Gold: కనకమహా ‘లక్ష’...
ABN , Publish Date - Jul 27 , 2025 | 11:14 AM
బ్రహ్మాండం బద్దలై.. భూమి పుట్టినప్పుడు పుట్టింది. నాగరికతల్లో మెరిసింది. రాజులు, రాజ్యాల్లో మురిసింది. ఆంగ్లేయుల్ని ఆకట్టుకుంది. ఆధునికులకు ఆభరణంలా మారింది. ఆ దేశం ఈ దేశం అనేం లేదు.. ప్రపంచమంతా మెచ్చింది. ఎప్పటికప్పుడు తనకు తాను విలువను పెంచుకుంటూ.. దూసుకెళుతున్న ఆ లోహం.. ‘బంగారం’.

బ్రహ్మాండం బద్దలై.. భూమి పుట్టినప్పుడు పుట్టింది. నాగరికతల్లో మెరిసింది. రాజులు, రాజ్యాల్లో మురిసింది. ఆంగ్లేయుల్ని ఆకట్టుకుంది. ఆధునికులకు ఆభరణంలా మారింది. ఆ దేశం ఈ దేశం అనేం లేదు.. ప్రపంచమంతా మెచ్చింది. ఎప్పటికప్పుడు తనకు తాను విలువను పెంచుకుంటూ.. దూసుకెళుతున్న ఆ లోహం.. ‘బంగారం’. ప్రతి ఇంట్లో కనకమహాలక్ష్మిలా ‘లక్ష’ణంగా వెలిగిపోతున్న పుత్తడి లక్ష రూపాయల (తులం) మైలురాయిని దాటేసిందిప్పుడు.. బంగారం ఎంత ఖరీదైనదో.. దాని పుట్టుపూర్వోత్తరాలు అంతే విలువైనవి.. ఆసక్తికరమైనవి...
కాలానికి స్వర్ణయుగం.. ఐశ్వర్యానికి కనకమహాలక్ష్మి.. కూతురైతే బంగారుతల్లి అని ముచ్చటగా పిలుచుకుంటాం. అదీ స్వర్ణానికున్న శక్తి.. నాగరికత మొదలైనప్పటి నుంచీ వన్నెతగ్గని లోహం ఏదైనా ఉందంటే అది పుత్తడే!. అందుకే ‘బంగారం బంగారమే’ అనే రాచమకుట కిరీటం ధరించింది. తరాలు మారినా దాని ధగధగలు తగ్గడం లేదు. బంగారాన్ని వాణిజ్య కోణంలో విశ్లేషిస్తే.. ధరల పెరుగుదలకు సవాలక్ష కారణాలు కనిపిస్తాయి. కరోనా మహమ్మారి, రష్యా- ఉక్రెయిన్, పశ్చిమాసియాలో యుద్ధాలు భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలను పెంచాయి.
ముందుచూపుతో పలు దేశాల కేంద్ర బ్యాంకులు అప్రమత్తమయ్యాయి. భండాగారాలను బంగారంతో నింపుకొన్నాయి. మరో పక్క అమెరికా రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లను మూడుసార్లు తగ్గించింది. డాలర్ బలపడి, రూపాయి బలహీనమైంది. ‘సుంకాల రాయుడు ట్రంప్’ వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలు సైతం ప్రపంచ వాణిజ్యాన్ని ఇరకాటంలో పడేశాయి. ఇలాంటి అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ‘అపరంజి’ ధరల పెరుగుదలకు ఆజ్యం పోసినట్లయ్యింది. ఇంకేముంది? అసలే బంగారం.. ఆపై నిత్య డిమాండ్.. తులం రూ. లక్ష మైలురాయి దాటేసింది.
పడినా.. లేచినా..
బంగారు ధరల చరిత్రలోకెళితే.. 1980లో తులం రూ.1300.. మరో పదేళ్లకు రూ.3,200, ఆ తర్వాత 2002లో ఐదు వేలకు చేరింది. అమెరికాలో 2007 నాటి సబ్‌ప్రైమ్ సంక్షోభం ఆర్థిక మాంద్యానికి దారితీసింది. ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. భారత్‌లో సెన్సెక్స్ అంతకంతకు దిగజారింది. 2008-09లో 38 శాతం స్టాక్‌మార్కెట్ పడింది. పసిడి మాత్రం హఠాత్తుగా24 శాతం పెరిగింది. 2010 దీపావళి వెలుగుల్లో మెరుస్తూ.. రూ.20 వేల మైలురాయిని దాటింది. కొన్నేళ్లకు బంగారం రేటు మళ్లీ పడుతూ వచ్చింది. 2013-15 మధ్య తులం రూ.30 వేల నుంచి ఏకంగా రూ.26 వేలకు వచ్చేసింది. మళ్లీ పుంజుకుంది. 2020లో రూ.40 వేలకు వెళ్లింది. గత పదేళ్లలో సగటున ఏడాదికి రూ.7 వేలు పెరిగిందీ పుత్తడి. ఇంత సంక్షోభంలోనూ సగటు వార్షిక రాబడి గత ఏడాది కాలంలో 35 శాతం, మూడేళ్ల కాలంలో 22 శాతం, ఐదేళ్లలో 18 శాతం, పదేళ్లలో 12 శాతం వృద్ధిని నమోదు చేసింది. అదే సమయంలో స్టాక్ మార్కెట్ ఏడాదిలో 25, మూడేళ్లలో 12, ఐదేళ్లలో 16, పదేళ్లలో 12 శాతం రాబడి ఇచ్చింది. అత్యవసర- ఆకస్మిక పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్- స్వర్ణం రేటు రేచుక్క- పగటిచుక్కల్లా వ్యతిరేక దిశల్లో కదులుతాయి. కాలం కలవరపెట్టకపోతే కవలపిల్లల్లా కూడబలుక్కుని ముందుకెళతాయి.
బంగారం కేవలం నగల తయారీకే కాదు.. పరిశ్రమల్లోనూ వాడుతున్నారు. బంగారానికి ఉన్న ప్రత్యేక రసాయన, భౌతిక లక్షణాల కారణంగా అనేక పారిశ్రామిక ప్రక్రియల్లో ఉత్ర్పేరకంగా ఉపయోగిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్, రక్షణ, అంతరిక్ష, వైద్య, ఆటోమోటివ్ పరిశ్రమలలో స్వర్ణ వినియోగం అధికం. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటి ఎలకా్ట్రనిక్ పరికరాలలో సెమీకండక్టర్ చిప్‌లకు బంగారు పూత పూస్తారు.. సన్నని కీలక తీగలను స్వర్ణంతో చేస్తారు. అందుకే, పసిడి ధర పెరుగుదల ప్రభావం ఎలకా్ట్రనిక్స్‌పై పడుతుంది. పసిడిజరీతో నేసిన కాంచీపురం చీరలు కూడా పుత్తడి ధర మీద ఆధారపడి ఉంటాయి.
ఎలా పుట్టింది?
బంగారం.. బ్రహ్మాండం నుంచి వచ్చింది. నక్షత్రాలు ‘నెబ్యులా’ అని పిలిచే వాయువు, ధూళి నుంచి పుట్టాయి. అవి ‘ప్రోటోస్టార్’గా ఏర్పడి ప్రధాన శ్రేణిగా మారాయి. నక్షత్రాల పరిమాణాన్ని బట్టి వివిధ దశల గుండా వెళ్లినట్లు ఖగోళశాస్త్రవేత్తల అంచనా. ఆ దశలే ‘రెడ్ జెయింట్’, ‘ప్లానెటరీ నెబ్యులా’, ‘వైట్ డ్వార్ఫ్’, ‘బ్లాక్ డ్వార్ఫ్’, ‘రెడ్ సూపర్‌జెయింట్’, ‘సూపర్‌నోవా’, ‘న్యూట్రాన్ స్టార్’, ‘బ్లాక్‌హోల్’ అన్న పేర్లొచ్చాయి. నక్షత్రాలు హైడ్రోజన్ వల్లే ప్రకాశిస్తాయి. అణు సంయోగంతో హైడ్రోజన్ క్రమేపీ హీలియం, కార్బన్, ఆక్సిజన్, ఐరన్ మూలకాలను తయారుచేస్తుంది. ఇనుము నక్షత్ర కేంద్రం శక్తి, గురుత్వాకర్షణను హరిస్తుంది.
ఇనుము మూలంగా ఒక నక్షత్ర ద్రవ్యరాశి సూర్యుడి ద్రవ్యరాశి కన్నా 8 నుంచి 10 రెట్లు పెరిగినప్పుడు ఆ నక్షత్రం పేలిపోయి.. బాహ్యవలయాలను రోదసీలోకి వెదజల్లుతుంది. ఫలితంగా నక్షత్ర విస్ఫోటనం జరిగే కొన్ని ఘడియలలోనే అపారమైన శక్తితో న్యూట్రాన్‌లు విడుదలై.. అణు ప్రతిచర్యలను జరపడంతో అనేక మూలకాలు ఏర్పడ్డాయి. సూపర్నోవా న్యూక్లియోసింథసిస్ అనే ప్రక్రియ ద్వారా లేక న్యూట్రాన్ నక్షత్రాలు ఢీకొనడం వల్లా బంగారం, వెండి, యురేనియం, టైటానియం, జింక్ వంటివి ఉత్పన్నం అయ్యాయి. ఈ మూలకాలన్నీ నక్షత్ర మండలం మధ్య ఖాళీ ప్రదేశంలో ధూళి రూపంలో చెల్లాచెదురుగా ఉండేవి. కొన్నేళ్ళకు గట్టిపడి కొత్త నక్షత్రాలు, గ్రహాలుగా ఏర్పడ్డాయి. చివరికి కోట్ల ఏళ్ల క్రితం సౌర వ్యవస్థ, భూమిని ఏర్పరిచే పదార్థాలలో ఈ మూలకాలు భాగమయ్యాయి. భూకంపాలు, అగ్నిపర్వతాలు భూమిలోపల ఒత్తిడి, ఉష్ణోగ్రతలలో మార్పులకు కారణమై... భూమి అట్టడుగున ఉన్న స్వర్ణ లోహాలను రాతి ఉపరితలాలపై పేరుకుపోయేలా తోడ్పడ్డాయి. అంటే భూమి పుట్టినప్పుడే బంగారం పుట్టిందన్న మాట!.
పురాణాలలో పుత్తడి..
బంగారంకంటే ప్రాచీనమైనదేముంది? అందుకే ప్రపంచ పురాణేతిహాసాలన్నీ బంగారం విలువను చాటిచెప్పాయి. ఆఫ్రికన్, చైనీస్, ఈజిప్షియన్, పర్షియన్, గ్రీకు పురాణాల ప్రకారం పురాతన నాగరికతలలో బంగారాన్ని దైవిక అంశంగా భావించి పూజించి, ఆభరణాలుగా ధరించేవారనడానికి ఆనవాళ్లున్నాయి. ఐశ్వర్యానికి, శ్రేయస్సుకు ప్రతీకగా.. సంపద, సౌందర్యానికి చిహ్నంగా ఉండే బంగారాన్ని లక్ష్మీదేవి ప్రతిరూపంగా కొలుస్తారు. గ్రీకు పురాణాల్లో.. సూర్యుడు హీలియోస్ అనే పేరుతో, బంగారు రథంపై ఆకాశంలో ప్రయాణించే దేవుడిగా వర్ణించబడ్డాడు. బంగారం, సూర్యుడు, రెండూ శక్తి, శ్రేయస్సు, శాశ్వతత్వానికి చిహ్నాలే కదా!. ప్రతి రోజు 8 బారువుల బంగారాన్ని (76 కి.గ్రా.) ఇచ్చే శ్యమంతకమణి సూర్యునిచే సత్రాజిత్తునకు ఇవ్వబడింది.
విశ్వానికి కేంద్రంగా భావించే మేరు పర్వతం బంగారమేనని హిందూ, జైన, బౌద్ధ మతస్తుల నమ్మకం. దేవశిల్పి విశ్వకర్మ, బ్రహ్మదేవుని కోసం బంగారు పుష్పక విమానాన్ని... రావణబ్రహ్మ కోసం పుత్తడితో లంక నగరాన్ని నిర్మించాడు. మారీచుడు బంగారు లేడిగా మారకపోతే రామాయణం ఉండేదా?. ధర్మరాజు యజ్ఞం చేయకపోతే బంగారు ముంగిస ఉండదు. సృంజయుడికి నారదుడు వరం ఇవ్వకపోతే సువర్ణష్ఠీవి ప్రస్తావనే ఉండదు. మరుత్తుడు యజ్ఞం చేశాక మిగిలిన బంగారంతో పాండవులు అశ్వమేధ యాగం నిర్వహించారట. ‘కనకపు సింహాసనంబున’ రాజులు కూర్చునేవారని విన్నాం. పెద్దనలాంటి విద్వాంసులకు రాజాస్థానంలో గండపెండేరం తొడిగేవారు. ఎంత బంగారం ఉంటే ఆ రాజ్యం అంత సుభిక్షం అన్నమాట. పూర్వం శత్రు రాజ్యం తమపై దండెత్తితే ముప్పు అనుకుని.. భాండాగారంలోని పుత్తడిని పుడమిలో పూడ్చిపెట్టేవారు రాజులు. అదృష్టవశాత్తూ ఏ రైతన్న నాగలికో తగిలినప్పుడు, నేల మాలిగలలోని లంకెబిందెలు బయటపడేవి. చారిత్రక ప్రాంతాలు, ఆలయాల చుట్టు పక్కల భూమిని తవ్వి గుప్త నిధుల కోసం వెతికిన సంఘటనలను ఇప్పటికీ చూస్తున్నాం.
కనకం కోసం కట్టుకున్నవాడితో కయ్యానికి దిగిన కాంతలు అక్కడక్కడ ఉంటున్నారు కానీ.. పూర్వం పసిడి కోసం పెద్ద పోరులే జరిగాయి. క్రీ.పూ 433లో పర్షియన్ సామ్రాజ్యంపై అలెగ్జాండర్ దండెత్తి అక్కడి బంగారు సంపదను వశపరచుకున్నాడు. క్రీ.పూ 58-50 మధ్య జూలియస్ సీజర్ చేసిన గాలుక్ యుద్ధాలతో గౌల్ సామ్రాజ్యాన్ని (నేటి ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ, స్విట్జర్లాండ్) జయించి అక్కడి నుంచి బంగారాన్ని రోమ్‌కి తరలించాడు. 14వ శతాబ్దంలో ‘ఇంకా’ (దక్షిణ అమెరికా), ‘అజ్టెక్’ (మెసోఅమెరికా) సామ్రాజ్యాలపై స్పెయిన్ దండయాత్ర చేసి టన్నుల బంగారాన్ని దోచుకుంది.
కాలిఫోర్నియా గోల్డ్ రష్
క్రీ. పూ 3వ సహస్రాబ్దికి చెందిన దక్షిణ జార్జియాలోని ‘సక్ర్దిసి’ గనుల ప్రదేశం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది. 12ఏళ్ల కాన్రాడ్ రీడ్ అనే కుర్రాడు పొలంలో 8 కేజీల బంగారు ముక్క కనుక్కోవడంతో.. 1799లో నార్త్ కరోలినా గోల్డ్ రష్ (బంగారం వేట) ప్రారంభమైంది. అమెరికాలో తొలిసారి గోల్డ్ మైనింగ్‌కు దారితీసింది. నార్త్ కరోలినా అమెరికాలో బంగారం ఉత్పత్తి చేసే ఏకైక రాష్ట్రంగా మారడంతో.. వలసదారుల జనాభా పెరిగింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మారిపోయింది. కాలంతోపాటూ కరోలినా కనకపు గనులు కరిగిపోవడమూ, మరోపక్క కాలిఫోర్నియాలో కుందనపు ఖజానా కనుగొనడం కాకతాళీయమే! 1848 - 1855 మధ్య దాదాపు లక్షల మంది కాలిఫోర్నియాకు వలస వెళ్లారు. గోల్డ్ రష్ కాలిఫోర్నియా జనాభా, చరిత్ర, ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధిని ప్రభావితం చేయడంతో 1850లో కాలిఫోర్నియా 31వ రాష్ట్రంగా అవతరించింది. ఆస్ట్రేలియాకు చెందిన కార్మికుడు జార్జ్ హారిసన్ 1885లో జోహన్నెస్‌బర్గ్ సమీపంలో ఇల్లు కట్టడానికి రాళ్లను తవ్వుతుండగా, స్వర్ణ ఖనిజాన్ని కనుగొన్నాడు. ఇది దక్షిణాఫ్రికా బంగారు గనుల తవ్వకాలకు ఆజ్యం పోసింది.
కాలిఫోర్నియా గోల్డ్ రష్ .. జనవరి 24, 1848 నాడు సియెర్రా నెవాడా పర్వత ప్రాంతాల్లోని ఒక సామిల్ నిర్మాణం ద్వారా మొక్కజొన్న రేకు పరిమాణంలో దొరికిన ఒక సన్నని లోహపు ముక్క అమెరికా చరిత్రను ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను మార్చివేసింది. భూమిలో బంగారం దొరికిందన్న వార్త దావానలంలా వ్యాపించడంతో అన్వేషకులు పుత్తడిని పొందడానికి పలుగూ- పారలతో పోటీపడీ పరుగులంకించారు. ‘కాలిఫోర్నియా గోల్డ్ రష్’ అనబడే వలసల ప్రవాహానికి దారితీసింది. ఎంత చెడ్డా మానవులం కదా! పైగా పెట్టుబడిదారీ వ్యవస్థ అమెరికాది. స్వార్థం పురులు విప్పదూ? అర్ధబలం అంగబలమున్నోళ్ల ఆశల దెయ్యాలు జడలు విప్పాయి. బంగారు నిక్షేపాల కోసం తవ్వకాలు మొదలయ్యాయి. భూస్వాములు, మైనింగ్ సంస్థలు రంగంలోకి దిగి సింహభాగం బంగారాన్ని చేజిక్కుంచుకున్నాయి.
కోలార్ గోల్డ్ ఫీల్డ్ఫ్
భారత్‌లోని అతి పురాతన బంగారు గనులుగా కర్ణాటకలోని ‘కోలార్ గోల్డ్ ఫీల్డ్ఫ్’ ప్రసిద్ధి. 2 వేల సంవత్సరాలకు పైగా ‘కెజీఎఫ్’లో కనకం కొల్లగొట్టారు. 2వ శతాబ్దానికి ముందు చిన్న గుంతలు తవ్వుకుని పుత్తడిని వెలికితీసేవారు. హరప్పా, మొహెంజో-దారో నాగరికతలలో లభించిన ఆభరణాలను విశ్లేషించినప్పుడు.. అవి కోలార్ నుంచి వెలికితీసిన బంగారమని తేలింది. అది 1790ల మాట. కోలారువాసులు బెంగళూరుకి ఎద్దుల బండిపై వచ్చిపోతుండేవారట. ఆ ఎడ్ల బండ్ల చక్రాలు మెరుస్తూండటం బ్రిటిష్ అధికారులు గమనించారు. వెంటనే రంగంలోకి దిగి పరిశోధించారు. బండి చక్రాలకు అతుక్కున్న మట్టిలో బంగారపు అణువులు ఉన్నట్లు గుర్తించారు.
చోళులు, విజయనగర సామ్రాజ్యం, టిప్పు సుల్తానుల పాలనా కాలంలో ప్రజలు భూమిని చేతులతో తవ్వి బంగారం వెలికి తీసేవారన్న విషయాన్ని కూడా బ్రిటీషువారు తెలుసుకున్నారు. 1799లో శ్రీరంగపట్టణ యుద్ధంలో టిప్పు సుల్తాన్‌ను హతమార్చి.. కోలార్ ప్రాంతాన్ని వశపరచుకుని.. మైకేల్ ఫిట్జ్ అనే అధికారి నేతృత్వంలో తవ్వకాలు చేపట్టారు ఆంగ్లేయులు. అయితే 1804 నుంచి 1880 వరకు బంగారం చిక్కలేదు. ఆ తర్వాత జాన్ టేలర్ సన్స్ గనులను లీజుకి తీసుకుని అధునాతన యంత్రాల ద్వారా స్వర్ణాన్ని వెలికితీయడం ప్రారంభించారు. 1902లో విద్యుదీకరణ చేసిన మొదటి పారిశ్రామికవాడగా కెజిఎఫ్ గుర్తింపు పొందింది. ముప్పై వేల మంది గని కార్మికుల కుటుంబాలకు ఆశ్రయం లభించిందిక్కడ.
బ్రిటిష్ అధికారులు బంగ్లాలు నిర్మించుకుని నివాసం ఏర్పాటు చేసుకోవడంతో కెజిఎఫ్‌కు ‘లిటిల్ ఇంగ్లాండ్’ అనే పేరొచ్చింది. 1956లో దీనిని జాతీయం చేసి ‘భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్’ (బిజీఎంఎల్)కు అప్పగించారు. చిత్త నేలలో దుక్కి, పుటం పెట్టిన పుత్తడిని 900 టన్నులకు పైగా తీశాక బంగారు నిక్షేపాలు క్రమంగా క్షీణించాయి. అరకాసు పనికి ముప్పాతిక బాడుగ అన్న చందాన బంగారం ఉత్పత్తి తగ్గి వెలికితీత ఖర్చులు పెరిగాయి. ఆర్థిక నష్టాలతో పాటూ పర్యావరణ సమస్యల వల్ల 28 ఫిబ్రవరి 2001న కెజీఎఫ్‌ని భారత ప్రభుత్వం మూసివేసింది. కోలార్ బంగారు గనుల దారిలోనే అనంతపురం జిల్లాలోని రామగిరి ప్రాంతంలో యెప్పమన బంగారు గనులలోనూ, చిత్తూరు జిల్లాలోని చిగర్‌గుంట గనులలోనూ తవ్వకాలు ఆగిపోవడంతో.. గోల్డ్ మైనింగ్ సంస్థ ‘బిజీఎంఎల్’ మూతపడింది.
మైనింగ్ ప్రక్రియ..
బంగారు గనుల్లో తవ్వితీసిన ఖనిజాల నుంచి రెండు ప్రధాన పద్ధతుల ద్వారా స్వర్ణం సేకరిస్తారు. బంగారు ధాతువులను పాదరసంతో కలిపి కరిగించాక, బాష్పీభవనం చేస్తారు.... పాదరసం ఆవిరై బంగారు రేణువులు మాత్రమే మిగిలిపోతాయి. పాదరసం కాలుష్య కారకంగా గనులను పర్యావరణాన్ని ప్రభావితం చేస్తుంది. పెద్ద స్థాయి మైనింగ్ సంస్థలు ఆధునికంగా, బంగారు ధాతువులను సైనైడ్ ద్రావణంతో సమ్మేళనం చేయగానే బంగారం ప్రత్యక్షమవుతుంది. ఈ ప్రక్రియను నైపుణ్యంతో చేస్తే పర్యావరణ హాని స్వల్పంగా ఉంటుంది.
మొత్తంగా చూస్తే 4,10,000 మెట్రిక్ టన్నుల కనకం భూగర్భంలో ఉందని నిర్దారించారు శాస్త్రవేత్తలు. ఇప్పటివరకు 2,20,000 మెట్రిక్ టన్నుల బంగారాన్ని వెలికితీశారు, ఎక్కువ భాగం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, చైనా నుంచి వచ్చింది. ప్రస్తుతం భూగర్భ గని నిల్వలు 1,90,000 మెట్రిక్ టన్నులు ఉండగా ఆస్ట్రేలియా, రష్యా, దక్షిణాఫ్రికా, అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పెరూలో సింహభాగం ఉన్నాయి. దేశీయంగా బంగారు గనుల నిల్వల విషయంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లదే అగ్రస్థానం. జార్ఖండ్, బిహార్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్‌లలో గణనీయమైన బంగారు గనులున్నాయి. ప్రస్తుతం దేశంలో బంగారాన్ని ఉత్పత్తి చేసే ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ ‘హట్టి గోల్డ్ మైన్స్ లిమిటెడ్’ (హెచ్‌జీఎంఎల్) రాయచూర్ జిల్లాలోని హుట్టి, హిరా-బుద్దిని గనులను తవ్వితీస్తోంది. ‘మన్మోహన్ మినరల్ ఇండస్ట్రీస్’ సంస్థ జార్ఖండ్‌లోని కుందర్ కోచాలోనూ, ‘జియోమైసోర్ సర్వీసెస్’ కర్నూలు జిల్లాలో జొన్నగిరి గ్రామంలో ‘డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్’ (డిజిఎంఎల్) కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోనూ బంగారం అన్వేషణ, మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
పలు రూపాల్లో..
స్వచ్ఛమైన, అధిక క్యారెట్ల బంగారం లభ్యత వల్ల ఆసియా, మధ్యప్రాచ్య మార్కెట్లకు ఆదరణ ఆధిపత్యం అధికం. ప్రపంచం మొత్తంలో 55 శాతం వాటాతో భారత్, చైనా అతిపెద్ద బంగారు ఆభరణాల మార్కెట్‌గా అవతరించాయి. ప్రపంచంలో ఉన్న ముడి బంగారంలో సగం ఆభరణాల పరిశ్రమ వినియోగిస్తూ తళుకు బెళుకు సోయగాలతో కొనుగోలుదారులను కనువిందు చేస్తోంది. పావు వంతు బంగారం పెట్టుబడులు రూపంలో ఉన్నది. బిస్కట్లు, కడ్డీలు, నాణేలు వంటి భౌతిక రూపంలో, గోల్డ్ బాండ్స్, మ్యూచువల్ ఫండ్లు, ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్లు ద్వారా డిజిటల్ ఆకృతిలోనూ పెట్టుబడులు ఉన్నాయి. భౌతికంగా నిల్వ చేసుకునే బాధ్యత లేకుండా భద్రతను, వశ్యత, త్వరితంగా క్షణాల మీద విక్రయించే ద్రవ్యత సౌలభ్యం డిజిటల్ గోల్డ్‌కున్న ప్రయోజనాలు. అయితే భౌతికంగా ఒంటిమీదో, బీరువాలోనో, బ్యాంక్ లాకర్‌లోనో బంగారం ఉంచుకోడానికి అత్యధిక మదుపరులు మొగ్గుచూపుతున్నారు. పసిడి తమ అధీనంలో ఉంటే స్పష్టమైన యాజమాన్యం, స్వయంప్రతిపత్తి, పరపతి, ప్రతిష్టతో పాటూ అదో తృప్తినిస్తుంది. ఇలా బంగారం గురించి చర్చిస్తూపోతే పెద్ద గ్రంథాలే రాయొచ్చు. ఆ విలువ అపారం.. శాశ్వతం. నిజంగా బంగారం బంగారమే!. దానికి ఏ లోహమూ సాటి రాదు.. రానేరాదు.
- సునీల్ ధవళ, 9741747700, సీయీవో, ద థర్డ్ అంపైర్ మీడియా అండ్ అనలిటిక్స్
- బంగారపు ధరలను నిర్ణయించే ప్రధాన సంస్థ ‘ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్’. ప్రపంచ మార్కెట్ ధోరణులు-అంతర్జాతీయ స్పాట్ ధర, దిగుమతి సుంకాలు-కరెన్సీ హెచ్చుతగ్గులు, సరఫరా-డిమాండ్, ద్రవ్యోల్బణం-వడ్డీ రేట్లు, భౌగోళిక రాజకీయ సంఘటనలు-ప్రభుత్వ విధానాలు, పండుగలు- వివాహల వంటి సీజనల్ కారకాలను పరిగణనలోకి తీసుకుని దేశంలో బంగారం రేటును ‘ఐబీజేఏ’ నిర్ణయిస్తుంది.
- "carat ' & "karat ' అనే పదాల అర్థాలు చూద్దాం. స్వర్ణం స్వచ్ఛతను సూచించడానికి క్యారెట్ (k లేదా kt)తో సూచిస్తారు. వజ్రాలు, రత్నాలు, ఇతర విలువైన రాళ్ల పరిమాణాన్ని కొలవడానికి క్యారెట్ ((ct)) సూచిస్తారు. ఒక "carat '' 200 మిల్లీగ్రాములకు సమానం. ఏప్రిల్ 2023 నుంచి భారతదేశం అంతటా బంగారు ఆభరణాల హాల్‌మార్కింగ్ తప్పనిసరి. ‘బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్’ (బీఎస్‌ఐ) హాల్‌మార్క్ సర్టిఫికేషన్, సీల్ బంగారం యొక్క స్వచ్ఛత, ప్రామాణికతను తెలియజేస్తుంది. దేశంలో బంగారం, వెండి ఆభరణాల తయారీ లేదా విక్రయాలు చేసే జ్యుయెలరీ దుకాణాలకు ‘బీఎస్‌ఐ’ లైసెన్స్ తప్పనిసరి.
హాల్‌మార్క్ లేకుండా నగలు విక్రయించడం నేరం. ఆభరణాలలో బంగారం ఎంత శాతముందో వేసే అధికారిక ముద్ర ఇది. 24క్యారెట్ల నాణేనికి (999), 22 క్యారెట్లకు (916), 21 క్యారెట్లకు (875), 20 క్యారెట్లకు (833), 18 క్యారెట్లకు (750), 14 క్యారెట్ల నగలకు (585) హాల్‌మార్క్ ముద్ర వేస్తారు. కాడ్మియంను టంకముగా ఉపయోగించే ‘కేడిఎం’ బంగారానికి హాల్‌మార్క్ చేయరు. పైగా భారతదేశంలో ‘కేడిఎం’ బంగారాన్ని నిషేధించారు.
- బంగారం రసాయన చిహ్నం అఠ. పుత్తడి పరమాణు సంఖ్య 79, అంటే ప్రతి బంగారు అణువు కేంద్రకంలో 79 ప్రొటాన్లు ఉంటాయి. పుత్తడి పరమాణు బరువు 196.967 (amu) అణు ద్రవ్యరాశి యూనిట్లుగా కొలుస్తారు. 196.967 (Da) డాల్టన్ అని కూడా పిలుస్తారు. బంగారం 1064 సెంటీగ్రేడ్ వద్ద కరుగుతుంది. బంగారం నీటి కంటే 19.3 రెట్లు బరువు ఎక్కువ.
- ప్రాచీన కాలంలో బంగారాన్ని తూకం వేయడానికి గురివింద గింజలనే వాడేవారు. కొలతల్లో ప్రామాణికతకి నూటికి నూరుపాళ్లు ఖచ్చితత్వం వీటికే ఉంటుంది. దీనికి కారణం గురివింద గింజలన్నీ దాదాపు ఒకే బరువు (0.1215 గ్రా) ఉంటాయి.
- సూర్యునిలో దాదాపు 2.5 ట్రిలియన్ టన్నుల బంగారం ఇమిడి ఉంది, ఇది భూమి మహాసముద్రాల నన్నింటిని నింపడానికి సరిపోతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.