Share News

H D Kumaraswamy: దేశీయంగా రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్ల తయారీకి రూ.1,345 కోట్లతో ప్రత్యేక నిధి

ABN , Publish Date - Jul 12 , 2025 | 03:25 AM

దేశీయంగా రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్ల ఉత్పత్తికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ముందుకు వచ్చే కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించేందుకు రూ.1,345 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనుంది

 H D Kumaraswamy: దేశీయంగా రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్ల తయారీకి రూ.1,345 కోట్లతో ప్రత్యేక నిధి

  • ప్రత్యేక ప్రోత్సాహాకాలకు ప్రభుత్వం సిద్ధం

  • చైనా ఆధిపత్యానికి చెక్‌ పెట్టేందుకే..

  • కేంద్ర మంత్రి కుమార స్వామి

న్యూఢిల్లీ: దేశీయంగా రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్ల ఉత్పత్తికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ముందుకు వచ్చే కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించేందుకు రూ.1,345 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనుంది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమార స్వామి ఈ విషయం ప్రకటించారు. రాష్ట్రాలతో చర్చించిన తర్వాత ఈ ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్‌ ఆమోదానికి పెడతామని ఆయన చెప్పారు.

రెండు కంపెనీలకే అవకాశం

అయితే రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్ల తయారీకి రెండు కంపెనీలను మాత్రమే ఎంపిక చేయనున్నట్టు కుమార స్వామి తెలిపారు. రేర్‌ ఎర్త్‌ ఖనిజాల ఉత్పత్తి, వాటిని శుద్ధి చేయడం, శుద్ధి చేసిన ఖనిజాల నుంచి తుది ఉత్పత్తులైన రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్ల తయారీ వరకు అన్ని దశల్లోనూ కంపెనీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర మంత్రి చెప్పారు. ఇప్పటికే వినియోగించి పారేసిన రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్లను కరిగించి ఆ భస్మంతో మాగ్నెట్లను తయారు చేసేలా కంపెనీలను ప్రోత్సహించడం తమ లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది.

చైనాదే హవా

ఆటోమొబైల్‌, కంప్యూటర్‌ చిప్స్‌, విండ్‌ టర్బైన్స్‌లో రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్లు కీలకం. ప్రస్తుతం ఈ మాగ్నెట్ల ఉత్పత్తిలో చైనాదే హవా. ప్రపంచ ఉత్పత్తిలో 90 శాతం చైనాలోనే కేంద్రీకృతమైంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి చైనా మన దేశానికి వీటి ఎగుమతులను నిలిపివేసింది. దీంతో దేశీయ ఆటోమొబైల్‌ కంపెనీనీలు ముఖ్యంగా విద్యుత్‌ వాహనాల కంపెనీలు వీటి సరఫరా కోసం అరిచి గగ్గోలు పెడుతున్నాయి. అయినా చైనా నుంచి ఉలుకూ పలుకు లేదు. ప్రత్యామ్నాయాలు చూద్దామన్నా పెద్దగా ఫలించడం లేదు. దీంతో సొంత కాళ్లపై నిలబడడం తప్ప వేరే మార్గం లేదని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగానే దేశీయంగా రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్ల ఉత్పత్తికి ముందుకు వచ్చే కంపెనీలను ప్రోత్సహించాలని నిర్ణయించింది.

ఎలక్ట్రిక్‌ ట్రక్కులకు ప్రోత్సాహం

సరుకుల రవాణ రంగంలో విద్యుత్‌ బ్యాటరీలతో పనిచేసే ట్రక్కులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం పీఎం ఈ-డ్రైవ్‌ పథకం కింద రూ.500 కోట్లతో ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఈ పథకం కింద ఒక్కో ఎలక్ట్రిక్‌ ట్రక్కు కొనుగోలుపై రూ.9.6 లక్షల వరకు ప్రత్యేక డిస్కౌంట్‌ లభిస్తుందని కుమార స్వామి ప్రకటించారు. అయితే ఈ డిస్కౌంట్‌ను ట్రక్కు కొనుగోలుదారునికి కాకుండా వాటిని తయారు చేసే కంపెనీలకు ఇస్తామన్నారు.

Updated Date - Jul 12 , 2025 | 03:25 AM