Sleeping Prince: రెండు దశాబ్దాలుగా కోమాలో ఉన్న సౌదీ రాకుమారుడి కన్నుమూత
ABN , Publish Date - Jul 20 , 2025 | 06:12 PM
ఇరవై ఏళ్లుగా కోమాలో ఉన్న సౌదీ రాకుమారుడు అల్ వాలిద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ ఇటీవల కన్నుమూశారు. ఆయన వయసు 35 ఏళ్లు. 15 ఏళ్ల వయసులో జరిగిన ఓ కారు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయారు. ఆయన మృతిపై సౌదీ రాజకుటుంబం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇంటర్నెట్ డెస్క్: ఇరవై ఏళ్లుగా కోమాలో ఉన్న సౌదీ అరేబియా రాకుమారుడు అల్ వాలిద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ కన్నుమూశారు. స్లీపింగ్ ప్రిన్స్‌గా పేరు పడ్డ ఈ రాకుమారుడి మరణంతో సౌదీ రాజకుటుంబం శోకసంద్రంలో కూరుకుపోయింది.
సౌదీ రాజకుటుంబంలో ప్రముఖుడైన ప్రిన్స్ ఖలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ పెద్ద కుమారుడు ప్రిన్స్ వాలిద్. ఆయన 1990లో జన్మించారు. బ్రిటన్‌లో ఓ మిలిటరీ కాలేజీలో శిక్షణ తీసుకుంటున్న సమయంలో ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు. అప్పటికి ఆయన వయసు 15 ఏళ్లు. వెంటనే ఆయనకు అత్యాధునిక వైద్య సాయం అందించినా ఆరోగ్యం మెరుగుపడలేదు. కోమాలోకి జారిపోయిన ఆయన ఆ తరువాత 20 ఏళ్ల పాటు అదే స్థితిలో కొనసాగారు. లండన్, స్పెయిన్‌కు చెందిన ప్రముఖ వైద్యులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
చివరకు ఆయనను రియాధ్‌లోని కింగ్ అబ్దుల్ అజీజ్ మెడికల్ సిటీకి తరలించి చికిత్స కొనసాగించారు. నిరంతర వైద్య పర్యవేక్షణలో లైఫ్ సపోర్టుపై ఉంచి చికిత్స అందించారు. ఏదోక అద్భుతం జరిగిన ఆయన కోమాలోంచి బయటపడతారని కుటుంబసభ్యులు కొన్నేళ్ల పాటు ఎదురు చూశారు. అప్పుడప్పుడు రాకుమారుడి చేతులు, కాళ్లల్లో చలనం కనిపిస్తే రాజకుటుంబం సంబరపడిపోయేది. ఏదోక రోజు ఆయన కోలుకుంటారని భావించేది.
గాఢనిద్రలో ఉన్నట్టు కనిపించే రాకుమారుడి ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో ఆయనకు స్లీపింగ్ ప్రిన్స్‌గా పేరొచ్చింది. అయితే, తాజాగా రాకుమారుడు కన్నుమూయడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో కూరుకుపోయారు. తనయుడి మరణంపై విచారం వ్యక్తం చేస్తూ తండ్రి ప్రిన్స్ ఖాలిద్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి:
ప్రముఖ అమెరికన్ టీవీ షోకు ముగింపు.. తెగ మురిసిపోయిన డొనాల్డ్ ట్రంప్
ట్రంప్ కాళ్ల వాపుపై స్పందించిన వైట్ హౌస్.. వృద్ధుల్లో కనిపించే సాధారణ సమస్యేనని క్లారిటీ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి