Foxconn India: 300 ఇంజనీర్లను వెనక్కి పిలిచిన ఫాక్స్‌కాన్.. మేక్ ఇన్ ఇండియాకు బ్రేక్ పడిందా..
ABN , Publish Date - Jul 03 , 2025 | 02:57 PM
భారతదేశంలో ఐఫోన్ తయారీ రంగానికి మొదటిసారి ఎదురుదెబ్బ తగిలింది. చెన్నై ఫాక్స్‌కాన్ ప్లాంట్ (Foxconn India) నుంచి 300 మందికిపైగా చైనీస్ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను అనూహ్యంగా వెనక్కి రప్పించారు. ఈ నిర్ణయం ద్వారా ఇండియాలో ఐఫోన్ల ఉత్పత్తిపై ప్రభావం చూపించనుందని నిపుణులు చెబుతున్నారు.

భారతదేశంలో ఆపిల్ ఫోన్ల తయారీ ఆశలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల ఫాక్స్‌కాన్.. తమిళనాడులోని (Foxconn India) తన ఐఫోన్ తయారీ ప్లాంట్ల నుంచి 300 మందికి పైగా చైనీస్ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను వెనక్కి పిలిచింది. నివేదికల ప్రకారం ఈ ఉపసంహరణ దాదాపు రెండు నెలల క్రితం మొదలైంది. ఈ క్రమంలో తైవావ్ నిపుణులు కాకుండా మిగతా చైనా వారిని తీసుకెళ్లారు. ఇండియాలో ఆపిల్ కంపెనీ ఆశయాలకు అడ్డంకిగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
భారతదేశంలో ఎందుకు
చైనీస్ ఇంజనీర్లు ఇప్పటివరకు ఫాక్స్‌కాన్ ఐఫోన్ తయారీ ప్లాంట్లలో కీలక పాత్ర పోషించారు. వారు కొత్త ఐఫోన్ మోడళ్ల కోసం ఉత్పత్తిని సిద్ధం చేయడం, స్థానిక కార్మికులకు శిక్షణ ఇవ్వడం, ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడ్డారు. కానీ ఇప్పుడు వారి ఆకస్మిక నిష్క్రమణ ఆపిల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రభావితం చేయనుంది. భారతదేశంలో ప్రస్తుతం ఐఫోన్ల ఉత్పత్తిని పెంచి, ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయాలని ప్లాన్ చేస్తున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.
చైనా కఠిన నియంత్రణలు
ఈ రీకాల్ వెనుక చైనా కొత్త విధానాలు ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. చైనా తన సాంకేతికత, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని ఇతర దేశాలకు, ప్రధానంగా భారతదేశం, వియత్నాం వంటి దేశాలకు బదిలీ చేయడంపై కఠిన నియంత్రణలు విధించింది. ఈ దేశాలు చైనాకు ప్రత్యామ్నాయ తయారీ కేంద్రాలుగా మారే అవకాశం ఉన్నందుకు చైనా తన సాంకేతిక జ్ఞానం, అధునాతన యంత్రాలను పోటీ దేశాలకు చేరకుండా నిరోధించేందుకు ఈ చర్యలు తీసుకుందని చెబుతున్నారు.
మేక్ ఇన్ ఇండియాపై ప్రభావం
ప్రస్తుతం, ప్రపంచ ఐఫోన్ ఉత్పత్తిలో భారతదేశం దాదాపు 20 శాతం వాటా కలిగి ఉంది. 2026 నాటికి అమెరికాలో విక్రయించే ఐఫోన్‌లలో ఎక్కువ భాగం భారతదేశంలో ఉత్పత్తి చేయాలని ఆపిల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఫాక్స్‌కాన్ భారతదేశంలో కొత్త కర్మాగారాన్ని కూడా నిర్మిస్తోంది. అయితే, నైపుణ్యం కలిగిన చైనీస్ సిబ్బంది ఉపసంహరణ ఈ ప్రక్రియను నిమ్మదింపచేస్తుంది. ఇది గడువులతోపాటు ఉత్పత్తి నాణ్యతను కూడా ప్రభావితం చేస్తుంది.
నైపుణ్యం పెంచాల్సిన
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఈ నిర్ణయం అడ్డంకిగా మారనుంది. హై టెక్ ఉత్పత్తిని పెంచే ప్రారంభ దశల్లో భారతదేశం విదేశీ నైపుణ్యంపై ఆధారపడుతోందని ఇది మరోసారి గుర్తు చేస్తుంది. స్థానిక ప్రతిభను అభివృద్ధి చేయడం, స్వయం సమృద్ధి అవసరాలను పెంచడంలో దేశీయ వనరులను మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఈ సంఘటన ప్రస్తావిస్తుంది. ఇది స్థానిక నైపుణ్యం అభివృద్ధి, మౌలిక సదుపాయాలలో పెట్టుబడులను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని సూచిస్తుంది.
ఇవి కూడా చదవండి
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి గుడ్ న్యూస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి