Share News

Lay offs: ఉద్యోగులకు షాకిచ్చిన జియోస్టార్.. ఇక్కడ కూడా లే ఆఫ్స్..

ABN , Publish Date - Mar 06 , 2025 | 03:58 PM

అనేక సంస్థలు ఇప్పటికీ ఇంకా లే ఆఫ్స్ ప్రకటిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో అగ్ర సంస్థ దాదాపు వెయ్యి మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలిసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Lay offs: ఉద్యోగులకు షాకిచ్చిన జియోస్టార్.. ఇక్కడ కూడా లే ఆఫ్స్..
layoffs

ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాల కోతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల మెటా సహా పలు కంపెనీల్లో వేల మందిని తొలగించిన సందర్భాలు వెలుగులోకి రాగా, తాజాగా జియోలో కూడా లే ఆఫ్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది. నవంబర్ 2024లో వయాకామ్ 18, వాల్ట్ డిస్నీ విలీనం తర్వాత జియోస్టార్ దాదాపు 1,100 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలిసింది. సమాచారం ప్రకారం ఈ తొలగింపులు గత నెలలో ప్రారంభమయ్యాయి. విలీనం తర్వాత పునర్నిర్మాణంలో భాగంగా జూన్ 2025 వరకు ఇవి కొనసాగుతాయని తెలుస్తోంది.


ఈ ఉద్యోగాల కోతలు ప్రధానంగా పంపిణీ, ఆర్థిక, వాణిజ్య, చట్టపరమైన విభాగాలలో కార్పొరేట్ స్థానాలను ప్రభావితం చేస్తాయని ఆయా వర్గాలు చెబుతున్నాయి. వయాకామ్ 18, డిస్నీ స్టార్ ఇండియా విలీనం తర్వాత భారతదేశంలో అతిపెద్ద మీడియా, వినోద సంస్థగా జియోస్టార్ ఏర్పడింది. ఈ క్రమంలో కొత్త సంస్థ తమ సామర్థ్యాన్ని పెంచుకోవడం, అధిక వృద్ధి రంగాలైన క్రీడలు, ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌పై ఫోకస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.


ఈ క్రమంలో ఒకే వ్యాపారాలు కలిగిన రెండు పెద్ద కంపెనీలు విలీనం అయినప్పుడు, తొలగింపులు సాధారణమని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉన్న వనరులను ఉపయోగించుకోవడంతోపాటు సమర్థవంతంగా పనిచేసేవారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జియోస్టార్ నుంచి తొలగించే ఉద్యోగులకు ప్రత్యేక ప్యాకేజీని అందిస్తున్నట్లు సమాచారం. నోటీసులో ఉన్న ఉద్యోగులు కంపెనీలో ఎంతకాలం పనిచేశారనే దానిపై ఆధారపడి ఆరు నుంచి 12 నెలల జీతం పొందుతారు. ప్రతి సంవత్సరానికి, ఉద్యోగులకు ఒక నెల పూర్తి జీతం, అదనంగా ఒకటి నుంచి మూడు నెలల నోటీసు వ్యవధి కూడా లభిస్తుంది.


ప్రస్తుతం రూ. 70,352 కోట్ల విలువైన జియోస్టార్.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి స్ట్రీమింగ్ దిగ్గజాలతో పోటీ పడాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే సమయంలో దీని టెలివిజన్ వ్యాపారాన్ని కూడా బలోపేతం చేస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వయాకామ్ 18లో ప్రత్యక్ష యాజమాన్యం ద్వారా మెజారిటీ వాటాను కలిగి ఉండగా, డిస్నీ 36.84 శాతం వాటా కలిగి ఉంది. ఈ కొత్త కంపెనీకి నీతా అంబానీ ఛైర్‌పర్సన్‌ కాగా, ఉదయ్ శంకర్ వైస్ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. వయాకామ్ 18, డిస్నీ విలీనం తరువాత జియోస్టార్ ఉద్యోగుల తొలగింపులు దీని భవిష్యత్తు ప్రణాళికలపై ప్రభావం చూపించనున్నాయని పలువురు అంటున్నారు.


ఇవి కూడా చదవండి:

Alert: ఏప్రిల్ 1 నుంచి టీడీఎస్, టీసీఎస్ నియమాల్లో కీలక మార్పులు..


Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 06 , 2025 | 04:20 PM