Share News

IMF Gita Gopinath: ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండీ గీతా గోపీనాథ్ పదవికి గుడ్ బాయ్..

ABN , Publish Date - Jul 22 , 2025 | 08:25 AM

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)లో కీలక పదవిలో ఉన్న భారత సంతతికి చెందిన గీతా గోపీనాథ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆగస్టు చివర్లో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి గుడ్‌బై చెప్పబోతున్నట్లు తెలిపారు.

IMF Gita Gopinath: ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండీ గీతా గోపీనాథ్ పదవికి గుడ్ బాయ్..
IMF Gita Gopinath

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సంస్థ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌ గీతా గోపీనాథ్ (Gita Gopinath) తన పదవి గురించి కీలక ప్రకటన చేశారు. ఈ ఆగస్టు చివరిలో తన పదవిని వీడి, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా తిరిగి చేరనున్నట్లు సోమవారం ప్రకటించారు. భారత సంతతికి చెందిన అమెరికన్ పౌరురాలైన గీతా, ఐఎంఎఫ్‌లో తన ప్రస్థానాన్ని 2019లో చీఫ్ ఎకనామిస్ట్‌గా ప్రారంభించారు. ఆ స్థానంలో మొదటి మహిళగా చరిత్ర సృష్టించిన ఆమె, 2022 జనవరిలో మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు.


ఐఎంఎఫ్‌లో గీతా గోపీనాథ్ ప్రస్థానం

గీతా గోపీనాథ్ ఐఎంఎఫ్‌లో చేరినప్పటి నుంచి సంస్థకు తన అసాధారణ నైపుణ్యంతో ఎన్నో విజయాలను అందించారు. కోవిడ్ మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి ప్రపంచ ఆర్థిక సంక్షోభాల సమయంలో ఆమె నాయకత్వం ఐఎంఎఫ్‌కు దిశానిర్దేశం చేసింది. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జివా, గీతాను అసాధారణ బౌద్ధిక నాయకురాలని కొనియాడారు. గీతా స్పష్టమైన ఆలోచనలతో, ఉన్నత ప్రమాణాలతో ఐఎంఎఫ్ విశ్లేషణలను నడిపించారు. సంక్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో ఆమె పనితీరు అద్భుతమని జార్జివా అన్నారు.


కీలక రంగాల్లో..

గీతా ఐఎంఎఫ్‌లో ఆర్థిక, ద్రవ్య విధానాలు, రుణాలు, అంతర్జాతీయ వాణిజ్యం వంటి కీలక రంగాల్లో విశ్లేషణాత్మక పనులను పర్యవేక్షించారు. ఆమె నాయకత్వంలో ఐఎంఎఫ్ అనేక సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొంది. గీతా తన సేవలను గుర్తుచేసుకుంటూ, ఐఎంఎఫ్‌లో పనిచేయడం జీవితంలో ఒకసారి వచ్చే అవకాశం. తనని చీఫ్ ఎకనామిస్ట్‌గా నియమించిన క్రిస్టీన్ లగార్డ్‌కు, తన పనిని ప్రశంసించిన క్రిస్టలీనా జార్జివాకు కృతజ్ఞతలు తెలియజేశారు.


హార్వర్డ్‌కు తిరిగి రాక

గీతా గోపీనాథ్ ఇప్పుడు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా తిరిగి చేరనున్నారు. ఆమె నిర్ణయం ఐఎంఎఫ్‌లోని కొందరిని ఆశ్చర్యపరిచినప్పటికీ, ఇది ఆమె సొంత ఆలోచనతో తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోంది. హార్వర్డ్‌లో ఆమె అంతర్జాతీయ ఆర్థిక శాస్త్రం, మాక్రో ఎకనామిక్స్ రంగాల్లో పరిశోధనలను కొనసాగించనున్నారు. అలాగే, తదుపరి తరం ఆర్థికవేత్తలను తీర్చిదిద్దే బాధ్యతను కూడా స్వీకరించనున్నారు. అకాడమిక్స్‌లో నా మూలాలకు తిరిగి వెళ్లడం సంతోషంగా ఉందని, ప్రపంచ సవాళ్లను పరిష్కరించేందుకు పరిశోధనలు చేయడం, యువ ఆర్థికవేత్తలకు శిక్షణ ఇవ్వడం నా లక్ష్యమని గీతా అన్నారు.


ఐఎంఎఫ్‌లో మార్పులు

గీతా గోపీనాథ్ నిష్క్రమణతో ఐఎంఎఫ్‌లో కొత్త ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌ను నియమించే బాధ్యత క్రిస్టలీనా జార్జివాపై ఉంది. ఈ నియామకం కోసం అమెరికా ట్రెజరీ శాఖ సిఫారసు చేసే అభ్యర్థి కీలకం కానుంది. సాంప్రదాయకంగా, ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌ను యూరోపియన్ దేశాలు ఎంచుకుంటాయి. అయితే ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌ను అమెరికా సిఫారసు చేస్తుంది. ప్రస్తుతం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునర్‌నిర్మించేందుకు, విదేశీ దిగుమతులపై అధిక సుంకాలు విధించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ నియామకం ఆసక్తికరంగా మారింది.

సిఫారసు చేసే అవకాశం

అమెరికా ట్రెజరీ శాఖ గీతా స్థానంలో కొత్త అభ్యర్థిని సిఫారసు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయం కూడా ట్రంప్ పరిపాలన దృష్టిలో ఉంది. హార్వర్డ్‌లో పాలన, నియామకాలు, ప్రవేశ విధానాలను మార్చాలని ట్రంప్ డిమాండ్ చేసినప్పటికీ, విశ్వవిద్యాలయం ఆ డిమాండ్లను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో గీతా హార్వర్డ్‌కు తిరిగి వెళ్లడం విశేషం.


ఇవి కూడా చదవండి

ఈ వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 22 , 2025 | 08:29 AM