Share News

Pump and Dump Scam: స్టాక్ మార్కెట్‌లో పంప్ అండ్ డంప్ స్కామ్..భారీగా నష్టపోయిన ఇన్వెస్టర్లు

ABN , Publish Date - Jul 20 , 2025 | 04:23 PM

ఇన్వెస్టర్లకు కీలక అలర్ట్. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. పలువురు కలిసి స్టాక్ ధరలను భారీగా పెంచేసి.. పెద్ద, చిన్న పెట్టుబడిదారులను భారీగా మోసం చేశారు. అయితే ఆ స్కామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Pump and Dump Scam: స్టాక్ మార్కెట్‌లో పంప్ అండ్ డంప్ స్కామ్..భారీగా నష్టపోయిన ఇన్వెస్టర్లు
Pump and Dump Scam

స్టాక్ మార్కెట్‌లో ఇటీవల కాలంలో పెట్టుబడులు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇదే సమయంలో స్కాట్ మార్కెట్ మోసాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఓ స్కామ్ గురించి ఇక్కడ చూద్దాం. ఇటీవల అమెరికాకు చెందిన ప్రముఖ గ్లోబల్ ఆల్గో ట్రేడింగ్ కంపెనీ జేన్ స్ట్రీట్ కేసు వార్తల్లో నిలిచింది. ఈ సంస్థ ఫ్యూచర్స్, ఆప్షన్స్ ముసుగులో వేల కోట్ల రూపాయలను పెట్టుబడిదారుల నుంచి మోసం చేసిందనే ఆరోపణలు వచ్చాయి. స్టాక్ మార్కెట్‌లో పంప్ అండ్ డంప్ (Pump and Dump Scam) అనే మోసపూరిత స్కాం ద్వారా పెద్ద ఇన్వెస్టర్లు, చిన్న ఇన్వెస్టర్ల కష్టార్జిత డబ్బును కూడా దోచుకుంది.


పంప్ అండ్ డంప్ స్కామ్ అంటే ఏంటి

పంప్ అండ్ డంప్ అనేది స్టాక్ మార్కెట్‌లో చాలా కాలంగా కొనసాగుతున్న ఆర్థిక మోసం. ఈ స్కామ్లో భాగంగా స్కామర్లు మొదట తక్కువ ధర కలిగిన స్టాక్‌లను (పెన్నీ స్టాక్స్) లేదా చిన్న కంపెనీల షేర్లను ఎంచుకుంటారు. ఈ షేర్లను భారీ మొత్తంలో కొనుగోలు చేసి, వాటి ధరను కృత్రిమంగా పెంచుతారు. ఆ తర్వాత, సోషల్ మీడియా వేదికలైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూపుల ద్వారా ఈ స్టాక్‌ల గురించి తప్పుడు ప్రచారం చేస్తారు.

ఈ ప్రచారం ద్వారా సామాన్య పెట్టుబడిదారులు ఆ స్టాక్‌లపై ఆసక్తి చూపి, పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తారు. ఆ తర్వాత స్టాక్ ధర విపరీతంగా పెరుగుతుంది. ధర గరిష్ట స్థాయికి చేరిన వెంటనే, స్కామర్లు ఆ షేర్లను విక్రయించి, లాభాలతో నిష్క్రమిస్తారు. దీంతో ఆ స్టాక్ ధర అకస్మాత్తుగా పడిపోతుంది. ఆ క్రమంలో ఆ స్టాక్ పై ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులు వారి డబ్బును కోల్పోతారు.


ఈ స్కామ్ ఎలా పనిచేస్తుంది?

ఉదాహరణకు ఒక కంపెనీ షేరు ధర రూ. 2గా ఉంటే, స్కామర్లు ఈ కంపెనీవి లక్షల షేర్లను కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత వారు సోషల్ మీడియా, ఆన్‌లైన్ ఫోరమ్‌ లేదా స్టాక్ టిప్స్ పేరుతో గ్రూపుల ద్వారా ఈ స్టాక్‌ ధర గురించి హైప్ క్రియేట్ చేస్తారు. ఈ కంపెనీ షేర్లు త్వరలో రూ.20కి చేరుకుంటాయని తప్పుడు సమాచారం ప్రచారం చేస్తారు.

ఈ ప్రచారం చూసిన పెట్టుబడిదారులు ఆ స్టాక్‌లో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తారు. దీంతో షేరు ధర రూ. 5 నుండి రూ. 10 లేదా రూ. 20కి చేరుకుంటుంది. ఆ సమయంలో, స్కామర్లు తమ షేర్లను విక్రయించి, భారీ లాభాలతో నిష్క్రమిస్తారు. వారి విక్రయం కారణంగా స్టాక్ ధర తిరిగి రూ. 2కు పడిపోతుంది. ఫలితంగా, చిన్న పెట్టుబడిదారులు తమ కష్టార్జిత డబ్బును కోల్పోతారు.


ఈ మోసం నుంచి ఎలా రక్షించుకోవాలి

  • పరిశోధన చేయండి: ఏ స్టాక్‌లోనైనా పెట్టుబడి పెట్టే ముందు కంపెనీ ఆర్థిక పరిస్థితి, నిర్వహణ, మార్కెట్ స్థానాన్ని పరిశీలించండి.

  • సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మవద్దు: ఆన్‌లైన్‌లో వచ్చే స్టాక్ టిప్స్ లేదా గ్యారంటీ లాభాలు గురించి నమ్మవద్దు.

  • సెబీ రిజిస్టర్డ్ సలహాదారులను సంప్రదించండి: ఆర్థిక సలహాదారులు లేదా సెబీ ఆమోదిత బ్రోకర్ల సహాయం తీసుకోండి

  • వివిధ రంగాల్లో: అన్ని డబ్బులను ఒకే స్టాక్‌లో పెట్టకుండా, వివిధ రంగాలలో పెట్టుబడి పెట్టండి


ఇవి కూడా చదవండి

వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 20 , 2025 | 05:46 PM