 శాతం పతనమైంది. సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సీడీఎ్‌సఎల్) స్టాక్ 2.29 శాతం నష్టపోయింది.