Policy Loan Process: ఎల్‌ఐసీ పాలసీపై లోన్ తీసుకోవచ్చా.. అందుకోసం ఏం చేయాలి..
ABN , Publish Date - Jul 02 , 2025 | 05:01 PM
మీరు తీసుకున్న బీమా పాలసీ మీకు ఆర్థిక భద్రతను మాత్రమే కాదు, అవసరమైన సమయంలో లోన్ తీసుకునే అవకాశాన్ని కూడా ఇస్తుంది. అవును, మీరు చదివింది నిజమే. ఈ క్రమంలో LIC పాలసీ మీద లోన్ (Policy Loan Process) ఎలా తీసుకోవాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలో అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) వివిధ ఆదాయ వర్గాల వారికి పలు రకాల జీవిత బీమా పథకాలను అందిస్తుంది. ఎల్‌ఐసీ పాలసీలు బీమా సంరక్షణతో పాటు సంపద వృద్ధికి కూడా ఉపయోగపడతాయి. దీంతోపాటు కొన్ని ఎల్‌ఐసీ పాలసీలను లోన్ (Policy Loan Process) తీసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. అర్జెంటుగా డబ్బు అవసరమైనప్పుడు మీ ఎల్‌ఐసీ పాలసీ ద్వారా రుణం పొందవచ్చు. దీనికోసం ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే పాలసీపై లోన్ తీసుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, ఏం కావాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
లోన్‌కు అర్హత ఏంటి
ఎల్‌ఐసీలో అన్ని పాలసీల లోన్‌కు అర్హత ఉండదు. కేవలం ఎండోమెంట్ పాలసీలకు మాత్రమే లోన్ తీసుకునే ఛాన్సుంది. ఎండోమెంట్ పాలసీ అనేది బీమా సంరక్షణతో పాటు పొదుపు సౌకర్యాన్ని కలిగి ఉంటుంది. లోన్ పొందాలంటే, మీరు కనీసం మూడు సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించి ఉండాలి. పాలసీ రకం, చెల్లించిన ప్రీమియం మొత్తం, పాలసీ ఎంత కాలం ఉంటుందనే విషయాలను పరిగణలోకి తీసుకుని లోన్ మొత్తం డిసైడ్ చేస్తారు. సాధారణంగా ఎల్‌ఐసీ సరెండర్ విలువలో 85% నుంచి 90% వరకు లోన్‌గా వస్తుంది. ఉదాహరణకు మీ పాలసీ సరెండర్ విలువ రూ.1,00,000 అయితే, మీరు రూ.85,000 నుంచి రూ.90,000 వరకు లోన్ పొందవచ్చు.
లోన్ తిరిగి చెల్లించే విధానం
ఎల్‌ఐసీ పాలసీపై లోన్ తిరిగి చెల్లించే విధానం కూడా చాలా సౌలభ్యం ఉంటుంది. పాలసీ మెచ్యూరిటీ వరకు ఎప్పుడైనా లోన్‌ను తిరిగి చెల్లించుకోవచ్చు. ఒకవేళ మీరు లోన్ తిరిగి చెల్లించలేకపోతే, ఎల్‌ఐసీ మెచ్యూరిటీ లేదా క్లెయిమ్ సెటిల్‌మెంట్ సమయంలో లోన్ మొత్తం, వడ్డీని తగ్గించుకుంటుంది. కానీ లోన్ మొత్తం, వడ్డీ సరెండర్ విలువను మించిపోతే, పాలసీ రద్దయ్యే ఛాన్సుంది. దీనివల్ల బీమా సంరక్షణ కోల్పోయే అవకాశం ఉంది.
ఎల్‌ఐసీ పాలసీపై లోన్ ఎలా అప్లై చేయాలి
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం ఎలా?
ఎల్‌ఐసీ కస్టమర్ పోర్టల్ లేదా యాప్‌కు వెళ్లండి
మీ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ వివరాలతో లాగిన్ అవ్వండి
ఆన్‌లైన్ లోన్ రిక్వెస్ట్ ఆప్షన్ ఎంచుకోండి
అర్హత ఉన్న పాలసీని సెలక్ట్ చేయండి
లోన్ మొత్తాన్ని నమోదు చేసి, మీ అప్లికేషన్ సమర్పించండి
ఆమోదం పొందిన తర్వాత, మీ లోన్ మొత్తం మీ బ్యాంక్ ఖాతాకు జమ అవుతుంది.
ఆఫ్‌లైన్‌లో అప్లై చేయడం ఎలా
మీ సమీపంలో ఉన్న ఎల్‌ఐసీ బ్రాంచ్‌కు వెళ్లండి
ఎల్‌ఐసీ పాలసీ బాండ్, మీ ఫోటో గుర్తింపు కార్డు, లోన్ దరఖాస్తు ఫారమ్, క్యాన్సిల్ చెక్‌ను సమర్పించండి
మీ అప్లికేషన్ ధృవీకరణ తర్వాత సంస్థ లోన్‌ను ఆమోదించి, అందుకు సంబంధించిన మొత్తాన్ని మీ ఖతాకు జమ చేస్తుంది
ఇవి కూడా చదవండి
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి గుడ్ న్యూస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి