Share News

Indian Railways: తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఈ సీక్రెట్ తెలుసుకోండి.. లేకపోతే మీ ఆశలు ఆవిరైపోతాయి

ABN , Publish Date - Feb 21 , 2025 | 05:40 PM

అత్యవసరంగా రైలులో ప్రయాణించేవారి కోసం భారతీయ రైల్వే తత్కాల్ టికెట్ల విధానాన్ని ప్రవేశపెట్టింది. తత్కాల్‌లో టికెట్లు చేసేటప్పుడు కొందరు వెయిటింగ్ లిస్ట్ ఉన్నా.. కన్పర్మ్ అవుతుందనే అభిప్రాయంతో టికెట్లు బుక్ చేస్తారు. ఇంతకీ తత్కాల్ వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కన్ఫర్మ్ అవుతాయా.. ఎంతమేరకు అవకాశాలు ఉన్నాయి

Indian Railways: తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఈ సీక్రెట్ తెలుసుకోండి.. లేకపోతే మీ ఆశలు ఆవిరైపోతాయి
Train Tatkal Tickets

ప్లానింగ్ లేని దూరపు ప్రయాణాలు చేయాలంటే సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేది రైలు ప్రయాణం. అనుకోని ప్రయాణాలు చేసే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే రిజర్వేషన్ కోచ్‌లలో కొన్ని సీట్లను తత్కాల్ కోటాకు కేటాయిస్తోంది. రైలు బయలుదేరే స్టేషన్ నుంచి ఒక రోజు ముందు తత్కాల్ కోటా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. దీంతో చాలామంది తత్కాల్ టికెట్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయా అంటూ ఎదురుచూస్తుంటారు. తీరా టికెట్లు ఓపెన్ అయిన తర్వాత ఒకటి నుంచి రెండు నిమిషాల్లోనే ప్రధాని రైళ్లల్లో టికెట్లు బుక్ అయిపోతూ ఉంటాయి. దీంతో మనకు టికెట్లు దొరకడం చాలా కష్టమవుతోంది. కొంతమంది తత్కాల్‌లో వెయిటింగ్ లిస్ట్ టికెట్లను బుక్ చేస్తుంటారు. సాధారణంగా తత్కాల్‌లో పది నుంచి పదిహేను వెయిటింగ్ లిస్ట్ ఉంటే కన్ఫర్మ్ అవుతాయనే ఆశతో టికెట్లు బుక్ చేస్తుంటారు. తీరా చార్ట్ తయారైన తర్వాత టికెట్ కన్ఫర్మ్ కాకపోవడంతో ఎంతో నిరాశ చెందుతారు. కొంతమంది ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే.. మరికొందరు జనరల్ టికెట్ తీసుకుని ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపిస్తారు. మరికొంతమంది బస్సులో వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు. అసలు తత్కాల్‌లో వెయిటింగ్ లిస్ట్ టికెట్లు బుక్ చేసుకోవచ్చా.. అలాచేస్తే కన్ఫర్మ్ అవ్వడానికి ఎంతమేరకు అవకాశాలుంటాయనేది తెలుసుకుందాం.


వెయిటింగ్ లిస్ట్‌తో జాగ్రత్త

సాధారణ వెయిటింగ్ లిస్ట్ టికెట్లతో పోలిస్తే తత్కాల్ వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కన్ఫర్మ్ కావడం అసాధ్యమనే చెప్పుకోవాలి. ఒక రైలులోని మొత్తం టికెట్లలో ఎక్కువమొత్తం టికెట్లను జనరల్ కేటగిరికి కేటాయిస్తారు. కొన్ని సీనియర్ సిటిజన్, మరికొన్ని మహిళా కోటాకు కేటాయించి. కొన్నింటిని తత్కాల్ కోటా కోసం పెడతారు. మరికొన్ని బెర్తులను ఈక్యూ కోసం కేటాయిస్తారు. సాధారణ కోటాలో రిజర్వేషన్లు చేయించుకుని క్యాన్సిల్ చేసుకుంటే వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కన్ఫర్మ్ కావడానికి అవకాశం ఉంటుంది. సీనియర్ సిటిజన్, మహిళలకోటాతో పాటు ఈక్యూలో బెర్తులు మిగిలిపోయినా వాటిని సాధారణ కోటాలో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వారికి కేటాయిస్తారు. సాధారణ కోటాలో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణీకులకు కేటాయించిన తర్వాత మిగిలితే వాటిని తత్కాల్ కోటాలోని వెయిటింగ్ లిస్ట్‌‌లో ఉన్న ప్రయాణీకులకు కేటాయిస్తారు. సాధారణంగా తత్కాల్ వెయిటింగ్ లిస్ట్‌లో ప్రయాణీకులకు ప్రాధాన్యత ఇస్తారనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ సాధారణ కోటా ప్రయాణీకులకు ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత తత్కాల్ వెయిటింగ్ లిస్ట్ ప్రయాణీకులకు బెర్తులు కేటాయిస్తారు.


అవకాశాలు ఎప్పుడంటే..

తత్కాల్ వెయిటింగ్ లిస్ట్ ఒకటి, రెండు ఉంటే మాత్రం ఆ టికెట్లు కన్ఫర్మ్ అవ్వడానికి 50 శాతానికి పైగా అవకాశం ఉంటుంది. తత్కాల్ టికెట్లు బుక్ చేసుకుని కన్ఫర్మ్ అయినవాళ్లు క్యాన్సిల్ చేసుకుంటేనే వెయిటింగ్ లిస్ట్ ప్రయాణీకుల టికెట్లు కన్ఫర్మ్ అవుతాయి. సాధారణంగా తత్కాల్ కోటాలో టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణీకులు తమ ప్రయాణానికి ఒకరోజు ముందు మాత్రమే టికెట్ బుక్ చేసుకుంటారు. అత్యవసరం అయినప్పుడే తత్కాల్ టికెట్ తీసుకుంటారు. దీంతో తత్కాల్ టికెట్లు రద్దు చేసుకోవడానికి అవకాశాలు తక్కువ. ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా ఆరోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు మాత్రం తమ ప్రయాణాన్ని రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే తత్కాల్ కోటాలో టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు వెయిటింగ్ లిస్ట్ ఉంటే తీసుకోకపోవడమే బెటర్.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Feb 21 , 2025 | 05:47 PM