Jitendra Singh: దేశంలో 76,000కి పైగా స్టార్టప్స్ మహిళలచే నిర్వహణ..
ABN , Publish Date - Jul 20 , 2025 | 06:49 PM
దేశ వ్యాపార ప్రపంచంలో గత 11 ఏళ్లలో అనేక మార్పులు వచ్చినట్లు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ క్రమంలో మహిళలు కూడా ఈ రంగంలో ముందుకు వచ్చారని అన్నారు. దేశవ్యాప్తంగా 76,000కి పైగా స్టార్టప్స్ ప్రస్తుతం మహిళల చేతుల్లో ఉన్నట్లు వెల్లడించారు.

ఢిల్లీ: దేశంలో పురుషులే కాదు మహిళల్లో కూడా వ్యాపారం చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ (Jitendra Singh) ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలో దేశంలో దాదాపు 76 వేల స్టార్టప్‌లను మహిళలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వీటిలో చాలా వరకు టైర్ 2, టైర్ 3 నగరాల నుంచి ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మహిళలు, యువత శక్తివంతంగా ఉండడం వల్ల 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని కేంద్రమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రధాన అంశాలు
గత 11 సంవత్సరాలలో మోదీ ప్రభుత్వం నాలుగు ముఖ్యమైన అంశాల చుట్టూ పాలనను విస్తరించిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. వాటిలో పేదలు, రైతులు, యువత, మహిళలు ఉన్నట్లు తెలిపారు. మహిళా కేంద్రీకృత పాలన వ్యక్తులను శక్తివంతం చేయడమే కాకుండా, సమాజాన్ని పునర్నిర్మిస్తుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు సంస్థాగత నాయకత్వంగా రూపాంతరం చెందాయని వెల్లడించారు.
మహిళల కోసం
మహిళలకు విద్యను మరింత సులభతరం చేయడానికి కేంద్ర మంత్రి జీవిక ఇ-లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అనే యాప్ ప్రవేశపెట్టారు. అలాగే బిహార్ అభివృద్ధి ప్రయాణంలో మహిళల పాత్రను గౌరవించే విధంగా మహిళా సమృద్ధ్ బిహార్ అనే ప్రచురణను కూడా ఆయన విడుదల చేశారు. మోదీ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం నాలుగు ముఖ్య దశలతో ఒక సమగ్ర విధానాన్ని అనుసరిస్తున్నట్లు చెప్పారు. మొదటి దశలో సంస్థల్లో ప్రవేశం, చేరిక ద్వారా భారతదేశ విద్య, సైనిక రంగాలలో చారిత్రాత్మక మార్పును సూచిస్తుందన్నారు.
మహిళల శక్తివంతం
రెండో దశలో శాస్త్రీయ, సాంకేతిక సాధికారత, WISE (విమెన్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్), GATI (జెండర్ అడ్వాన్స్‌మెంట్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇన్‌స్టిట్యూషన్స్), CURIE, విమెన్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ వంటి లక్ష్య కార్యక్రమాలు మహిళలను శక్తివంతం చేస్తాయన్నారు. మూడో దశలో ఆర్థిక, సామాజిక సాధికారత, మహిళలకు ఆర్థిక వనరుల సమకూరత ఉంటుందన్నారు కేంద్ర మంత్రి. ఈ సందర్భంగా 48 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలు మహిళల కోసం తెరిచినట్లు గుర్తు చేశారు.
మహిళా వ్యవస్థాపకులు
అలాగే ముద్రా యోజన లబ్ధిదారులలో 60 శాతం మంది మహిళా వ్యవస్థాపకులు ఉన్నట్లు ప్రస్తావించారు. స్వయం సహాయక బృందాల (SHGs) ద్వారా 3 కోట్లకు పైగా లఖ్‌పతి దీదీల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మార్పు వచ్చినట్లు తెలిపారు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద, మహిళల పేరిట రిజిస్టర్ చేయబడిన గృహాలు కేవలం ఆశ్రయం మాత్రమే కాకుండా ఆర్థిక, సామాజిక గౌరవాన్ని కూడా అందిస్తున్నాయన్నారు.
పాలనా చర్యలు
నాలుగో దశలో సంస్కరణలు, సానుభూతితో కూడిన సమగ్ర పాలనా చర్యలను పరిచయం చేసినట్లు చెప్పారు. ఇందులో ప్రభుత్వ సర్వీసులో మహిళలకు ఆరు నెలల చెల్లింపు చైల్డ్‌కేర్ లీవ్, వివాహం కాని లేదా విడాకులు తీసుకున్న కుమార్తెలకు పెన్షన్ హక్కులు, గర్భస్రావం తర్వాత కూడా ప్రసూతి సెలవు సౌకర్యాలు ఉన్నట్లు తెలిపారు. ఈ సంస్కరణలు భారతదేశంలో మహిళలు సామర్థ్యాన్ని వెలికితీసేందుకు, దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించేందుకు ఒక బలమైన వేదికను అందిస్తాయన్నారు.
ఇవి కూడా చదవండి
వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి