Gold price April 2025: అలుపన్నది లేదా సోనా
ABN , Publish Date - Apr 23 , 2025 | 12:54 AM
ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.1,01,600కు చేరింది, ఇది సరికొత్త రికార్డును నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర 3,500 డాలర్లకు చేరింది, భారత్‌లో పెళ్లి సీజన్ కూడా డిమాండ్‌ను పెంచింద

రూ.లక్ష దాటిన పసిడి ధర
ఢిల్లీలో మరో రూ.18,000 పెరిగి రూ.1,01,600కు తులం బంగారం
సరికొత్త రికార్డు గరిష్ఠానికి చేరిక
న్యూఢిల్లీ: పసిడి పరుగు ఆపట్లేదు. రూ.లక్ష మైలురాయినీ దాటేసి సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తోంది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి(99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర మంగళవారం మరో రూ.1,800 పెరిగి రూ.1,01,600కు చేరింది. 99.5 శాతం స్వచ్ఛత లోహం కూడా అదే స్థాయి లో పెరిగి రూ.1,01,100కు ఎగబాకింది. ఈ రెండు స్వచ్ఛత లోహాల రేటు రూ.లక్ష మార్క్‌ను దాటడం ఇదే తొలిసారి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు తులం బంగారం ధర రూ.22,650 (దాదాపు 29 శాతం) పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర వేగంగా పెరుగుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఇందుకుతోడు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఆభరణ వర్తకులు, స్టాకిస్టులు నిల్వలు పెంచుకునేందుకు ఎగబడుతుండటం దేశీయంగా గోల్డ్ డిమాండ్‌ను మరింత పెంచింది. ఈనెలాఖరున (ఏప్రిల్ 30) అక్షయ తృతీయ కూడా. హిందువులు ఈ పండుగను పసిడి కొనుగోలుకు మంచి రోజుగా భావిస్తారు.
3,500 డాలర్లకు ఔన్స్ గోల్డ్
అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ సరికొత్త శిఖరానికి ఎగబాకింది. స్పాట్ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ ఒక దశలో 75.55 డాలర్లు లేదా 2.2 శాతం పెరుగుదలతో 3,499.92 డాలర్ల వద్ద ఆల్‌టైం రికార్డును నమోదు చేసింది. కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు ధర ఏకంగా 83.76 డాలర్లు లేదా 2.44 శాతం వృద్ధితో తొలిసారిగా 3,500 డాలర్ల స్థాయికి చేరింది. ఔన్స్ సిల్వర్ 32.70 డాలర్ల స్థాయిలో ట్రేడైంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వడ్డీ రేట్ల తగ్గింపునకు సంబంధించి యూఎస్ ఫెడరల్ రిజర్వ్ జీరోమ్ పావెల్‌పై ఒత్తిడి తెస్తుండటం బంగారం ధరను సరికొత్త గరిష్ఠానికి ఎగదోసింది.
ఎంసీఎక్స్‌లోనూ రూ.లక్ష క్రాస్
మన మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లోనూ గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు (ఆగస్టు డెలివరీ) ధర సైతం రూ.లక్ష దాటేసింది. ఎక్స్ఛేంజ్‌లో గోల్డ్ రేటు గడిచిన ఏడాది కాలంలో 41 శాతం పెరిగింది. ఎంసీఎక్స్ 2003 నవంబరులో గోల్డ్ కాంట్రాక్ట్స్ ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అప్పట్లో 10 గ్రాముల రేటు రూ.5,858గా ఉంది. గడిచిన 21 ఏళ్లలో ధర 17 రెట్లకు పైగాపెరిగింది.