Simple Tips: ధనవంతులు కావాలనుకుంటే.. ఇవిగో సింపుల్ చిట్కాలు..
ABN , Publish Date - Nov 06 , 2025 | 04:07 PM
ధనవంతులు జాబితాలో చేరేందుకు సింపుల్ చిట్కాలు కొన్నే ఉన్నాయి. వాటిని ఆచరిస్తే.. ఇట్టే ఆ జాబితాలో చేరిపోవచ్చు. అందుకు పైసా ఖర్చు చేయనక్కర్లేదు. కానీ ఆ పైసానే జాగ్రత్తగా..
దేశంలో అత్యధిక శాతం మంది ప్రజలు మధ్య తరగతి జీవులే. ఉద్యోగంలో నెల నెల వచ్చే రాబడిలో ఎంతో కొంత దాచుకోవాలని అనుకుంటారు. తీరా జీతం వచ్చాక.. ఇంటి అద్దె, పాలు, నిత్యావసర వస్తువు కొనుగోలు చేయడానికే అది సరిపోతుంది. ఇక పండగ వేళ ఏదో ఆఫర్ ఇస్తున్నారంటూ ఫ్రీజ్, బైక్ లేదా మరో వస్తువు కొనుగోలు చేస్తారు. అది కూడా ఈఎంఐ పెట్టి మరీ కొంటారు. దీంతో ప్రతి నెలా ఈఎంఐ కింద కొంత నగదు తప్పకుండా చెల్లించాల్సి వస్తుంది. దాంతో నెల మధ్యలోనే జేబు ఖాళీ అయిపోతుంది. ఇంట్లో అవసరాల కోసం అప్పుల వేట ప్రారంభమవుతుంది. మధ్య తరగతి జీవులు ప్రతి నెలా పడే పాట్లే ఇవి.
అయితే దీని నుంచి బయట పడాలంటే.. జీతం పెరగకపోయినా పర్వాలేదు. కానీ, కొన్ని అలవాట్లు మార్చుకోవాలని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఆ అలవాట్లను మార్చుకుంటే.. ధనవంతులుగా మారతారని వారు స్పష్టం చేస్తున్నారు. మరి మార్చుకోవాల్సిన అలవాట్లు ఏంటి.. నిపుణులు ఏం చెబుతున్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఒకటి..
ఈ మధ్యకాలంలో క్రెడిట్ కార్డులు వినియోగం భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు తమ అవసరాలను తీర్చుకోవడానికి, తమకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడానికి క్రెడిట్ కార్డులు విచ్చలవిడిగా వాడేస్తున్నారు. క్రెడిట్ మొత్తాన్ని ఈఎంఐగా మార్చుకుని కట్టేస్తున్నారు. దీంతో నెలవారీ ఖర్చుల భారం భారీగా పెరిగిపోతుంది. ఇలా క్రెడిట్ కార్డులను విచ్చలవిడిగా వినియోగించడం, అప్పులు చేయడం వల్ల ఆర్ధికంగా కుదేలవుతారని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంపాదనంతా అప్పులు తీర్చేందుకే సరిపోతుందని.. పొదుపు చేయడం కష్టతరం అవుతుందంటున్నారు.
రెండు..
అత్యవసర నిధి ఉండాలి. ఎప్పుడైనా అనారోగ్య సమస్య తలెత్తవచ్చు. లేదా ఉద్యోగం కోల్పోవచ్చు. అలాంటి సమయంలో ఈ అత్యవసర నిధి కీలకంగా మారుతుంది. అయితే, కొందరి వద్ద అత్యవసర నిధి ఉండదు. దీంతో అవసరమైనప్పుడు అప్పుల కోసం చూస్తుంటారు. తెలిసిన వారిని, తెలియని వారిని అప్పులు అడుగుతుంటారు. మరి అప్పు దొరుకుతుందా అంటే కష్టమే అని చెప్పాలి. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం. అందుకే.. ముందు చూపుతో వ్యవహరిస్తూ కనీసం 6 నెలల ఖర్చులకు సంబంధించిన డబ్బును ఆదా చేసుకోవడం ఉత్తమమైన మార్గం. లేదంటే.. అత్యవసర సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మూడు..
మరికొందరు ప్రజలు.. ఇతరులతో పోల్చుకుంటూ సమస్యలను ఏరికోరి తెచ్చుకుంటారు. తమ పొరుగువారికి కారు ఉంటే.. మనకు కూడా ఆ వాహనం ఉండాలనుకుంటారు. ఆ క్రమంలో హోదా కోసం కార్లు, ఖరీదైన గాడ్జెట్‌లను కొనుగోలు చేస్తారు. సరిపడా డబ్బు, ఆదాయం లేకపోయినా రుణాలు తీసుకుని మరీ నచ్చినవి కొనుగోలు చేస్తుంటారు. దీని ఫలితంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోతారు. ఇంకేముంది.. ఆందోళన, ఒత్తిడి సదరు వ్యక్తుల జీవితంలో భాగమైపోతుంది. అందుకే.. గొప్పలకు పోవద్దని, ఉన్నదాంట్లో సర్దుకుని జీవించాలని నిపుణులు సూచిస్తున్నారు.
నాలుగు..
ఇక ఎందులో అయినా పెట్టుబడి పెట్టేటప్పుడు ముందస్తు ప్లాన్ అనేది ఉండదు. క్రిప్టో, స్టాక్ ఎక్సేంజ్ఇ అంటూ బ్బడిముబ్బడిగా ఎందులోపడితే అందులో పెట్టుబడులు పెట్టేస్తుంటారు. కనీస అవగాహన, ప్లాన్ లేకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే.. పెట్టుబడులు పెట్టేముందు ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. ఎందులో పెట్టుబడి పెడితే ప్రయోజనం కలుగుతుందో, లాభాలు వస్తాయో పరిశీలించాలి. ఆ తరువాత పెట్టబడులు పెట్టాలని హితవు చెబుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఎస్ఐపీలలో ఇన్వెస్ట్‌మెంట్ల గురించి తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే మధ్యతరగతి ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని అంటున్నారు.
అసలు సిసలు చిట్కా..
మొత్తం మీద మధ్యతరగతి ప్రజలు.. వచ్చిన జీతాన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాలి. అంటే.. తొలుత చిన్న చిన్న అప్పులు ఉంటే వాటిని తీర్చేయాలి. ఆ తర్వాత ఇంటికి కావాల్సిన సరుకులు తెచ్చుకోవాలి. ఇక మిగిలిన నగదులో కొంత సొమ్ము బ్యాంక్ లేదా పోస్టాఫీసుల్లో నెలనెల దాచుకోవాలి. ఏ రోజు ఏ అనారోగ్యం మనల్ని చుట్టు ముడుతుందో తెలియదు. ఈ నేపథ్యంలో పదో పరకో దాచుకోవాలి.
ఒక వేళ అత్యవసరమై అప్పు తీసుకోవాల్సి వస్తే మాత్రం తొలుత జీవిత భాగస్వామితో చర్చించి ఒక నిర్ణయానికి రావాలి. ఆ తర్వాత ముందుకు అడుగు వేయాలి. అప్పుగా తీసుకున్న నగదు.. చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాలి. ఇలా ఒక పద్దతి ప్రకారం ముందుకు వెళితే మధ్య తరగతి వారు సైతం సంపన్న వర్గం జాబితాలో చేరేందుకు ఎక్కువ సమయం పట్టదని నిపుణులు చెబుతున్న మాట.
ఈ వార్తలు కూడా చదవండి..
రోజుకు రూ.6తో SBI నుంచి రూ. 40 లక్షల లబ్ధి పొందవచ్చని మీకు తెలుసా?
వాళ్లు కొంటున్న బంగారం చూస్తే అబ్బురపడాల్సిందే.. నెలలో 39 వేల కిలోలు
For More Business News And Telugu News