Small Savings Schemes: పీఎఫ్, NSC, పోస్టాఫీస్ FD వడ్డీ రేట్లలో ఈసారి కూడా నిరాశే..
ABN , Publish Date - Jun 30 , 2025 | 07:44 PM
కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపు పథకాల్లో (Small Savings Schemes ఇన్వెస్ట్ చేసిన వారికి షాకింగ్ న్యూస్ తెలిపింది. ఎందుకంటే 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కూడా వీటి వడ్డీ రేట్లను పెంచకుండా అలాగే ఉంచేసింది. ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు)లో చిన్న పొదుపు పథకాల (Small Savings Schemes) వడ్డీ రేట్లను మళ్లీ మార్పు చేయకుండా కేంద్ర ప్రభుత్వం యథాతథంగా ఉంచింది. ఇది వరుసగా ఆరో త్రైమాసికం కావడం విశేషం. ఈ సమయంలో ప్రభుత్వం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో ఈ నిర్ణయం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC), పోస్టాఫీస్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వంటి పథకాలపై ప్రభావం చూపించనుంది.
చిన్న పొదుపు పథకాలు
చిన్న పొదుపు పథకాలు ప్రధానంగా పోస్టాఫీసు, బ్యాంకుల ద్వారా నిర్వహించబడతాయి. ఈ పథకాలను అనేక మంది ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి ఎంపికలుగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇవి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నాయి కాబట్టి రిస్క్ ఉండదు. సామాన్య ప్రజలతోపాటు ప్రధానంగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు, ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. PPF, NSC, సుకన్య సమృద్ధి యోజన, కిసాన్ వికాస్ పత్ర, పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ వంటివి ఈ కోవలోకి వస్తాయి. ఈ పథకాలు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో సహాయపడతాయి.
2025-26 రెండో త్రైమాసిక వడ్డీ రేట్లు
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 2025 జూలై-సెప్టెంబర్ కాలానికి వడ్డీ రేట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
సుకన్య సమృద్ధి యోజన: 8.2% వడ్డీ రేటు. ఈ స్కీం బాలికల భవిష్యత్తు కోసం రూపొందించబడింది. ఇది అత్యధిక వడ్డీ రేటు అందించే పథకాలలో ఒకటిగా ఉంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): 7.1% వడ్డీ రేటుతో దీర్ఘకాలిక పొదుపు కోసం ప్రయోజనంగా ఉంటుంది.
పోస్టాఫీస్ సేవింగ్స్ డిపాజిట్: 4% వడ్డీ రేటు. ఇది తక్కువ రిస్క్‌తో డబ్బు ఉపసంహరణకు అనుకూలంగా ఉంటుంది
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC): 7.7% వడ్డీ రేటు. ఇది స్థిరమైన రాబడి కోసం మంచి ఎంపిక
కిసాన్ వికాస్ పత్ర: 7.5% వడ్డీ రేటు, 115 నెలల మెచ్యూరిటీ
పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్: 7.4% వడ్డీ రేటు. నెలవారీ ఆదాయం కోసం ఇది అనువైనది
ఈ రేట్లు గత త్రైమాసికం (ఏప్రిల్-జూన్ 2025) నుంచి మార్పు లేకుండా కొనసాగుతున్నాయి. చివరిసారిగా వడ్డీ రేట్లలో మార్పులు 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో జరిగాయి.
ఈ నిర్ణయం ప్రభావం
వడ్డీ రేట్లలో మార్పు లేకపోవడం వీటిలో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులకు నిరాశ ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం, ఇతర అంశాల కారణంగా అధిక రాబడి ఆశించే వారు ఈ స్థిరమైన రేట్లతో సంతృప్తి చెందకపోవచ్చు. అయినప్పటికీ ఈ పథకాలు ఇప్పటికీ సురక్షితమైన, నమ్మదగిన పెట్టుబడి ఆప్షన్లుగా ఉన్నాయి. ముఖ్యంగా సుకన్య సమృద్ధి యోజన 8.2% వడ్డీ రేటుతో ఉంది. ఇది బాలికల చదువు, పెళ్లి వంటి లక్ష్యాల కోసం మంచి ఎంపికగా ఉంది.
ఇవీ చదవండి:
మీ వ్యక్తిగత రుణాన్ని ఈ 5 మార్గాలతో ఈజీగా తీర్చుకోండి
వర్షంలో స్మార్ట్‌ఫోన్ ఇలా ఉపయోగిస్తున్నారా.. డేంజర్ జాగ్రత్త..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి