Share News

SBI Clerk Cheats: కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్

ABN , Publish Date - Jul 24 , 2025 | 01:51 PM

దేశంలో అత్యంత విశ్వసనీయంగా భావించబడే ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐలో సంచలన మోసం వెలుగులోకి వచ్చింది. ఓ శాఖలో పని చేస్తున్న క్లర్క్‌ అనేక మంది ఖాతాదారుల కోట్ల రూపాయలను నుంచి కాజేశాడు. ఆ వివరాలేంటో చూద్దాం.

SBI Clerk Cheats: కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్
SBI Clerk Cheats

దేశంలో ప్రముఖ ప్రభుత్వ బ్యాంకైన ఓ ఎస్‌బీఐ బ్రాంచ్ నుంచి సంచలన మోసం వెలుగులోకి వచ్చింది. ఓ క్లర్క్ అనేక మంది కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయలు తీసుకుని, పరారైన ఘటన (SBI Clerk Cheats) సంచలనం రేపుతోంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, క్రెడిట్ లిమిట్‌ల నుంచి డబ్బు కాజేసిన ఈ మోసగాడు, బ్యాంక్ కస్టమర్ల జీవితాలను ఆర్థికంగా గందరగోళంలోకి నెట్టాడు. ఈ ఘటన పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లోని సదీక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్రాంచ్‌లో చోటుచేసుకుంది.


బ్యాంక్ వద్ద కస్టమర్ల ఆందోళన

ఈ క్రమంలో బుధవారం ఉదయం సదీక్ బ్రాంచ్‌కు వచ్చిన కస్టమర్లు తమ ఖాతాలు ఖాళీ అయిన విషయం తెలుసుకుని షాక్‌కు గురయ్యారు. వృద్ధులు, మహిళలు తమ జీవితకాల సేవింగ్స్ ఒక్క రాత్రిలో గల్లంతైన సంగతి తెలిసి పలువురు కన్నీరు పెట్టుకున్నారు. మా జీవితంలో సంపాదించిన డబ్బు అంతా పోయిందని, ఇక ఏం చేయాలో తెలియడం లేదని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మరికొంత మంది సైతం వారి మనీ పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.


మోసం ఎలా జరిగింది?

కస్టమర్ల ఖాతాల నుంచి అనుమానాస్పద ఉపసంహరణలు జరిగినట్లు గుర్తించిన బ్యాంక్ అధికారులు, రికార్డులను పరిశీలించగా, భారీ మొత్తంలో డబ్బు గల్లంతైనట్లు తేలింది. ఈ మోసానికి కారణం బ్యాంక్ క్లర్క్ అమిత్ ధింగ్రా అని అధికారులు నిర్ధారించారు. అతను కస్టమర్ల అనుమతి లేకుండా ఫిక్స్‌డ్ డిపాజిట్లను బ్రేక్ చేసి, నామినీ పేర్లను మార్చి, డబ్బును ఇతర ఖాతాలకు బదిలీ చేశాడు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు.


కస్టమర్ల ఆవేదన

పరమ్‌జిత్ కౌర్ అనే కస్టమర్ తన భర్తతో కలిసి ఉన్న రూ. 22 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా ఖాళీ అయిన విషయం తెలిసి కన్నీరు మున్నీరైంది. మాకు ఎలాంటి సమాచారం లేకుండానే డబ్బు అదృశ్యమైందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మరో కస్టమర్ సందీప్ సింగ్, తన నాలుగు ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఒక్కటి రూ. 4 లక్షలు) ఇప్పుడు కేవలం రూ. 50,000 మాత్రమే మిగిలాయని చెప్పాడు. మా కష్టార్జితం ఇలా పోతుందని ఊహించలేదని బాధను వ్యక్తం చేశాడు.


బ్యాంక్, పోలీసుల హామీ

ప్రస్తుతం ఈ మోసం విలువ సుమారు రూ. 5 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ అధికారులు ఈ ఘటనపై సమీక్ష నిర్వహిస్తున్నారు. కస్టమర్ల డబ్బు తిరిగి ఇప్పిస్తామని వారు హామీ ఇచ్చారు. బ్రాంచ్ ఫీల్డ్ ఆఫీసర్ సుశాంత్ అరోరా, తాను ఇటీవలే బ్రాంచ్‌లో చేరానని, కస్టమర్ల ఫిర్యాదులతోనే ఈ మోసం గురించి తెలిసిందని చెప్పారు. సదీక్ బ్రాంచ్ ఇన్‌చార్జ్ నవదీప్ భట్టి, క్లర్క్ అమిత్ ధింగ్రాపై నాలుగు ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.


ఇవి కూడా చదవండి

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

కోటా నియమాలు మార్చిన భారత రైల్వే.. ప్రయాణీకులు ఏం చేయాలంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 24 , 2025 | 01:56 PM